Saturday, June 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆదాయమే ప్రభుత్వ లక్ష్యం

ఆదాయమే ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

మన వనరులే మన పెట్టుబడి
పొరుగు రాష్ట్రాలకు ఇసుక
ఎగుమతిపై అధ్యయనం
పీపీపీ మోడల్‌లో
పర్యాటక ఆస్తుల అభివృద్ధి
టెంపుల్, ఎకో,
హెల్త్ టూరిజంపై దూకుడు
వారాంతంలో హెలికాప్టర్ పర్యటకానికి ప్రణాళికలు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్ర‌భుత్వం ఆదాయ వ‌న‌రులు తెచ్చే రంగాల‌పై పూర్తిగా దృష్టి పెట్టాల‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. మన వనరులే మన పెట్టుబడి అని ఆయన అన్నారు. శుక్ర‌వారం డాక్టర్‌ ‌బిఆర్‌ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో ఆదాయ వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌పై మంత్రివ‌ర్గ ఉప సంఘం స‌మావే‌శాన్ని నిర్వహించారు. ఈ స‌మావేశంలో మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జూప‌ల్లి కృష్టారావు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా భ‌ట్టి మాట్లాడుతూ ఆదాయాన్ని పెంచుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలోరి పర్యాటక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగిం చుకోవాల్సిన అవ‌రం ఉంద‌ని అన్నారు. ప‌ర్యాట‌క కేంద్రాల్లోని ప్ర‌భుత్వ భూములు, స్థ‌లాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించి ఖ‌జానాకు ఆదాయాన్ని తేవాల‌ని సూచించారు. గోవా, కేర‌ళ‌ వంటి రాష్ట్రాలు ప‌ర్యాట‌కాన్ని స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకుంటు న్నాయ‌ని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు ఉపాధిని క‌ల్పించ‌డ‌మే కాకుండా జీడీపీ పెరుగుద‌ల‌కు టూరిజం ఉపయోగ‌ప‌డుతోంద‌ని వివరించారు. తెలంగాణలోనూ టూరిజాన్ని అలాగే అభివృద్ధి చేయాల‌ని అధికారుల‌కు సూచించారు.

టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం రంగాల్లో మ‌రింత దూకుడుగా ముందుకు వెళ్లాల‌ని ఆయ‌న అన్నారు. వారాంతాల్లో హెలికాప్ట‌ర్ టూరిజాన్ని పెంచేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని కోరారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో పర్యటకాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టులు చేపట్టాలని ‌సూచించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టూరిజం ఆస్తులు పూర్తి స్థాయిలో వినియోగంలో లేవ‌న్నారు. వాటిని పీపీపీ మోడల్‌‌లో అభివృద్ధి చేసి సంప‌ద సృష్టించాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించారు. ఆదాయ స‌మీక‌ర‌ణ‌లో ప‌ర్యాట‌క ప్రాంతాల్లో మౌలిక వ‌స‌తులు, అభివృద్ధి కీల‌క పాత్ర పోషిస్తాయని అన్నారు. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి లక్ష్యాల సాధనలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. పీపీపీ ఆధారిత సమగ్ర పర్యాటక అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి క్యాబినెట్ ముందుంచాలని ఆదేశించారు.

లోయ‌ర్ మానేరు, అప్ప‌ర్ మానేరు, మేడిగడ్డ త‌దిత‌ర ప్రాంతాల్లో జ‌రుగుతున్న పూడిక‌తీత ప‌నుల‌పై మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష చేసింది. చ‌ట్ట‌ప‌రమైన నిబంధ‌న‌లు పాటించే క్ర‌ష‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని నిర్ణయించింది. నది ఇసుకతో పోలిస్తే రోబో శాండ్ త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తోంద‌ని గుర్తించింది. ఇరుగు పొరుగు రాష్ట్రాల‌కు ఇసుక‌ను ఎగుమ‌తి చేయ‌డంపై సాధ్యాసాధ్యాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. రాష్ట్రంలో రిజిష్ట్రేష‌న్ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా శ్లాబ్ అధారిత భూముల విలువ స‌వ‌ర‌ణ వ‌ల్ల మెరుగైన ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని వివరించారు. ర‌వాణాశాఖ‌కు సంబంధించి ఆదాయం రావడానికి వసూళ్లు పెంచేలా చ‌ర్య‌లు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష‍ చేసింది. అందులో భాగంగా బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ల విషయంలో పన్నులపై రాష్ట్ర అధికారాన్ని సమర్థిస్తూ కేరళకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినట్టు గుర్తించింది. భార‌త్ సిరీస్ రిజిస్ట్రేష‌న్ల‌పై చట్టపరమైన, విధానపరంగా తీసుకోవ‌ల్సిన అంశాల‌పై చ‌ర్చించింది.

బీహెచ్ సిరీస్ పన్నుల అంశంపై చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. పరిశ్రమల శాఖకు సంబంధించి పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ కార్యక్రమాల ద్వారా ఆదాయ సమీకరణను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఫ్యూచ‌ర్ సిటీ డెవ‌ల‌ప్ మెంట్అథారిటీ క‌మిష‌న‌ర్ శ‌శాంక, తెలంగాణ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ వైస్ చైర్మెన్, ఎండీ అనుదీప్ దురిశెట్టి, డిప్యూటీ సీఎం స్పెష‌ల్ సెక్రెట‌రీ కృష్ణ భాస్క‌ర్‌, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ స్పెష‌ల్ సెక్రెట‌రీ రాజీవ్ గాంధీ హ‌నుమంతు, రవాణా శాఖ క‌మిష‌నర్‌ ఇ‌లంబర్తి, ముఖ్యకార్యదర్శి ఎన్‌ శ్రీధ‌ర్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్ర‌సాద్‌, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చ‌క్ర‌వ‌ర్తి, ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ త‌ద‌త‌రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -