రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు
హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా
అధికారుల హామీతో ధర్నా విరమణ
నవతెలంగాణ-వెల్దండ
నిత్యం పురుగుల అన్నం తినలేక.. ఖాళీ కడుపుతో పస్తులు ఉండలేక అవస్థలు పడుతున్నామంటూ నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ రహదారిపై బుధవారం ధర్నా, రాస్తారోకో చేశారు. వివరాల్లోకి వెళితే.. వెల్దండ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో గత కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు వసతి గృహ ప్రహరీ గోడను దూకి శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి మీద రాస్తారోకో నిర్వహించారు. వారికి మద్దతుగా స్థానిక నాయకులు సైతం ధర్నాలో పాల్గొని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ అన్నంలో పురుగులు వస్తున్నాయని ప్రిన్సిపల్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని, పరుష పదజాలంతో మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతినెల ఏదో ఒక కార్యక్రమం పేరిట డొనేషన్లు అడుగుతుంటే తల్లిదండ్రులను అడగలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. పేదలను కాబట్టే ప్రభుత్వ వసతి గృహాలలో చదువుతున్నామని డొనేషన్లు అడిగితే ఎక్కడి నుంచి తీసుకురావాలని మీడియా ద్వారా ప్రిన్సిపల్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ వసతి గృహాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేయాలని కోరారు. సంఘటన స్థలానికి చేరుకున్న వెల్దండ ఎస్‌ఐ కురుమూర్తి, తహసిల్దార్ కార్తీక్ కుమారులు విద్యార్థులతో మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి కావడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
పురుగుల అన్నం మాకొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



