Monday, June 22, 2026
E-PAPER
Homeకథశిథిల స్వప్నం..

శిథిల స్వప్నం..

- Advertisement -

పచ్చటి తివాచీ పరచినట్టున్న ఇండోనేషియా కొండకోనల మధ్య నుంచి ఉదయపు చల్లటి గాలి వీస్తోంది. ఆ గాలితో పాటు ప్రశాంతతను ఆస్వాదిస్తూ, తన లైబ్రరీలో కూర్చుని ఇమ్రాన్‌ తాపీగా వార్తా పత్రిక చదువుతున్నాడు. అప్పటిదాకా ఎంతో ప్రశాంతంగా ఉన్న అతని ముఖం, పత్రికలోని ఒక వార్తా కథనం చదవగానే అకస్మాత్తుగా తీవ్రమైన బాధను పులుముకుంది. ఆ కళ్లలో ఏదో తెలియని భయం, ఆవేదన సుడులు తిరిగాయి. కిచెన్‌లో నుంచి ఇమ్రాన్‌కు కాఫీ తెచ్చిన అతని భార్య జైనబ్‌, అతని పరిస్థితిని గమనించి ”ఏమైందండీ.. ఎందుకంత బాధలో ఉన్నారు?” అని అడిగింది. ”భారతదేశంలో మళ్లీ మత అల్లర్లు జరిగాయి జైనబ్‌. పత్రికలో ఆ వార్త చదువుతుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది” అని భారంగా నిట్టూర్చాడు ఇమ్రాన్‌. అతని చేతుల వణుకుతో వార్తాపత్రిక పేజీలు రెపరెపలాడాయి. తన ముందు నిలబడి ఉన్న జైనబ్‌ వైపు అతను తల ఎత్తి చూసినప్పుడు, ఆ కళ్లలో నీడలా అలుముకున్న భయం ఆమెకు స్పష్టంగా కనిపించింది. ఇమ్రాన్‌ చూపు మళ్ళీ పత్రిక వైపు మళ్లింది. అందులో ఒక ఫొటోలో కాలిన మసితో ఉన్న ఒక ఇంటి ముందు కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తున్న ఒక వద్ధురాలి దృశ్యం.

ఆ ఫొటో కింద ఉన్న సోషల్‌ మీడియా కామెంట్ల ప్రస్తావన చదవగానే ఇమ్రాన్‌ ముఖం వెలవెలబోయింది. గట్టిగా కళ్లు మూసుకున్నాడు. ఆ మూసిన కళ్ల వెనుక కూడా అల్లర్లలో సజీవ దహనమైన బాధితుల హదయవిదారక ఆక్రందనలు, హాహాకారాలు వినిపిస్తున్నాయి. అతడి నుదుటిపై చెమట పట్టింది. తన ఫోన్‌ తీసి సోషల్‌ మీడియా చూశాడు. అందులో కొందరు ఆ మంటలను చూసి వెకిలిగా నవ్వుతూ, బాధితులను నిందిస్తూ పెడుతున్న పోస్టులు ఇమ్రాన్‌ను మరింత బాధ పెట్టాయి. అసహ్యంతో ఫోన్‌ను సోఫాలో పడేశాడు. ఆ నిస్సహాయత, ఆ ఆవేదన అతని గొంతులో గుటకగా మారి అడ్డుపడింది. సాటి మనిషి చావులో ఆనందాన్ని వెతుక్కునే జాంబీలలాంటి వికత మనస్తత్వాన్ని తలచుకుని అతనికి గాలి ఆడనట్టుగా అనిపించింది. అతని కళ్లలో కాంతి తగ్గిపోయి, ఒక విధమైన చీకటి ముసిరింది. తన మాటలతో ఆ చీకటిని తొలగిస్తూ, ”ఆరోజు మనం భారతదేశాన్ని వదిలి వచ్చేటప్పుడు మీరు చెప్పిన మాటలు నేను వినకపోయి ఉంటే, బహుశా ఆ నరకం లాంటి వాతావరణంలో మన పిల్లలు ఎంత భయపడుతూ బతకాల్సి వచ్చేదో కదా. మన వాళ్ల మీద కూడా ఆ ప్రభావం ఎప్పటికీ ఉండిపోయేది” అని జైనబ్‌ ఆవేదనతో బదులిచ్చింది.

”అవును జైనబ్‌.. ఆరోజు మనం మన ఊరిని, మన వాళ్లను వదిలేసి ఇక్కడికి రావడమే మంచిదైంది. నా పిల్లల భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదని నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఈ రోజు జరుగుతున్న సంఘటనలు మళ్లీ రుజువు చేస్తున్నాయి” అని విచారంగా బరువెక్కిన హదయంతో ఇమ్రాన్‌ అన్నాడు.
”సరే అండీ.. జరిగింది తలుచుకుని బాధపడకండి. ముందు ఈ వేడి కాఫీ తీసుకోండి. వంట మనిషితో కలిసి ఈరోజు మధ్యాహ్నానికి వంట వండాలి” అని చెబుతూ ఆ కాఫీ కప్‌ను ఇమ్రాన్‌ చేతికి అందించి వంటగది వైపు జైనబ్‌ అడుగులు వేసింది. న్యూస్‌ పేపర్‌ను పక్కకు పెట్టి, ఆ కాఫీని మెల్లగా సిప్‌ చేస్తూ ఇమ్రాన్‌ తనకు తెలియకుండానే ఇండోనేషియా దీవుల సముద్ర తీరాలను దాటి సుదూర గతంలోకి, తనను నిత్యం వెంటాడే ఆ చేదు జ్ఞాపకాల్లోకి జారుకున్నాడు. 2024 సంవత్సరం చివర్లో.. ఒకానొక సాయంత్రం. సమయం ఆరు గంటలు అవుతోంది. తన మిత్రుడు అభినవ్‌ చౌదరితో కలిసి గాంధీ నగర్‌లోని ‘ఆంధ్రా కెఫే’కు ఇమ్రాన్‌ వెళ్లాడు.

అదొక రద్దీ ప్రాంతం. ఒక టేబుల్‌ దగ్గర కూర్చుని ఇద్దరూ చారు ఆర్డర్‌ చేశారు. టీ సప్లయర్‌ రెండు టీ గ్లాసులను తెచ్చి అందించాడు. ఇద్దరూ నెమ్మదిగా టీ సిప్‌ చేస్తూ, కెఫేలోని టీవీలో వార్తలను చూస్తున్నారు. ”నిందితుల ఇళ్లను కూల్చుతున్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం.. విచారణ పూర్తి కాకముందే బుల్డోజర్‌ న్యాయంతో శిక్ష.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటున్న మానవ హక్కుల సంఘాలు.. బుల్డోజర్లతో ఇళ్లను కూల్చడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్న ప్రతిపక్షాలు.. అమానవీయ చర్యలంటూ ఖండించిన సామాజిక కార్యకర్తలు..” అని వస్తోన్న బ్రేకింగ్‌ న్యూస్‌ చూడగానే ఇమ్రాన్‌ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. అతని గుండెలో ఏదో తెలియని భయం పట్టుకుంది. ”చూశావా అభినవ్‌.. ఇంకా నేరం రుజువు కాకముందే వాళ్ల ఇళ్లను ఎలా కూల్చేస్తున్నారో. కళ్లెదుటే వాళ్ల బతుకులు అలా శిథిలమైపోతుంటే ఎవరూ అడ్డుకోవడం లేదు..” అని బాధతో అన్నాడు. ఆ మాటలు పక్క టేబుల్‌ మీద ఉన్న ఓ వ్యక్తి చెవిన పడ్డాయి. నుదుటిన కురచ బొట్టు పెట్టుకుని, కళ్లలో నరనరాన నిండిన కరుడుగట్టిన ద్వేషాన్ని, క్రూరత్వాన్ని నింపుకున్న ఆ వ్యక్తి ఇమ్రాన్‌ వైపు ఎంతో అసహ్యంగా, ఛాతి మీద కాలుబెట్టి నిలువునా ఇమ్రాన్‌ను బాకుతో చీల్చేలా చూశాడు.

”దోషుల ఇళ్లను కూల్చకుంటే ఇంకేం చేస్తారురా? ఈ జిహాదీ గాళ్లు ఊర్ల మీద పడి ల్యాండ్‌ జిహాద్‌తో నానా అరాచకాలు సష్టిస్తున్నారు. వీళ్లకు ఇలాంటి కఠినమైన శిక్షే పడాలి. బుల్డోజర్లతో తొక్కించి చంపేయాలి లం… కొడుకులను” అంటూ ఉద్దేశపూర్వకంగా గట్టిగా, కర్కశంగా అరిచాడు. ఆ గొంతులో సాటి మనిషి పట్ల కాస్త జాలి కూడా లేదు.. ద్వేషం తప్ప. అతని క్రూరత్వం ఆ కెఫే అంతా పాచి తీగలా పాకింది. అందరి చూపులు ఇమ్రాన్‌ మీద పడ్డాయి. కొందరి చూపుల్లో అతని పట్ల సానుభూతి, మరికొందరి చూపుల్లో వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆ చూపులను ఇమ్రాన్‌ తట్టుకోలేకపోయాడు. ఇమ్రాన్‌, అభినవ్‌ చౌదరి ఇద్దరూ ఆ విషపు మాటలకు ఏమీ సమాధానం చెప్పలేదు. వివాదం ఇష్టం లేక ఏమీ మాట్లాడకుండా ఉండిపోయినా అది అక్కడితో ఆగలేదు. కురచ బొట్టున్న వ్యక్తి ముందు కూర్చున్న మరో వ్యక్తి, అంతకన్నా నీచంగా ”వీడి వాలకం చూస్తుంటే, వీడు కూడా ఆ జిహాదీగాడిలానే ఉన్నాడు నాయుడు. అందుకే వాళ్లను వెనుకేసుకుని వస్తున్నాడు.

వీళ్ల జాతే అంత, పుట్టుకతోనే వీళ్లు దేశద్రోహులు” అని మరింత విద్వేషపూరితంగా, ఇమ్రాన్‌ గుండెను కోసేలా, అతని ఉనికిని అవమానిస్తూ అన్నాడు.
బకెట్‌లో హీటర్‌ పెట్టిన నీటిలా అభినవ్‌ రక్తం మరిగిపోయింది. ఇమ్రాన్‌ను ఉద్దేశించి అంతటి నీచమైన మాట అనడం ఏమాత్రం నచ్చక, కట్టలు తెంచుకున్న ఆవేశంతో, తన చేతికి ఉన్న రాగి కంకణాన్ని ఎడమ చేతితో పైకి లేపుతూ వాడి పళ్లు రాలగొడదామని లేవబోయాడు. వివాదాలకు, గొడవలకు దూరంగా ఉండే ఇమ్రాన్‌, వెంటనే అభినవ్‌ కుడి చేయి గట్టిగా పట్టుకుని ”వద్దు అభినవ్‌.. వదిలేరు. వాడు కావాలనే గొడవకు దిగుతున్నాడు. మనకు వద్దు ఈ గొడవ, ఇక్కడ నుంచి వెళ్లిపోదాం పద” అంటూ తన మిత్రుడిని బతిమాలుతూ బలవంతంగా తీసుకెళ్లిపోయాడు. టేబుల్‌ మీదున్న కప్‌లో సగం చారు ఎలా అయితే మిగిలిపోయి ఉందో, ఇమ్రాన్‌ను మతం పేరుతో అవమానించిన ఆ వ్యక్తులలోని దురహంకారం, విద్వేషం కూడా పూర్తిగా సంతప్తి చెందనట్టుగా మిగిలిపోయింది. ఇమ్రాన్‌, అభినవ్‌ తలదించుకుని నిస్సహాయంగా వెళ్తుంటే వాళ్లను చూస్తూ వెకిలిగా, క్రూరంగా నవ్వుతూ తమ రాక్షస ఆనందాన్ని బయటపెట్టుకున్నారు ఆ వ్యక్తులు. ఆ నవ్వు ఇమ్రాన్‌ ఆత్మను నిలువునా కాల్చివేసింది. ”నా సొంత దేశంలో నాకు రక్షణ లేదా?” అనే ప్రశ్న భూకంపంలా అతన్ని కుదిపేసింది.

ఆంధ్రా కెఫెలో జరిగిన ఆ గొడవ రోజు రాత్రి.. 2 గంటల సమయం, నిద్ర పట్టకపోవడంతో ఇమ్రాన్‌ తన ఇంట్లోని లైబ్రరీలో కూర్చుని ఎలీ వీజెల్‌ రాసిన ‘నైట్‌’ పుస్తకాన్ని చదువుతున్నాడు. ఆ పుస్తకంలోని నాజీ కాలం నాటి భయంకరమైన వాస్తవాలను, యాదుల నెత్తుటి చరిత్రను తెలుసుకుని అతని గుండె భయంతో వణికిపోయింది. భారతదేశంలో కూడా పరిస్థితులు నెమ్మదిగా అలా నరకకూపం వైపే వెళ్తున్నాయని, ఆ రాక్షసత్వం, ఆంధ్రా కెఫెలో చూసిన ద్వేషం రేపు తన ఇంటి గుమ్మం దాకా వస్తుందని భావించి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం దేశం వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బెడ్‌ రూంలో ప్రశాంతంగా నిద్రపోతున్న తన భార్య దగ్గరకు బరువైన అడుగులతో వెళ్లి ”జైనబ్‌.. జైనబ్‌..” అని మెల్లగా వణుకుతున్న స్వరంతో పిలిచాడు. భర్త పిలుపులోని ఆందోళన, భయాన్ని గుర్తించిన జైనబ్‌ వెంటనే మేలుకుని, కళ్లు నులుముకుంటూ ”ఇంత రాత్రి నిద్ర లేపారు.. ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నారు?” అని అడిగింది. ”నేనొక నిర్ణయానికి వచ్చాను జైనబ్‌. మనం ఈ దేశాన్ని వదిలి ఇండోనేషియాకు వెళ్దాం. మనల్ని ఎవరూ అనుమానంగా చూడని, పగతో రగిలిపోని ఆ చోట ప్రశాంతంగా బతుకుదాం” అని బదులిచ్చాడు.

ఇమ్రాన్‌ మాటలను విన్న జైనబ్‌ ఆశ్చర్యపోయి ”ఏమైంది మీకు.. ఇంత రాత్రి పూట ఏం మాట్లాడుతున్నారు? చెడు కల ఏమైనా వచ్చిందా? ఉదయం తీరిగ్గా మాట్లాడుదాం. ముందు నిద్రపోండి..” అని సర్దిచెబుతూనే.. భర్త ఉన్నట్టుండి ఎందుకు ఇలా చెప్పాడా అని ఆలోచిస్తూ మళ్లీ నిద్రలోకి జారుకుంది.
ఇమ్రాన్‌ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ, తన తల్లిదండ్రుల భద్రత, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రపోయాడు.
ఉదయం నిద్ర నుంచి లేచిన ఇమ్రాన్‌, స్నానం చేసి డైనింగ్‌ రూంలో కూర్చున్నాడు. జైనబ్‌ ఆప్యాయంగా వడ్డిస్తుంటే మౌనంగా తింటున్నాడు. ఆ మౌనాన్ని ఫోన్‌ నోటిఫికేషన్‌లా ఛేదిస్తూ జైనబ్‌ మెల్లగా మాటలు కలుపుతూ, ”రాత్రి ఉన్నట్టుండి ఇండోనేషియా వెళ్లిపోదాం అన్నారు. ఎందుకు? అసలు ఏమైంది?” అని అడిగింది.
ఇమ్రాన్‌ నోటికాడి చేతుల్లోని ముద్ద బలవంతంగా ఏదో అదశ్యశక్తి ఆపినట్టు ఆగిపోయింది. అతని చేతివేళ్లు తేలికపాటి భూకంపానికి ఇళ్లు వణికినట్టుగా నెమ్మదిగా వణకడం మొదలుపెట్టాయి. కిందికి దించిన తల పైకెత్తకుండానే ఉక్కిరిబిక్కిరి అవుతూ.. ”నిన్న ఆంధ్రా కెఫెలో.. నన్ను, నా ఉనికిని ఎలా అవమానించారో తెలుసా జైనబ్‌?” అంటున్న అతని గొంతులో స్పష్టమైన వణుకు. చేతిలోని ముద్దను పళ్లెంలో పక్కనపెట్టి, బరువెక్కిన కళ్లతో భార్య వైపు చూశాడు. ”వాళ్ల కళ్లలో నేను తోటి మనిషిని కాదు.. కేవలం ఒక మత సమూ హానికి ప్రతినిధిని. నేనొక నేరస్థుడిని అన్నట్టుగా వాళ్లు నన్ను చూశారు. ఆ చూపులు, ఆ మాటలతో నన్ను నిలువునా కోసేసినట్టు అనిపించింది. నా చుట్టూ ఉన్న గాలి కూడా నాకు పరాయి అయిపోయినట్టు ఊపిరాడలేదు తెలుసా?” అంటుంటే ఆ చేదు జ్ఞాపకం తాలూకు భయం అతని ముఖంలో కనిపించింది.

”పుట్టి పెరిగిన ఊరును, ప్రాణానికి ప్రాణమైన స్నేహితులను వదిలి వేరే దేశానికి వలస వెళ్లేలా కొన్నిసార్లు పరిస్థితులు ఉసిగొల్పుతాయి జైనబ్‌. కొందరు డబ్బు కోసం, హోదా కోసం విదేశాలకు వెళ్తే.. నేను కేవలం నా కుటుంబం భయపడకుండా బతకడం కోసం, కాసింత ప్రశాంతత కోసం వెళ్లాలనుకుంటున్నాను. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు” అని గుండెల్లో దాగున్న వేదనను వివరించాడు. ”హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌, ఎంతో పవిత్రమైన మక్కా మసీదు అంటే మీకు ఎంతో ఇష్టం కదండీ. ఈ హైదరాబాద్‌ నగరంలోనే మీరు పుట్టి పెరిగారు. అలాంటిది అన్నీ వదిలేసి ఇలా వెళ్లిపోవడం ఏంటి? పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవు కదా! కాలం మారుతుంది. కాబట్టి మనం ఇక్కడే ఉండి ధైర్యంగా బతుకుదాం” అని జైనబ్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.
”మనుషుల చూపులు, ప్రవర్తన మారిపోయాయి జైనబ్‌” అంటూ ఇమ్రాన్‌ గత రంజాన్‌ పండుగనాటి ఘటనను గుర్తు చేశాడు. అలా ఇద్దరు గతంలోకి వెళ్లారు. జైనబ్‌ తమ ఇంటి ముందున్న రాజ్యలక్ష్మికి బిర్యానీ, పాయసం ఇవ్వడానికి వెళ్లింది. జైనబ్‌ తలుపు తట్టగానే ఫేస్బుక్‌లో లీనమైన రాజ్యలక్ష్మి తలుపు తెరిచి చూసి, ”ఏమమ్మా జైనబ్‌.. ఏంటి రాక” అని చేదు వేపాకు నమిలినట్టు అడిగింది.

”ఏం లేదు భాభీ జీ.. ఈరోజు రంజాన్‌ కదా బిర్యానీ, పాయసం ఇవ్వడానికి వచ్చాను” అని ప్రేమగా ఇవ్వడానికి ప్రయత్నిస్తే, ”వద్దమ్మా.. వద్దు.. కొన్ని రోజుల క్రితం బయటి తిండి అసలే తినొద్దని అనుకున్నాను. ఎందులో ఎవరు ఏం కలుపుతున్నారో ఏమో..” అని వంకర్లు పోతూ చేతులు ఊపుకుంటూ మాట్లాడి, చీదరించుకుని మొఖం మీదే తలుపులు మూ సేసింది. అమాంతం తలుపు వేయడం వల్ల ఒక రెక్క పై అంచు సన్నగా నెర్రలు వాసింది. తలుపుకు ఆనుకుని ఉన్న సిమెంట్‌ ముక్కలు ఎగిరిపడి జైనబ్‌ ముఖానికి తగిలి గాయం చేశాయి, సిమెంట్‌ ముక్కలు చేసిన గాయం కంటే రాజ్యలక్ష్మి మాటల వల్ల ఏర్పడిన గాయమే జైనబ్‌ను ఎక్కువ బాధపెట్టింది. కిటికీలో నుంచి ఆ దశ్యాన్ని చూసిన ఇమ్రాన్‌ ఎంత బాధపడ్డాడో జైనబ్‌ అంతకు రెట్టింపు బాధపడింది. ఆరోజు అవమానంతో జైనబ్‌ ఏడ్చిన విషయాన్ని గుర్తుచేస్తూనే,” అలానే ఆఫీసులో ఎవరైనా కొత్తవాళ్లు నా పేరు వినగానే వారి ముఖాల్లో క్షణాల్లో మారిపోయే హావభావాలు, నన్నో నేరస్థుడిని చూసినట్టు చూసే ఆ చూపులు.. నన్ను ప్రతిరోజూ ఎన్నిసార్లు లోలోపల కుంగదీశాయో నీకు తెలుసా?” అని జైనబ్‌ను ఇమ్రాన్‌ ప్రశ్నించాడు. ఇమ్రాన్‌ ప్రశ్నతో గత సంఘటన జ్ఞాపకంతో విద్వేషానికి సైతం అరికట్టలేని మౌనం ఇద్దరి మధ్య కొద్దిసేపు ఆవరించింది.

బాధతో కూడిన గొంతుతో మెల్లగా మాట్లాడుతూ ”అవునండీ, ఇవన్నీ వాస్తవమే.. నేను అనుభవించాను. కానీ పుట్టిన దేశం వదిలి వెళ్లడం పరిష్కారం కాదు కదా, ఎంతో స్వచ్ఛమైన ప్రేమను పంచే యాదమ్మలాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఏదైతే అదాయే ఇక్కడే ఉండి సవాళ్లను ఎదుర్కొందాం” అని జైనబ్‌ ఆశగా అంది.
”ఎవరికోసం ఎదుర్కోవాలి జైనబ్‌? ఎవరో కొందరు నాయకుల స్వార్థం కోసం అడ్డగోలుగా జరుగుతున్న ఈ అల్లర్లలో మన పిల్లల ప్రాణాలను పణంగా పెడదామా? ఏ పాపం చేయని వాళ్ల మీద జరుగుతున్న దాడులను టీవీల్లో, న్యూస్‌ పేపర్లలో చూస్తుంటే నా రక్తం ఉడికిపోతోంది. కనీసం ఆ బాధను చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదు. ఎవరైనా ధైర్యంగా గొంతు విప్పితే, వాళ్లను అక్రమ కేసుల్లో ఇరికించి జీవితాంతం జైళ్లలో మగ్గేలా చేస్తున్నారు. నా పిల్లలు ఆ భయంలో పెరగడం నాకిష్టం లేదు. నాకు నా కుటుంబం ముఖ్యం జైనబ్‌” అని ఇమ్రాన్‌ ఆవేశపడ్డాడు. చివరకు, దేశం విడిచి వెళ్లడానికి అస్సలు ఇష్టపడని తన తల్లిదండ్రులను చేతులు పట్టుకుని బ్రతిమాలుకుని.. కేవలం తన కుటుంబాన్ని, వారి ఉనికిని, స్వేచ్ఛను కాపాడుకోవడం కోసం గుండె నిండా బాధను మోస్తూనే హైదరాబాద్‌కు కన్నీటి వీడ్కోలు పలుకుతూ ఇండోనేషియాకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు.

చివరిసారి ఇంటి వైపు చూసి జైనబ్‌ కారు ఎక్కింది. వీధి చివర నుంచి ఆయాసపడుతూ యాదమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. కట్టుకున్న పాత చీర చెంగు నేలను ఊడుస్తున్నా పట్టించుకోకుండా, అడుగులు తడబడుతున్నా లెక్కచేయకుండా రొప్పుతూ వచ్చింది. ఆమె ముఖమంతా కన్నీళ్లతో తడిసి వుంది.
”బిడ్డా.. బిడ్డా.. దేశం ఇడిసి ఎల్తున్నరట కదా..! ఎందుకు బిడ్డా ఇట్ల చేస్తుండ్రు?” అంటూ కారు డోరు పట్టుకుని కుప్పకూలిపోయినంత పని చేసింది.
”మీకేం కాదు రా.. మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేసైనా కాపాడుకుంటా.. ఈ ముసల్దాని మాట ఇని ఎల్లకుండ్రి బిడ్డా..” అని కన్నీళ్లు వరదలా పారుతుంటే దీనంగా ప్రాధేయపడింది యాదమ్మ. ”ఆయన వెళ్దాం అన్నారు. తప్పడం లేదు యాదమ్మా..” అంటూ చెమ్మగిల్లిన కళ్లతో జైనబ్‌ చెప్పింది. యాదమ్మను చూడగానే కారు దిగిన ఇమ్రాన్‌, ఆమె దగ్గరకు వచ్చాడు. వణుకుతున్న తన చేతులతో ఇమ్రాన్‌ ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుంది యాదమ్మ. ఆ ముడతలు పడిన చేతుల స్పర్శలో కల్తీలేని తల్లి ప్రేమ ఉట్టిపడుతోంది. కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ, ”బిడ్డా.. నిన్ను అమ్మలా పెంచాను. నా కడుపున పుట్టకపోయినా, మనకు పేగు బంధం లేకపోయినా.. నా సొంత కొడుకులా చూసుకున్నా రా. ప్రేమతో అడుగుతున్నా.. ఇక్కడే ఉండిపోరా నాన్న” అంటూ గొల్లుమన్నది.

ఇమ్రాన్‌ గొంతు పూడుకుపోయింది. అతని కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆ కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ, యాదమ్మ చేతులను తన చేతుల్లోకి తీసుకుని కుడి చేతి మణికట్టు మీద ముద్దు పెట్టి ”అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కదమ్మా.. ఏం బాధపడకు. విమానానికి టైం అవుతోంది, వెళ్తాము” అని భరోసా ఇచ్చాడు.
ఆ భరోసా ఎడారిలో ఎండమావిలాంటిదని ఇద్దరికీ తెలుసు. ఇమ్రాన్‌ నుదుటిపై తన వణుకుతున్న పెదవులతో ముద్దు పెట్టిన యాదమ్మ కన్నీరు అతని బుగ్గలపై జారింది. ”పైలం బిడ్డా.. ఎక్కడున్నా సల్లంగుండాలి నా కన్నా..” అని దీవించింది. ఆ తర్వాత జైనబ్‌ను గట్టిగా గుండెలకు హత్తుకుని, వెక్కి వెక్కి ఏడుస్తూ.. ”నా కొడుకును కంటికి రెప్పలా సూస్కో.. అప్పుడప్పుడు ఫోన్‌ చేస్తుండ్రి” అని వీడ్కోలు పలికింది. యాదమ్మ వైపు చూస్తూ జైనబ్‌, ఇమ్రాన్‌ కారు ఎక్కారు. ఒకవైపు విద్వేషం అగ్ని శిఖలు కక్కుతుంటే, ప్రేమతో రాలిన యాదమ్మ కన్నీళ్లు భూమిని తాకక ముందే ఆవిరైపోయాయి. ముషీరాబాద్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఇమ్రాన్‌ కుటుంబం వెళ్లేటప్పుడు కారులో ఎఫ్‌ఎం ప్లే అవుతోంది, ”శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా భాగ్యనగర్‌ అంగరంగవైభవంగా ముస్తాబయ్యింది” అని రేడియో జాకీ వెన్నెల తన శ్రోతలకు చెప్తోంది.

ఈ మాటలను పట్టించుకోకుండా డ్రైవర్‌ వంశీ కారు నడుపుతుంటే, ఇమ్రాన్‌ తన ఆలోచనలో తాను లీనమయ్యాడు. కారు ముందు సీట్లో డ్రైవర్‌ పక్కకు కూర్చున్న ఇమ్రాన్‌ ముందు నుంచి తనకు సుపరిచితమైన కూరగాయలు అమ్మే రెహానా పెద్దపెద్ద పరదాలతో ముసుగేసిన మస్జీద్‌ ముందు నుంచి వెళ్తోంది. మస్జీద్‌ వైపు బాణం ఎక్కుపెట్టిన శ్రీరాముడి భారీ కటౌట్‌ చాటు నుంచి తనను చూసిన ఇమ్రాన్‌కు ”నాకు డబ్బులు, నైపుణ్యం ఉన్నాయి. నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతున్నాను.. మరి ఇటువంటి సామాన్య ప్రజల సంగతేంటి?” అనే సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని ఆపేస్తూ చివరికి ఇమ్రాన్‌ కుటుంబం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఇండోనేషియా విమానం ఎక్కారు. ఎన్నో ఆశలతో, అంతకుమించిన భయాలతో జకార్తా నగరంలో అడుగుపెట్టిన ఇమ్రాన్‌, అక్కడ స్వేచ్ఛగా, ఎవరి ద్వేషపు చూపులు పడకుండా, మతం పేరుతో అవమానాలు పడకుండా, ప్రాణభయం లేకుండా గుండెనిండా ఊపిరి పీల్చుకున్నాడు. ఇండోనేషియాలో అతనొక ‘రెండవ తరగతి పౌరుడు’ కాదు, ఒక స్వతంత్ర మనిషి. అతని మతం గురించి, అతను తినే తిండి గురించి, అతను వేసుకునే బట్టల గురించి ఎవరూ ద్వేషపూరితంగా ప్రశ్నించరు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి బుల్డోజర్లతో వచ్చి తన ఇంటిని కూల్చే భయం అక్కడ లేదు. ఆంధ్రా కెఫెలోని విలన్లూ అక్కడ లేరు.భారతదేశం నుంచి ఇండోనేషియాకు వచ్చి అప్పటికే కొన్నేళ్ల కాలం గడిచిపోయింది. ఇంగ్లీషుపై అతనికి ఉన్న అద్భుతమైన పట్టు, ఇండోనేషియాలో అవకాశాల తలుపులు తెరిచింది. ఒక సివిల్‌ ఇంజనీర్‌గా అద్భుతమైన ప్రతిభతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు.

నుసంతారా నగర నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ఒక పెద్ద బహుళజాతి సంస్థలో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. పరోక్షంగా, ప్రత్యక్షంగా అతని కింద ఎంతో మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. తన కొడుకు పేరుతో ఇండోనేషియాతోపాటు ఇండియాలో కూడా ఎన్నో సేవా సంస్థలను స్థాపించి, పేదలకు అండగా నిలబడుతున్నాడు. నుసంతారా నగర శివార్లలో, పచ్చటి అడవుల మధ్య ప్రశాంతమైన లోయ అంచున తాను స్వయంగా, భూకంపాలను సైతం తట్టుకునేలా ఎంతో పకడ్బందీగా డిజైన్‌ చేసుకున్న ఒక అత్యంత విలాసవంతమైన భవనంలో తల్లిదండ్రులు, భార్య, ఎదిగిన పిల్లలతో ప్రశాంతంగా నివాసం ఉంటున్నాడు. తన గతపు చేదు జ్ఞాపకాల ప్రవాహం నుంచి తిరిగి వర్తమానంలోకి వచ్చాడు ఇమ్రాన్‌. కాఫీ కప్పును పక్కకు పెట్టి డైనింగ్‌ రూంలో వద్ధాప్యానికి చేరువైన తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో కలిసి టిఫిన్‌ చేసి ఆఫీసుకు వెళ్లాడు. ఆ రోజంతా గడిచిపోయింది. చీకటి పడింది. ఉదయం చూసిన వార్తల తాలూకు భారం ఇంకా మనసును తొలిచేస్తున్న ఆ రాత్రి.. సమయం సరిగ్గా 9:17 గంటలు.. ఆఫీసు పని ముగించుకుని తన కారులో ఇమ్రాన్‌ ఇంటికి బయలుదేరాడు. మార్గ మధ్యలో ఎదురుగా వచ్చిన పెద్ద లారీ ఇమ్రాన్‌ కారును బలంగా గుద్దింది. ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు రోడ్డు పక్కనున్న చెట్ల పొదల్లో పడింది. ఇమ్రాన్‌ వెంటనే స్పహ కోల్పోయాడు.

మెల్లగా స్పహలోకి వచ్చేసరికి, అతనికి దట్టమైన చీకటి కాదు, ఆసుపత్రి గదిలోని తెల్లని లైట్ల వెలుతురు కనిపించింది. కాళ్లు, చేతులకు పట్టీలు కట్టి ఉన్నాయి, కానీ శ్వాస తీసుకోవడం నిలకడగా ఉంది. ప్రాణాపాయం తప్పిందని పక్కనే కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్న జైనబ్‌, ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు, ఆందోళనగా చూస్తున్న పిల్లలు అతని కళ్లలో పడ్డారు. అదష్టవశాత్తూ తాను బతికే ఉన్నానని అతనికి అర్థమైంది. భూకంపాన్ని సైతం తట్టుకునేలా తాను ఎంతో పకడ్బందీగా డిజైన్‌ చేసుకున్న భవనంలో సురక్షితంగా ఉండాల్సిన పిల్లలు, తల్లిదండ్రులు ఇప్పుడు తన కోసం ఆసుపత్రిలో ఎదురుచూస్తూ ఉన్నారు. ఆసుపత్రి మంచం మీద, నొప్పులతో బాధపడుతూనే ఇమ్రాన్‌ మనసు భౌగోళిక సరిహద్దులను దాటుకుని భారతదేశంలోని తన పాత ఇంటి వైపు మళ్లింది. ఆంధ్రా కెఫెలో సగం తాగిన చారు గ్లాస్‌, పాతబస్తీ ఇరుకు వీధులు, జైనబ్‌ చేతుల్లో చల్లారిపోయిన బిర్యానీ పాత్ర, అభినవ్‌ చౌదరి ఆవేశం, యాదమ్మ స్వచ్ఛమైన ప్రేమ.. అన్నీ ఒకేసారి కళ్ల ముందు మెదిలాయి. ఒక క్షణం ”అక్కడే నిలబడాల్సిందా…?” అనే ఆలోచన అతని లోపల మెదిలి వేడి నిట్టూర్పుతో మళ్లీ కరిగిపోయింది. చావు అంచుల దాకా వెళ్లి బతికి బయటపడినందుకు సంతోషించాలో, తన సొంత గడ్డపై ప్రాణ రక్షణ, ప్రశాంతత ఎందుకు కరువైపోయాయో తెలియక అతని కళ్లలో నుంచి జారిన కన్నీటి బొట్టు వెచ్చగా బుగ్గలపై రాలింది.

– సయ్యద్‌ ముజాహిద్‌ అలీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -