Friday, February 20, 2026
E-PAPER
Homeజాతీయంఅనిల్‌ అంబానీకి బిగుస్తున్న ఉచ్చు

అనిల్‌ అంబానీకి బిగుస్తున్న ఉచ్చు

- Advertisement -

మరోమారు ఈడీ నోటీసులు
దేశం వీడి పోనని సుప్రీంకోర్టుకు హామీ

ముంబయి : బ్యాంక్‌ల మోసం కేసు, మనీలాండరింగ్‌లో రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఉచ్చు బిగుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 26న విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆయన భార్య టీనా అంబానీకి రెండుసార్లు సమన్లు పంపినప్పటికీ, ఆమె ఇప్పటివరకు విచారణకు హాజరు కాలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌కామ్‌), రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ సంస్థల్లో జరిగినట్టు ఆరోపిస్తున్న భారీ బ్యాంక్‌ మోసాలపై ఈ దర్యాప్తు జరుగుతోన్న విషయం తెలిసిందే.

ఈ ఏడాది జనవరిలో ఈడీ సుమారు రూ.1,885 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడంతో, ఈ కేసులో ఇప్పటివరకు అటాచ్‌ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.12,000 కోట్లకు చేరుకుంది. వీటిలో బ్యాంక్‌ బ్యాలెన్స్‌లు, షేర్లు, స్థిరాస్తులు ఉన్నాయి. ఇప్పటికే రిలయన్స్‌ అనిల్‌ అంబానీ గ్రూప్‌ రుణ ఖాతాలను ఫ్రాడ్‌ (మోసం)గా తొమ్మిది బ్యాంక్‌లు ప్రకటించాయి. ఆర్‌కామ్‌, దాని అనుబంధ సంస్థలు దాదాపు రూ. 40,185 కోట్ల బకాయిలు కలిగి ఉన్నాయి. ఇందులో రూ.13,600 కోట్లను పాత అప్పులు తీర్చేందుకు, మరో రూ.12,600 కోట్లను తమ స్వంత అనుబంధ సంస్థలకు అక్రమంగా మళ్లించారని బ్యాంకుల ప్రధాన అరోపణ.

అనుమతి లేకుండా దేశం వీడను..
బ్యాంక్‌లకు టోకర కొట్టిన కేసులో అనిల్‌ అంబానీ సుప్రీంకోర్టులో ఒక కీలకమైన హామీ పత్రం దాఖలు చేశారు. తాను ముందస్తు అనుమతి లేకుండా భారతదేశాన్ని వదిలి వెళ్లనని, దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. బ్యాంకింగ్‌, కార్పొరేట్‌ మోసం ఆరోపణలపై సీబీఐ, ఈడీ జరుపుతున్న విచారణకు తాను పూర్తిగా అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. గతేడాది జులైలో దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుండి తాను దేశం విడిచి వెళ్లలేదని, ప్రస్తుతం విదేశాలకు వెళ్లే ఉద్దేశం లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఒకవేళ అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తీసుకుంటానని తెలిపారు. ఈ కేసుల దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఫిబ్రవరి 4న సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేయాలని ఈడీని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -