హైదరాబాద్ లో విద్యార్థి అరెస్ట్
హైదరాబాద్: ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగన్న గూడ జడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రంలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. అచ్చంపేటకు చెందిన అభ్యర్థి పాఠశాల మరుగుదొడ్డిలో ఫోన్ దాచాడు. ఉదయం 7 గంటలకే పరీక్ష కేంద్రానికి వచ్చిన అభ్యర్థి జిప్‌లాక్ కవర్‌లో ఫోన్ ఉంచి మరుగుదొడ్డి ప్లష్ ట్యాంక్‌లో దాచాడు. అనంతరం పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష మధ్యలో కడుపునొ ప్పి అంటూ మరుగుదొడ్డికి వెళ్లిన విద్యార్థి ఎంతకూ బయటకి రాకపోవడంతో ఇన్విజిలేటర్లు తనిఖీ చేశారు. ఫోన్‌లో సమాధానాలు వెతుకుతూ చిక్కాడు. పోలీసులు విద్యార్థి నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
లోదుస్తుల్లో సిమ్, పాత ప్రశ్నపత్రంతో పరీక్షకు..
నీట్ ఎగ్జామ్ రాసేందుకు ఓ అభ్యర్థి వారణాసిలోని హరిశ్చంద్ర పోస్ట్‌గ్రాడ్యుయేట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి వచ్చాడు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల సమయంలో భద్రతా సిబ్బందికి అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయగా అతడి లోదుస్తుల్లో దాచి ఉంచిన సిమ్ కార్డు, నీట్ పరీక్షకు సంబంధించిన ఓ పాత ప్రశ్నపత్రం బయటపడ్డాయి.
బీహార్‌లో తొమ్మిది మంది అదుపులోకి..
బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో నీట్ పరీక్ష రాసేందుకు ఒకరి స్థానంలో మరొకరు వచ్చారన్న ఆరోపణలపై తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాగ్‌లింగంపల్లి బదులు శేరిలింగంపల్లికి వెళ్లి..
జంటనగరాల్లోనూ నీట్ పరీక్షకు భారీగా అభ్యర్థులు హాజరయ్యారు. పేరెంట్స్ తోడు రాగా..పలు పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడింది. పలుచోట్ల అభ్యర్థులకు అవగాహ నలేకపోవటంతో పలు ఇబ్బందులు పడ్డారు. పరీక్ష కేంద్రం చిరునామా విషయంలో గందరగోళానికి గురై ఓ విద్యార్థిని నీట్ పరీక్ష రాయలేకపోయింది. ఈ ఘటన హైదరా బాద్‌లో చోటుచేసుకుంది. కొడంగల్‌కు చెందిన ఝాన్సీప్రియ నీట్ యూజీ (రీఎగ్జామ్) పరీక్ష రాసేందుకు హైదరాబాద్ వచ్చింది. పరీక్ష కేంద్రం బాగ్‌లింగంపల్లిలో కేటాయించారు. ఝాన్సీప్రియ తొలుత బాగ్‌లింగంపల్లి బదులు శేరిలింగంపల్లికి వెళ్లింది. పొరపాటును గ్రహించి బాగ్‌లింగంపల్లికి చేరుకునేలోపు నీట్ పరీక్ష గడువు ముగిసింది. పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోవడంతో నిరాశతో ఆమె వెనుదిరిగింది. మరోవైపు కోఠిలోని నీట్ పరీక్ష కేంద్రానికి నలుగురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు.



