మితవాద శక్తులకు వ్యతిరేకంగా
బలపడుతున్న కమ్యూనిస్టు పోరాటాలు
నాసిక్, గురుగావ్ పోరాటాలు స్ఫూర్తిదాయకం : వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ ఆహ్వాన కమిటీ
అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి
మహబూబ్‌నగర్ నుంచి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలు పుంజుకుంటున్నాయనీ, ఢిల్లీలో ఎర్రకోటపై ఎర్రజెండా ఎగిరు తీరుతుందని వ్యవసాయ కార్మిక సంఘం మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభ లో ఆదివారం ఆయన స్వాగతోపన్యాసం చేశారు. సామ్రాజ్యవాద అమెరికా గుండె కాయ న్యూయార్కులో లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి మేయర్ అయ్యారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మితవాద శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పోరాటాలు బలపడుతున్నాయని చెప్పారు. గురుగావ్‌లో వేలాదిమంది కార్మికులు రోడ్లపైకి వచ్చి పోరా టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. మహా రాష్ట్ర లో రైతులు వ్యవసాయ కార్మికులు చేపట్టిన పాదయాత్రలు స్ఫూర్తిదాయ కమన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్న పాలమూరు గడ్డకు బలమైన చారిత్రక పోరాట నేపథ్యం ఉందని చెప్పారు. కోయిల్ కొండ దర్గా ఏటా జరిగే పీర్ల పండుగ లో వేలాదిమంది హిందువులు ముస్లింలు కలిసి పాల్గొంటారనీ, అది మతసామరస్యానికి ప్రతీక అని చెప్పారు.
కొత్త రాతి యుగం కాలంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మనుషులు నివసించారనే ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్య రాణిగా పట్టాభిషేకం చేయడంలో పాలమూరు జిల్లాకు చెందిన గోనగన్నారెడ్డి పాత్ర కీలకమైనదని వివరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా గుండా 200 కిలోమీటర్ల మీరా కృష్ణానది పారుతున్నా ఈ జిల్లాలో భూములు బీడు బారే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాలో పది నుంచి 12 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారనీ, వారిలో పనులు లేక ఎక్కువగా వలస వెళుతున్నారని చెప్పారు. దేశంలో పాలమూరు కూలీల రక్తం, చెమట చిందని ప్రాజెక్టులు, హైవేలు లేవన్నారు. ఈ గడ్డకు చెందిన సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందిన విషయాన్ని గుర్తు చేశారు. గోనబుద్ధారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, గోరేటి వెంకన్న వంటి ఎంతోమంది రచయితలను కవులను అందించిన ఘనత ఈ గడ్డకుందని గర్వంగా చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు రంగమ్మ నాయకత్వంలో పెద్ద కొత్తపెల్లి పోలీస్ స్టేషన్ పైన జరిగిన దాడిని గుర్తు చేశారు.
సాయుధ పోరాటంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన చాకలి కాశయ్య చెంచు రామయ్య చిన్న పాపయ్య కొండ వీరయ్య నరసింహలాంటి ఎంతోమంది అమరులయ్యారని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భూస్వామీల దుర్మార్గాలకు దోపిడీకి అధిక వడ్డీ నాగు వసులకు వ్యతిరేకంగా సామాన్య రైతులను చేరదీసి ఎర్రజెండా ఆధ్వర్యంలో తూముకుంట, తదితర ప్రాంతాల్లో జరిగిన పోరాటాల గురించి వివరించారు. 1985 – 86 ప్రాంతంలో తీవ్ర కరువు సమయంలో గ్రామాల్లో అంబలి కేంద్రాలను, వైద్య శిబిరాలను నడిపిన చరిత్ర ఎర్రజెండాకు ఉందని తెలిపారు. బొల్లారం, అయినవోలు, బొమ్మనపల్లి, సింగారం, రేమద్దుల వంటి గ్రామాల్లో జరిగిన భూ పోరాటాలను, ఆ పోరాటాల్లో అమరులైన వారిని స్మరించుకున్నారు. ఎర్రజెండా ఆధ్వర్యంలో పాలమూరు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం 2005లో 1158 కిలోమీటర్ల మేర జరిగిన పాదయాత్ర గురించి సమగ్రంగా వివరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం బలమైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.


