29 బంతుల్లోనే 94 బాదిన సూర్యవంశీ
ఫైనల్లో శ్రీలంక-ఏపై భారత్-ఏ ఘన విజయం
ఏ జట్ల ముక్కోణపు
సిరీస్ భారత వశం
దంబుల్లా (శ్రీలంక) : ఐపీఎల్లో ప్రపంచశ్రేణి బౌలర్లకు చుక్కలు చూపించిన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోనూ తడాఖా చూపిస్తున్నాడు. ‘ఏ’ జట్ల ముక్కోణపు సిరీస్ లీగ్ దశలో ఆశించిన ప్రదర్శన కనబరచని వైభవ్ సూర్యవంశీ.. ఆదివారం జరిగిన ఫైనల్లో విశ్వరూపం దాల్చాడు. న్యూ చంఢీగడ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లను ఉతికారేసిన వైభవ్.. దంబుల్లాలో శ్రీలంక-ఏ బౌలర్లను ఊచకోత కోశాడు. 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లోనే 94 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీకి తోడు కెప్టెన్ తిలక్ వర్మ (67, 90 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అనుకూల్ రాయ్ (39, 15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) సైతం రాణించటంతో భారత్-ఏ తొలుత 50 ఓవర్లలో 9 వికెట్లకు 377 పరుగులు చేసింది. భారత బౌలర్లు విప్రాజ్ నిగమ్ (3/60), యశ్ ఠాకూర్ (3/45), అనుకూల్ రాయ్ (2/42) దెబ్బకు ఛేదనలో శ్రీలంక-ఏ 47.1 ఓవర్లలో 311 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక-ఏ బ్యాటర్లలో వనుజ సహన్ (62, 69 బంతుల్లో 5 ఫోర్లు), సదీర సమరవిక్రమ (52, 44 బంతుల్లో 9 ఫోర్లు) అర్థ సెంచరీలతో రాణించారు. 66 పరుగుల తేడాతో భారత్-ఏ ఘన విజయం సాధించింది. ముక్కోణపు వన్డే సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
వైభవ్ అదరహో
ఏ జట్ల ముక్కోణపు సిరీస్ ఫైనల్లో తుది ఫలితంపై ఉత్కంఠ లేదు. కానీ గత మ్యాచ్‌లో శ్రీలంక-ఏ ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ గొడవ నేపథ్యంలో యువ బ్యాటర్ ప్రదర్శనపైనే ఫోకస్ కనిపించింది. ఊహించినట్టుగానే కసిగా క్రీజులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం చూపించాడు. 11 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి లిస్ట్-ఏ చరిత్రలో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ సాధించాడు. 4 ఫోర్లు, 6 సిక్సర్లతో విరుచుకుపడిన వైభవ్ సూర్యవంశీ తొలి పది ఓవర్లలోనే మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. వైభవ్ ధనాధన్‌తో 8.5 ఓవర్లలోనే భారత్-ఏ తొలి వికెట్‌కు 132 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించింది. మరో ఓపెనర్ ప్రియాన్షు ఆర్య (39, 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) సహా ఇతర బ్యాటర్లు ధాటిగా ఆడటంలో విఫలం అయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ (40, 51 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (67, 90 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), కుమార్ కుశాగ్ర (36, 39 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువ బంతులు ఆడి తక్కువ పరుగులే చేశారు. ఆఖర్లో అనుకూల్ రాయ్ (39, 15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) ధనాధన్ మెరుపులతో అదిరే ముగింపు అందించాడు. 50 ఓవర్లలో భారత్ 9 వికెట్లకు 377 పరుగుల భారీ స్కోరు చేసింది. శ్రీలంక-ఏ బౌలర్లలో మథులన్ (2/82), ఫెర్నాండో (2/72), వనుజా సహన్ (2/39) రాణించారు.
బౌలర్లు మెరువగా ..
శ్రీలంక-ఏ బ్యాటర్లు సమిష్టిగా రాణించినా… లక్ష్యం కొండంత ఉండటంతో చేతులెత్తేశారు. 47.1 ఓవర్లలో 311 పరుగులకే ఆతిథ్య జట్టు ఆలౌటైంది. టాప్ ఆర్డర్ అవిష్క ఫెర్నాండో (3), నువానిందు ఫెర్నాండో (21), నిరోషన్ డిక్వెల్లా (25) తేలిపోగా.. సదీర సమరవిక్రమ (52), సహాన్ (38), వనుజా సహాన్ (62), విజయ్‌కాంత్ (39) పోరాడారు. భారత-ఏ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టగా ఛేదనలో శ్రీలంక-ఏ ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్, అనుకూల్ రాయ్‌లు ఆతిథ్య జట్టును శాసించారు. 66 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్-ఏ ముక్కోణపు వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది.
సంక్షిప్త స్కోరు వివరాలు :
భారత్-ఏ ఇన్నింగ్స్ : 377/9 (వైభవ్ సూర్యవంశీ 94, తిలక్ వర్మ 67, రుతురాజ్ గైక్వాడ్ 40, అనుకూల్ రాయ్ 39, వనుజా సహాన్ 2/39)
శ్రీలంక-ఏ ఇన్నింగ్స్ : 311/10 (వనుజా సహాన్ 62, సదీర సమరవిక్రమ 52, యశ్ ఠాకూర్ 3/45, విప్రాజ్ నిగమ్ 3/60, అనుకూల్ రాయ్ 2/42)
వైభవ్ ఊచకోత
- Advertisement -
- Advertisement -



