ఆరంభ మ్యాచ్‌లో ఖమ్మం జట్టు గెలుపు
నవతెలంగాణ-హైదరాబాద్ :
టీజీ20 లీగ్ ఆరంభమైంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లీగ్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఆరంభ వేడుకల్లో సినీ సంగీత దర్శకులు తమన్ బృందం ఆట పాటతో అభిమానులను ఉర్రూతలూగించగా, లీడ్ బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి, టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మెన్ ఆగం రావు, డిజీపీ సీవీ ఆనంద్, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు వి. చాముండేశ్వరినాథ్, క్రికెటర్ మహ్మద్ సిరాజ్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తదితరులు ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు.
ఆందోళన వద్దు, అనుమతి ఉంది ! :
కొద్ది రోజులుగా టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతులు లేవనే ప్రచారం నేపథ్యంలో బోర్డు అపెక్స్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరినాథ్ స్పందించారు. ‘క్రికెటర్లు, ప్రాంఛైజీలకు ఎటువంటి భయం అవసరం లేదు. ఈ లీగ్‌కు బీసీసీఐ అనుమతి ఉంది. హెచ్‌సీఏ, టీజీ20 లీగ్‌కు శుభాకాంక్షలు తెలపాలని బోర్డు కార్యదర్శి దేవాజిత్ సైకియా నాతో సందేశం పంపించారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్‌గా చెబుతున్నాను.. ఇది బోర్డు అనుమతితో జరుగుతున్న టోర్నమెంట్.ఎటువంటి ఆందోళన అవసరం లేదు’ అని అన్నారు.
ఖమ్మం బోణీ :
టీజీ20 ఆరంభ మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్ గెలుపొందింది. పాలమూరు స్ట్రయికర్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. వఫీ ఖాచి (60), కృష్ణారెడ్డి (52), హిమతేజ (59) అర్థ సెంచరీలతో రాణించటంతో తొలుత ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 237 పరుగులు చేసింది. ఛేదనలో పాలమూరు స్ర్టయికర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులే చేసింది. ఓపెనర్ విఘ్నేష్ రెడ్డి (86, 31 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) వీరోచిత ఇన్నింగ్స్‌తో చెలరేగినా.. ఇతర బ్యాటర్లు అంచనాలను అందుకోలేదు.
టీజీ20 లీగ్ షురూ
- Advertisement -
- Advertisement -



