నవతెలంగాణ – కంఠేశ్వర్
నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన ఐడీఓసీలో గర్భస్తపూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశము జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. జిల్లాలో స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయాలన్నారు.
జిల్లాలో ఉన్న స్కానింగ్ కేంద్రాలన్నీ రికార్డులను, రిపోర్టులను క్రమం తప్పకుండా నమోదు చేయాలని, లేనిచో వారికి రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయకూడదని అన్నారు. పిసిపిఎన్డిటి చట్టంపై విస్తృతంగా అవగాహన సదస్సులను నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, పీ.ఓ లు సుప్రియ, శిఖర, డిప్యూటీ డీఎంహెచ్ఓలు అశ్వినీ, సమత, రెడ్ క్రాస్ ప్రతినిధి బుస్స ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



