పనులను అడ్డుకున్న సంబంధిత రైతులు
పనులు చేయటానికి వీలు లేదంటూ జెసిబి ముందు కూర్చున్న మందడపు రామారావు
అది ప్రభుత్వ భూమి – సాగు భూమి కాదు
గిర్దావర్ – 2 జంగంగూడెం మైథిలి
పనులను అడ్డుకుంటున్న రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సుమారు రెండు గంటల పాటు సంఘటన స్థలంలో ఉద్రిక్తత పరిస్థితులు
ఎస్సై పొదిలి వెంకన్న రంగ ప్రవేశంతో పనులు ప్రారంభం
నవతెలంగాణ – బోనకల్
అది తమకు వారసత్వంగా 60 సంవత్సరాల పైనుంచి అనుభవిస్తున్నామని, ఆ భూమి తమదేనని, ఆ భూమిని విద్యుత్ సబ్ స్టేషన్ కు ఇవ్వబోమని కొంతమంది రైతులు నిర్మాణ పనులను శుక్రవారం అడ్డుకున్నారు. దీంతో సుమారు రెండు గంటల పాటు సంఘటన స్థలములో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండల గిర్దావర్ – 2 జంగం గూడెం మైథిలి ఆ పొలాన్ని విద్యుత్ అధికారులకు అప్పగించేందుకు శుక్రవారం వెళ్లారు. ఆ పొలాన్ని విద్యుత్ అధికారులకు అప్పగించి పనులను ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నాలు చేయగా రైతులు ఆ భూమి మాది అంటూ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. చివరకు బోనకల్ ఎస్సై పొదిలి వెంకన్న రంగ ప్రవేశం చేసి సంబంధిత రైతులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత నిర్మాణ పనులను విద్యుత్ శాఖ అధికారులు ప్రారంభించిన సంఘటన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోనే బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
బ్రాహ్మణపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 116 లో 35 కుంటల బంచరాయి భూమి ఉంది. ఈ భూమిని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మందడపు నారాయణ అనుభవదారుడు పేరుతో 2013 వరకు ఉంది. 2013 నుంచి ప్రభుత్వ భూమిగా రికార్డులలో వస్తుంది. ఈ క్రమంలో బ్రాహ్మణపల్లి గ్రామానికి విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు అయింది. మండల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాల గుర్తింపులో భాగంగా ఈ పొలాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించారు. ఆ విధంగా సర్వే చేసి ఆ స్థలంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి రెవెన్యూ అధికారులు ఆమోద ముద్ర వేసి జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం సుమారు 6 నెలల క్రితం పంపించారు. దీంతో జిల్లా కలెక్టర్ కూడా ఆమోదముద్ర వేశారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారులు నాలుగు సార్లు నిర్మాణ పనుల కోసం ఆ స్థలము వద్దకు వెళ్లగా ఆ భూమి మాది అంటూ మందడపు ఉషారాణి, మందడపు రమ, మందడపు రామారావు అడ్డుకున్నారు.
తాము కలెక్టర్ ను కలిసి సమస్యను వివరించుకుంటామని తనకు సమయం ఇవ్వాలంటూ కోరడంతో నేటి వరకు గడువు ఇచ్చారు. అయితే ఇటీవల జిల్లా కలెక్టర్ మండల రెవెన్యూ అధికారులకు ఆ స్థలాన్ని వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు అప్పగించాలని సీరియస్ గా ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా శుక్రవారం మండల గిర్ధవర్ – 2 జంగంగూడెం మైథిలి ఆ స్థలాన్ని మధిర విద్యుత్ డి ఈ బండి శ్రీనివాసరావు, బోనకల్ విద్యుత్ సబ్ డివిజన్ ఏడిఈ వైవి ఆనందరావు, మండల విద్యుత్ ఏఈ తోకల మనోహర్ కు అప్పగించేందుకు వెళ్లారు. విషయం తెలిసి సంబంధిత రైతులు మందడపు ఉషారాణి, మందడపు రమ, మందడపు రామారావు సంఘటన స్థలాన్ని వద్దకు వెళ్లారు. ఈ భూమిని సుమారు 60 ఏళ్లకు పైగా అనుభవిస్తున్నామని ఈ భూమిలో నిర్మాణ పనులు చేపట్టడానికి వీలులేదని అడ్డుకున్నారు. జెసిబి ద్వారా నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నం చేయగా మందడపు రామారావు జెసిబి ముందు కూర్చొని పనులను అడ్డుకున్నారు. దీంతో తాత్కాలికంగా నిర్మాణ పనులు అధికారులు నిలిపివేశారు.
మహిళా రైతుల పనుల వద్దకు వెళ్లకుండా స్థానిక మహిళ పోలీస్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో సుమారు రెండు గంటల పాటు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్నాయి. రైతులు పనులు చేయటానికి వీలు లేదంటూ తీవ్రంగా అడ్డుకోవడంతో బోనకల్ ఎస్సై పొదిలి వెంకన్న రంగ ప్రవేశం చేశారు. రైతులతో చర్చలు జరిపారు. ఈ భూమిని విద్యుత్ సబ్ స్టేషన్ కు ఇస్తున్నట్లు తమకు ఎటువంటి సమాచారం అధికారులు ఇవ్వలేదని, మాకు సమాచారం ఇవ్వకుండా మా భూమిని ఎలా తీసుకుంటారని ఎస్సై వెంకన్నను రైతులు ప్రశ్నించారు. దీంతో ఎస్ఐ స్పందిస్తూ మీకు ఆధారాలు ఉంటే లీగల్ గా వెళ్లాలని పనులు అడ్డుకోవటానికి వీలులేదని స్పష్టం చేశారు. అయినా రైతుల తాము పనులను అడ్డుకుంటామని స్పష్టం చేయటంతో రైతులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ అధికారులు నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఆరు దశాబ్దాలుగా తాము అనుభవిస్తున్నాము: రైతులు
ఆరు దశాబ్దాలుగా ఈ భూమిని తాము అనుభవిస్తున్నామని రైతులు మందడపు ఉషారాణి, మందడపు రమ, మందడపు రామారావు తెలిపారు. మందడపు నారాయణ పేరుతో ఈ భూమి ఉందని వారి వారసులుగా ఈ భూమి తమదేనని రైతులు తెలిపారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తాము అనుభవిస్తున్న భూమిని అధికారులు ఎలా స్వాధీనం చేసుకుంటారని వారి ప్రశ్నించారు. తమ భూమిలోకి తమను వెళ్ళనీయకుండా పోలీసులు, విద్యుత్ శాఖ, రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తాము నిర్మాణ పనులను అడ్డుకొని తీరుతామని వారు స్పష్టం చేశారు. భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఐదుగురు తో పంచనామ నిర్వహించామని మండల గిర్ధవర్ చెబుతున్నారని ఆ వివరాలు తమకు చూపించాలని వారు కోరారు.
ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొనే హక్కు ఉంది: గిర్దావర్ మైథిలి
ప్రస్తుతం ఆ భూమి సాగులో లేదని, పైగా ఆ భూమి ప్రభుత్వ భూమి అని అందువలనే ఆ భూమిని తాము స్వాధీనం చేసుకున్నామని మండల గిర్ధవర్ జంగంగూడెం మైతిలి తెలిపారు. ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వం చేసుకునే హక్కు ఉందన్నారు. ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. అది ప్రభుత్వ నిర్ణయం అన్నారు. పైగా ప్రస్తుతం ఆ భూమి నిరుపయోగంగా ఉందని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ భూమిని స్వాధీనం చేసుకొని విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి విద్యుత్ శాఖ అధికారులకు అప్పగిస్తుంటే ఆ భూమి మాది అంటూ రైతులు అడ్డగిస్తున్నారని ఆమె తెలిపారు. అది ప్రభుత్వ భూమితో పాటు ప్రస్తుతం ఆ భూమి నిరుపయోగంగా ఉండటం వలన ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామని ఆ స్థలంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.


