నవతెలంగాణ-హైదరాబాద్ : చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ఐటీ-ఫార్మా షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. రోజులో ఎక్కువ భాగం ఒడుదొడుకులు కనిపించినప్పటికీ చివరికి కీలక సూచీలు పాజిటివ్‌గానే స్థిరపడ్డాయి.
సెన్సెక్స్ 291 పాయింట్లు పెరిగి 77,094 వద్ద ముగిసింది. నిఫ్టీ 90 పాయింట్లు లాభపడి 24,102 వద్ద స్థిరపడింది. ఐటీ, ఆరోగ్య రంగ షేర్లు మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ వంటి షేర్లు రాణించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.34 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.6 శాతం పెరిగాయి. దీంతో పెద్ద కంపెనీలతో పాటు మధ్య, చిన్న తరహా షేర్లపైనా పెట్టుబడిదారుల ఆసక్తి కనిపించింది.
ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. కీలక ఆర్థిక పరిణామాలపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ చమురు ధరల తగ్గుదల సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.



