Tuesday, June 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఖతార్‌ గ్యాస్‌ క్షేత్రంలో భారీ పేలుడు

ఖతార్‌ గ్యాస్‌ క్షేత్రంలో భారీ పేలుడు

- Advertisement -

13మంది మృతి, 18మంది గల్లంతు
ఇంధన ధరలపై ప్రభావం
ఖతార్‌లోని రస్‌లఫాన్‌
గ్యాస్‌ క్షేత్రంలో ప్రమాదం

రస్ లఫాన్ : ఖతార్‌లోని రస్‌ లఫాన్‌ గ్యాస్ ఎగుమతి కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్టు ఖతార్‌ ఇంధన శాఖ మంత్రి వెల్లడించారు. పదుల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 18 మంది ఆచూకీ గల్లంతైంది. మార్చి నెలలో ఇరాన్ దాడిలో రస్ లాఫాన్ ప్రాంతంలో మిసైల్ పడడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. అప్పటినుంచి ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి కార్యకలా పాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని ఖతార్ ఎనర్జీ వెల్లడించింది. ఈ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, మంటలు చెలరేగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

దర్యాప్తు ప్రారంభం
ప్రమాదం జరిగినప్పటికీ, ఎటువంటి గ్యాస్ లీకేజీ లేదా ప్రజలకు ప్రమాదం కలిగించే పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేశారు. రస్ లఫాన్ ప్రాంతంలో భద్రతా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా గ్యాస్ ప్లాంట్ పరిసర ప్రాంతాలను తాత్కాలికంగా ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు. పేలుడు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సాంకేతిక లోపమా, భద్రతా వైఫల్యమా లేదా ఇతర కారణాలా అన్నది దర్యాప్తు తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సాంకేతిక నిపుణుల బృందాలు ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించాయి. ప్రస్తుతం రక్షణ బృందాలు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

ప్రపంచ ఇంధన సరఫరాలపై ప్రభావం
ఈ ఘటన ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఖతార్ ప్రపంచంలో అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతి దేశాల్లో ఒకటి. ఈ టెర్మినల్‌లో ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో సరఫరా ఒత్తిడి పెరగవచ్చు. ఇటీవల హర్మూజ్ జలసంధి పరిణామాల కారణంగా ఎగుమతులు ప్రభావితమవడంతో ఇప్పటికే ఖతార్ ఉత్పత్తి తగ్గించినట్లు తెలుస్తోంది.
ఖతార్‌ రాజధాని దోహాకు 80 కిలోమీటర్ల దూరంలో రస్‌ లఫాన్‌ నగరం ఉంది. ఇక్కడి నుంచి దాదాపు 30 దేశాలకు గ్యాస్‌ ఎగుమతి అవుతోంది. వీటిల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన జపాన్‌, దక్షిణ కొరియా, భారత్‌, ఐరోపా సమాఖ్య, చైనా వంటి దేశాలు ఉన్నాయి. భౌగోళికంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉండటంతో ఇది ఆసియా, ఐరోపా ఎగుమతులకు అత్యంత అనువైన ప్రదేశంగా ఉంది. బర్జాన్‌ గ్యాస్ ప్లాంట్ రోజుకు సుమారు 1.4 బిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ ఫీట్ గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిని ప్రధానంగా ఖతార్ దేశీయ విద్యుత్ ఉత్పత్తి, అలాగే ఎడారి ప్రాంతాల్లో నీటి శుద్ధి ప్లాంట్ కోసం వినియోగిస్తారు. ఈ ప్లాంట్ మెజారిటీ వాటా ఖతార్ ప్రభుత్వ సంస్థ ఖతార్ ఎనర్జీ వద్ద ఉండగా, కొంత భాగం అమెరికన్ ఎనర్జీ దిగ్గజం ఎక్సాన్‌మొబిల్‌కు ఉంది.
ఖతార్, ఇరాన్ కలిసి పర్షియన్ గల్ఫ్‌లోని అతిపెద్ద ఆఫ్‌షోర్ గ్యాస్ ఫీల్డ్‌ను పంచుకుంటున్నాయి. ఈ సహజ వాయువు నిల్వలే ఖతార్ ఆర్థిక శక్తికి ప్రధాన ఆధారం అయ్యాయి. ఈ వనరుల ద్వారానే ఖతార్ ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని పెంచుకుంది. 2022 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణ, అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా వార్తా నెట్‌వర్క్‌ స్థాపన, అలాగే స్విట్జర్లాండ్లో జరిగిన చర్చలతో సహా పలు కార్యకలాపాలకు ఈ నిధులను ఉపయోగించుకుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -