విధి నిర్వహణలో ఉన్న
డీటీఓ వెంకన్న మృతి
ప్రమాదంపై పలు అనుమానాలు?
15 రోజుల క్రితమే బదిలీపై వచ్చిన ఆర్టీవో
సీఎం, మంత్రి పొన్నం సంతాపం
నవతెలంగాణ-గణపురం
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ ఆర్టీవో కార్యాలయం ముందు సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న డీటీఓ వెంకన్నను బొగ్గు లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్కపల్లి ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేసిన డీటీఓ వెంకన్న ఒక హార్వెస్టర్‌ను కాగితాలు లేకపోవడంతో పట్టుకున్నాడు. ఆ వాహనాన్ని ఆర్టీవో కార్యాలయానికి రావాలని ఆదేశించాడు. అనంతరం అక్కడి నుంచి ఆర్టీవో కార్యాలయం చేరుకున్న వెంకన్న.. కార్యాలయం ముందు ఉండి ఇసుక, బొగ్గు లారీలను తనిఖీ చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రజావాణికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పటికే అక్కడికే చేరుకున్న హార్వెస్టర్.. కార్యాలయం లోపలికి వస్తున్న క్రమంలో.. లారీలు నెమ్మదిగా రావాలంటూ వెంకన్న చెయ్యి లేపి అడ్డు పెట్టాడు. ఇదే క్రమంలో తాటిచెర్ల నుంచి అతివేగంగా వస్తున్న బొగ్గు లారీ.. వెంకన్నను ఢీకొట్టింది. దాంతో వెంకన్న నడుము కింది భాగం నుజ్జు నుజ్జు అయి అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడే ఉన్న తోటి సిబ్బంది.. గమనించి వెంకన్నను కాపాడేందుకు పరుగులు తీశారు. కాగా, వెంకన్న 15 రోజుల క్రితమే జగిత్యాల జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన వెంకన్న 2012లో రవాణా శాఖలో ఏఎంవీఐగా ఉద్యోగంలో చేరి.. అంచలంచెలుగా ఎదిగి ప్రమోషన్‌లో డీటీఓగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హనుమకొండలో నివాసం ఉంటూ రాకపోకలు కొనసాగిస్తున్నాడు. ఆయన మృతదేహాన్ని భూపాలపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే అధికారిగా పేరున్న వెంకన్న మృతి పట్ల జిల్లా యంత్రాంగం, రవాణా శాఖ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీవో కార్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వెంకన్నకు భార్య ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

డీటీఓ మృతిపై సంతాపం తెలిపిన మంత్రి పొన్నం, జిల్లా కలెక్టర్
జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మరణించడం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మకు ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన ఎంతో విషాదకరమని పేర్కొంటూ, మరణించిన అధికారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రహదారి భద్రతపై నెలరోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల్లో వెంకన్న చాలా చురుకుగా పాల్గొన్నారని గుర్తుచేశారు. విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై తగిన విచారణ జరిపి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మరణించిన వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న లారీ ప్రమాదంలో మరణించడం పట్ల జిల్లా కలెక్టర్ రాహూల్ శర్మ సంతాపం తెలిపారు. ఆస్పత్రిలో వెంకన్న మృతదేహాన్ని సందర్శించిన కలెక్టర్ భావోద్వేగానికి గురయ్యారు. సాధారణ బదిలీల్లో భాగంగా జగిత్యాల జిల్లా నుంచి ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చారని, విధి నిర్వహణలో అంకితభావం, నిబద్ధత కలిగిన అధికారిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయ సమావేశం హాల్‌లో సంతాప సభ నిర్వహించి వెంకన్న చిత్రపటానికి పూల మాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఆరఓ వసంత కుమారి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎంవీఐ వెంకన్న మృతిపై సమగ్ర విచారణ: సీఎం ఆదేశాలు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోటార్ ట్రాన్సోర్డు అధకారి వెంకన్న మృతిపై సమగ్ర విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకుని తనకు నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. రవాణా శాఖ సంయుక్త ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్ను విచారణ అధికారిగా నియమించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదికను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. క్షేత్రస్తాయిలో విధులు నిర్వహించే అధికారుల భద్రత, వాహనాల తనిఖీలు , సీజ్ ప్రక్రియలో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలు, ప్రోటోకాళ్లపై సూచనలు ఇవ్వాలని విచారణాధికారిని ఆదేశించారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని రవాణా కమిషనర్‌కు సీఎం సూచించారు. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు సోమవారం జారీ చేశారు.



