Wednesday, June 24, 2026
E-PAPER
Homeజాతీయంఏఐ యుగంలో సివిల్ ఇంజినీరింగ్‌కు జై

ఏఐ యుగంలో సివిల్ ఇంజినీరింగ్‌కు జై

- Advertisement -

ఐఐటీల్లో మారుతున్న విద్యార్థుల అభిరుచులు టాప్‌ ‌ర్యాంకర్ల చూపు అటు వైపే
కోడింగ్ కంటే దేశ ‘నిర్మాణానికే’ ప్రాధాన్యం
ఏఐ ప్రభావంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలపై సందేహాలు
మౌలిక సదుపాయాల విస్తరణతో సివిల్ ఇంజినీరింగ్‌కు కొత్త వెలుగు


న్యూఢిల్లీ : ఒకప్పుడు ఐఐటీల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల మొదటి ఎంపిక కంప్యూటర్ సైన్స్ (సీఎస్‌ఈ) మాత్రమే. ఆకర్షనీయమైన మంచి జీతాలు, విదేశీ అవకాశాలు, స్టార్టప్ విజయగాథలు, కోట్ల రూపాయల ప్లేస్‌మెంట్ ప్యాకేజీలు.. ఇవన్నీ కలిసి కంప్యూటర్ సైన్స్‌ను ఇంజినీరింగ్‌లో అగ్రస్థానానికి చేర్చాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి కోర్ బ్రాంచ్‌లు కూడా కీలకమైనవే అయినా..సీఎస్‌ఈ ఆకర్షణ ముందు అవి వెనుకబడిపోయాయి. అయితే 2026 ఐఐటీ ప్రవేశాల తొలి దశ ఫలితాలు ఒక ఆసక్తికరమైన మార్పును సూచిస్తున్నాయి. ఇప్పటివరకు కంప్యూటర్ సైన్స్‌నే లక్ష్యంగా పెట్టుకున్న కొందరు ప్రతిభావంతులైన జేఈఈ అడ్వాన్స్‌‌డ్‌ ‌ర్యాంకర్లు.. ఇప్పుడు సివిల్ ఇంజినీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కేవలం బ్రాంచ్ మార్పు కాదనీ, భారత యువత.. భవిష్యత్తును ఎలా అర్థం చేసుకుంటుందో చెప్పే సంకేతమని మేధావులు అంటున్నారు.

ఆశ్చర్యపరిచిన ‘జోసా’ గణాంకాలు
జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జేఓఎస్‌ఏఏ-జోసా) గణాంకాలు విద్యా రంగంలో చర్చకు దారితీశాయి. ఐఐటీ బాంబేలో సివిల్ ఇంజినీరింగ్ కోసం సీటు పొందిన విద్యార్థుల ప్రారంభ ర్యాంకు గత ఏడాది 2,666 కాగా.. అది ఈసారి 385కి చేరుకుంది. ఐఐటీ ఢిల్లీలో ఈ సంఖ్య 3,030 నుంచి 179కు పెరిగింది. ఐఐటీ రూర్కీ, ఐఐటీ భువనేశ్వర్‌లలో కూడా ఇలాంటి ధోరణే కనిపించింది. అయితే దీనర్థం కంప్యూటర్ సైన్స్‌కు విద్యార్థులు దూరమవుతున్నారని కాదు. ఇప్పటికీ టాప్-100 ర్యాంకర్లలో ఎక్కువ మంది సీఎస్‌ఈనే ఎంచుకుంటున్నారు. కానీ టాప్ ర్యాంకుల తర్వాతి విద్యార్థులు మాత్రం సంప్రదాయ ఆలోచనలకు అతీతంగా, దీర్ఘకాలిక అవకాశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఏఐ తెచ్చిన అనిశ్చితి
గత పదేండ్లుగా కంప్యూటర్ సైన్స్ అంటే ఉద్యోగ భద్రతకు హామీ అన్న భావన ఉండేది. ఒక మంచి ఐఐటీలో సీఎస్‌ఈ చదివితే భారీ జీతంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఖాయం అన్న నమ్మకం ఏర్పడింది. కానీ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆ ఆలోచనలను మార్చేలా చేస్తోంది. ఏఐ టూల్స్.. కోడ్ రాయడం, బగ్‌లను గుర్తించడం, సాధారణ ప్రోగ్రామింగ్ పనులను స్వయంగా చేయగలు గుతున్నాయి. ఒకప్పుడు జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు లభించిన పనుల్లో కొంత భాగం ఇప్పుడు వీటి చేతుల్లోకి వెళ్తోంది. దీంతో విద్యా ర్థుల మెదళ్లలో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘‘భవిష్యత్తులో బేసిక్‌ కోడింగ్ పనులే లేకపోతే, కంప్యూటర్ సైన్స్ చదివిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది?’’ అనే సందేహం వారిలో పెరుగుతోంది. టెక్నాలజీ రంగం లో నియామకాలు గత కొంతకాలంగా హెచ్చు తగ్గులకు లోనవడం కూడా ఈ ఆందోళనలకు బలం చేకూర్చింది. సాఫ్ట్‌వేర్ రంగం ఇప్పటికీ బలంగానే ఉన్నప్పటికీ.. అది ఇక శాశ్వత భద్రతకు ప్రతీకగా కనిపించడం లేదని విద్యార్థులు భావిస్తున్నారు.

దేశ ‘నిర్మాణం’ వైపు అడుగులు
అత్యధిక ప్యాకేజీలు లభించే సాఫ్ట్‌‌వేర్‌ ‌రంగం వైపు కంటే.. ఉద్యోగ భద్రత, స్థిరమైన వేతనాలు ఉండే రంగం వైపు వెళ్లడం శ్రేయస్కరమన్న ఆలోచనల వారిలో కనిపిస్తోంది. ఇందులో భాగంగా సివిల్‌ ఇంజినీరింగ్‌ ద్వారా దేశాన్ని ‘నిర్మించడం’ వైపు విద్యార్థుల అడుగులు కనిపిస్తున్నాయి. కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, మెట్రో రైలు మార్గాలు, హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు వంటివి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రూపుదిద్దుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సివిల్ ఇంజినీర్లకు భారీ స్థాయిలో అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇది కేవలం భవనాలు నిర్మించే ఉద్యోగం మాత్రమే కాదనీ, రేపటి నగరాలను, రవాణా వ్యవస్థలను, నీటి నిర్వహణను, వాతావరణ మార్పులకు తట్టుకునే మౌలిక సదుపాయాలను రూపొందించే బాధ్యత, గొప్ప అవకాశంగా నేటి యువత ఆలోచిస్తున్నది.

మారిపోయిన సివిల్ ఇంజినీరింగ్ రూపం
నేటి సివిల్ ఇంజినీరింగ్ గతంలో ఉన్నట్టుగా కేవలం కాంక్రీట్, ఉక్కు, వంతెనల నిర్మాణానికి పరిమితం కాలేదు. ఇప్పుడు ఈ రంగంలో కూడా డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, జీఐఎస్, రిమోట్ సెన్సింగ్, డిజిటల్ ట్విన్స్, సస్టెయినబిలిటీ టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఐఐటీ బాంబేలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ రిసోర్సెస్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఆర్‌ఈ) ద్వారా ‘మెషిన్ లెర్నింగ్ ఫర్ రిమోట్ సెన్సింగ్’ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్‌లో ‘రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ అప్లికేషన్స్ టు సివిల్ ఇంజినీరింగ్’, ‘స్మార్ట్ మొబిలిటీ’ వంటి ఆధునిక అంశాలు బోధిస్తున్నారు. అంటే.. ఇది టెక్నాలజీతో మిళితమైన కొత్త తరం ఇంజినీరింగ్‌గా మారుతోంది.

ప్యాకేజీ వద్దు..కెరీర్‌ స్థిరత్వం ముద్దు
గతంలో విద్యార్థులు ఎక్కువగా ప్లేస్‌మెంట్ ప్యాకేజీల ఆధారంగా బ్రాంచ్ ఎంపిక చేసుకునేవారు. కంప్యూటర్ సైన్స్ పట్టభద్రులు సంవత్సరానికి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు సంపాదించే అవకాశాలు ఉండగా.. సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థుల సగటు వేతనాలు సాధారణంగా రూ.8 లక్షల పరిధిలో ఉంటాయి. అయితే నేటి విద్యార్థులు కేవలం ప్రారంభంలో వచ్చే భారీ జీతాన్ని మాత్రమే కాకుండా కెరీర్ స్థిరత్వం, దీర్ఘకాలిక అవకాశాలు, పరిశోధన, ఉన్నత విద్య, సమాజంపై ప్రభావం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఒకపక్క సాఫ్ట్‌వేర్ రంగం వేగంగా మారిపోతుంటే.. రైల్వేలు, పట్టణాభివృద్ధి, జల వనరుల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో మాత్రం దశాబ్దాలపాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి వాతావరణ మార్పులు, నీటి సంక్షోభం, పట్టణీకరణ వంటి ప్రపంచ సమస్యల పరిష్కారంలో సివిల్ ఇంజినీరింగ్ కీలక పాత్ర పోషించనుందని విశ్లేషకులు చెప్తున్నారు.

బ్రాంచ్ కంటే ఐఐటీ బ్రాండ్‌కు ప్రాధాన్యం
ఇంకో ముఖ్యమైన మార్పు విద్యార్థుల ఆలోచనల్లో కనిపిస్తోంది. చాలామంది కొత్త ఐఐటీల్లో కంప్యూటర్ సైన్స్‌ను ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు కొందరు విద్యార్థులు ఐఐటీ బాంబే, ఢిల్లీ, మద్రాస్ వంటి పాత, ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో కోర్ బ్రాంచ్‌లను ఎంచుకోవడానికి సిద్ధమవు తున్నారు. దీనికి కారణం ఆ సంస్థల పరిశోధనా వాతావరణం, అధ్యాపకుల నాణ్యత, అంతర్జాతీయ గుర్తింపు వంటివి కీలకంగా పని చేస్తున్నాయి. అంటే ‘ఏ బ్రాంచ్?’ అన్న ప్రశ్నతో పాటు ‘ఏ సంస్థ?’ అన్న ప్రశ్న కూడా కీలకంగా మారుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి
ఈ మార్పు భారత్‌కే పరిమితం కాలేదు. అమెరికాలో మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెట్టే ‘ఇన్‌‌ఫ్రాస్ట్రక్ష‍ర్‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌ అండ్‌ ‌జాబ్స్‌ ‌యాక్ట్‌’ అమలవుతోంది. యూరప్‌లో గ్రీన్ డీల్ కింద రవాణా, పర్యావరణ, ఇంధన రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెరుగుతున్నాయి. చైనా మౌలిక సదుపాయాల విస్తరణతో లక్షలాది ఇంజినీర్లకు అవకాశాలు సృష్టించింది. ప్రపంచంలోనే అతిపెద్ద హైస్పీడ్ రైలు నెట్‌వర్క్, వందలాది మెట్రో వ్యవస్థలు, భారీ పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు అక్కడ ఇంజినీరింగ్‌కు కొత్త మార్గాన్ని చూపాయి. భారత్ కూడా అదే మార్గంలో పయనిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. అయితే దేశంలో ఒకటి, రెండు సంవత్సరాల ప్రవేశ గణాంకాల ఆధారంగా శాశ్వత మార్పు వచ్చిందని చెప్పడం తొందరపాటే అవుతుందని వారు అంటు న్నారు. కౌన్సెలింగ్ విధానాలు, ప్లేస్‌ మెంట్ నివేదికలు, మీడియా కథనాలు కూడా విద్యార్థుల ఎంపికలను ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు. అయితే భారత యువత భవిష్య త్తును కొత్త కోణంలో చూస్తోం దన్న ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు వివరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -