తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు
విస్తరించిన నైరుతి : ఐఎండీ
మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అనుకూల వాతావరణం
చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
న్యూఢిల్లీ : గత కొన్నిరోజులుగా ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురందించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు పేర్కొంది. తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్‌లోకి ప్రవేశించాయని, వేగంగా విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాలు చురుగ్గా ముందుకు సాగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, రుతుపవనాల కదలికతో ముంబయి, రాయ్గడ్ ప్రాంతాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ మహారాష్ట్ర-గోవా తీర ప్రాంతాలకు హెచ్చరికలు జారీ
దక్షిణ మహారాష్ట్ర-గోవా తీర ప్రాంత ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని పేర్కొంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే, ఆకస్మిక వరదల వల్ల రోడ్డు, రైలు, విమాన సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు ట్రాఫిక్ సలహాలను పాటించాలని, నిర్మాణాలకు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని సూచించింది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో వర్షాలు దంచికొడు తున్నాయి. మంగళవారం రాజధాని నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. బలమైన గాలుల కారణంగా పలుచోట్ల స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. మరికొన్ని చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఇదిలా ఉండగా, హర్యానా, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ధూళి తుపాను సంభవించింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో జనజీవనం ప్రభావితమైంది. అయితే, ధూళి తుపాను అనంతరం కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది.
చల్లని కబురు
- Advertisement -
- Advertisement -



