ఇరాన్ అనుమతించింది : అమెరికా అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదు : టెహ్రాన్
ఇరాన్ చమురు అమ్మకాలపై అమెరికా ఆంక్షల ‘తాత్కాలిక’ తొలగింపు…ఆస్తుల విడుదల
టెహ్రాన్/వాషింగ్టన్ : స్విట్జర్లాండ్‌లో జరిగిన చర్చల నేపథ్యంలో దేశంలోని అణు స్థావరాల తనిఖీకి ఐరాస పర్యవేక్షకులను అనుమతిస్తానని ఇరాన్ హామీ ఇచ్చిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారు. ఇరాన్‌ను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చేందుకు ఇది తొలి అడుగు అని తెలిపారు. దీనిపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)తో వెంటనే చర్చిస్తామని అన్నారు. అయితే ఈ వాదనను ఇరాన్ విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. అణు తనిఖీలపై ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. 18 గంటల పాటు జరిగిన చర్చలలో అణు అంశమే ప్రస్తావనకు రాలేదని ఇస్లామిక్ రిపబ్లిక్ వార్తా సంస్థ తెలియజేసింది. ఇదిలావుండగా ఇరాన్ చమురు అమ్మకాలపై విధించిన ఆంక్షలను 60 రోజుల పాటు ఎత్తివేస్తూ అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అంటే ఆగస్ట్ 21వ తేదీ వరకూ అమెరికా సహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకూ ఇరాన్ తన చమురును అమ్ముకోవచ్చు. ఇందుకు ప్రతిగా హార్ముజ్ జలసంధిని తెరచేందుకు, దేశంలోకి ఐరాస అణు ఇన్స్‌పెక్టర్లను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెస్సెంట్ చెప్పారు.
అణు తనిఖీదారులు ఎప్పుడు ఇరాన్‌కు వెళతారని విలేకరులు అడిగిన ప్రశ్నకు వాన్స్ బదులిస్తూ ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి కనీసం వారం రోజులు పడుతుందని చెప్పారు. అణు నిజాయితీని ప్రదర్శించడానికి ఆయుధ తనిఖీలకు ఇరాన్ అంగీకరిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో తెలియజేశారు. ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండకపోతే లేదా వారు సరిగా ప్రవర్తించకపోతే తాను చేయాల్సింది చేస్తానని అన్నారు. అయితే అణు తనిఖీలపై ఎలాంటి హామీ ఇవ్వలేదని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఖై స్పష్టం చేశారు. ఐరాస పర్యవేక్షకుల చర్యలు ఇరాన్ పార్లమెంట్, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ విధివిధానాలకు లోబడి ఉండాలని తెలిపారు. స్విట్జర్లాండ్‌లో ఇరాన్ అధికారులెవ్వరూ ఐఏఈఏ చీఫ్ రాఫెల్ గ్రొస్సీని కలవలేదని, ఇరాన్‌లో దెబ్బతిన్న అణు కేంద్రాలను తనిఖీ చేయాలన్న ఆలోచన ఆ సంస్థకు లేదని అన్నారు. విదేశాలలో స్తంభింపజేసిన 12 బిలియన్ డాలర్ల ఆస్తులను విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించిందని చెప్పారు.
కాగా ఒప్పందంలో లేని అంశాలపై చేసే ప్రకటనలు చర్చలను ముందుకు తీసుకుపోవడంలో సహాయపడబోవని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. ఒప్పందాన్ని పూర్తి నిబద్ధతతో, కచ్చితంగా అమలు చేస్తేనే చర్చలు ఫలితాన్ని ఇస్తాయని తెలిపారు. గత వేసవిలో 12 రోజుల పాటు యుద్ధం జరిగినప్పుడు అమెరికా, ఇజ్రాయిల్ సేనల బాంబు దాడులలో దెబ్బతిన్న అణు స్థావరాలలో ఐఏఈఏ తనిఖీలకు ఇరాన్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్‌లో మిగిలి ఉన్న తన తనిఖీదారులను ఐఆరఈఏ వెనక్కి పిలిపించింది. ఇరాన్‌లోని అణు స్థావరాల తనిఖీలకు ఐఆరఈఏను అనుమతిస్తూ 2015లో అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, బ్రిటన్ దేశాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. 2018లో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఇది ఓ ‘చెడ్డ ఒప్పంద’మని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అణు తనిఖీలపై భిన్న వాదనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



