కదం తొక్కిన అఖిలపక్షం..హైదరాబాద్‌లో భారీ ర్యాలీ
కేంద్రం, ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు
ఓటర్ల జాబితా ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్
బీజేపీ దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చే కుట్ర : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
అర్హుల ఓట్లను తొలగిస్తే ప్రతిఘటిస్తాం: కూనంనేని
పౌరసత్వానికే ప్రమాదం : కోదండరామ్…ప్రజాస్వామ్యానికే ముప్పే : మల్లు రవి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)కు వ్యతిరేకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ప్రజాగ్రహం పెల్లుబికింది. కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా వందలాది మంది ప్రజలు భారీ ప్రదర్శన చేపట్టారు. ప్లకార్డులు, ప్లెక్సీలు, జెండాలు పట్టుకుని తమ నిరసన తెలిపారు. ఓటర్ల జాబితా సవరణను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, ఇతర వామపక్షాలు, టీజేఎస్ శ్రేణులు కదం తొక్కాయి. అర్హుల ఓట్లను తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించాయి. ఈనెల 25 నుంచి ‘సర్’ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, టీజేఎస్, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్, ఎం సీపీఐ, ఎస్‌యూసీఐ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బూర్గుల రామకృష్ణా రావు భవన్ వద్దనున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయంటూ ప్రజల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నార ని అఖిలపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు నినదించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ ర్యాలీలో సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మెన్ డాక్టర్ కె.నారాయణ, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎం.కోదండరామ్, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ జి.వెన్నెల, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అధికార ప్రతినిధి చలపతి, సీపీఐ (ఎంఎల్) మాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హన్మేష్, ఎస్ యూసీఐ నాయకులు భరత్, వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. నిరసన ప్రదర్శన అనంతరం అఖిలపక్ష ప్రతినిధుల బృందం ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర రెడ్డికి వినతిపత్రం సమర్పించింది. ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించాలని విజ్ఞప్తి చేసింది. అంతకు ముందు అఖిలపక్ష నేతలు రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బీఆర్‌కే భవన్‌కు చేరుకున్నారు. పీఎం డౌన్ డౌన్, సర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆయా పార్టీలకు చెందిన సాంస్కృతిక బృందాలు పాటలు పాడాయి. విద్యార్థులు, యువజనులు, మహిళలు, వృద్ధులు ఆందోళనలో పాల్గొన్నారు. ఓటు హక్కును కబలించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్ర: జాన్‌వెస్లీ
సర్‌ను అడ్డం పెట్టుకుని ఆయా రాష్ట్రాల్లో దొడ్డిదారిలో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్రలు చేస్తున్నది. వాటిని తిప్పి కొడతాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తమ ఒట్లను కాపాడుకోవాలి. ఇందుకు సీపీఐ(ఎం) సహకరిస్తుంది. తోడ్పాటును అందిస్తుంది. కేంద్రం, ఎన్నికల కమిషన్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నాయి. అందుకే బీజేపీకి గత ఎన్నికల్లో ప్రజలు సీట్లకు కోతపెట్టారు. అర్హులైన వారి ఓట్లను తొలగిస్తే ప్రజాస్వామంపై, ప్రజల ఓట్లపై దాడి చేసినట్టే. ఈ కుట్రను ఛేదిస్తాం. ఫాసిస్టు విధానాలను అంగీకరించం. అక్రమంగా ఓట్లను తొలగిస్తే తీవ్రంగా స్పందిస్తాం. ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. ప్రక్రియపై సమాజం జాగృతం కావాలి. ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ సర్కారు, ప్రాథమిక హక్కులను, ఆనక ప్రశ్నించే తత్వాన్ని అణిచి వేస్తున్నది. దీన్ని సీపీఐ(ఎం) ఎన్నటికీ హర్షించదు, సహించదు. ప్రజల తరపున గొంతెత్తుతూనే ఉంటాం.
అర్హుల ఓట్లు తొలగిస్తే ప్రతిఘటిస్తాం: కూనంనేని సాంబశివరావు
ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియ ఎలాంటి పక్షపాతం లేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. సవరణ ప్రక్రియకు సంబంధించిన సర్ విధానంలోనే లోపాలు ఉన్నాయి. వాటిని వెంటనే సరిదిద్దాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల అధికారులు కలిసి ప్రజల ప్రాథమిక ఓటు హక్కును, ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీస్తున్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పుడు ఓట్లను ఏ పార్టీ అయినా, ఎలక్షన్ కమిషన్ అయినా తొలగించాలనుకుంటే దానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. అదే సమయంలో అర్హులైన ప్రజల ఓట్లను జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం.
పౌరసత్వానికే ప్రమాదం: కోదండరామ్
ఓటు హక్కు లేకపోతే భవిష్యత్తులో పౌరసత్వంతో పాటు రేషన్ కార్డ్ , ఇతర హక్కులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సర్‌ను అడ్డుకోవాలి. అధికారం కావాలంటే ప్రజానుకూల విధానాలను అవలంభించాలి. అంతేగానీ, అర్హుల ఓట్లను తొలగిస్తే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది.
ప్రజాస్వామ్యానికి కీలకం: మల్లు రవి
ఓటు హక్కును కాపాడటం ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకం. ఈ దిశగా మాత్రమే ఎన్నికల కమిషన్ పని చేయాలి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకోం. అర్హుల ఓట్లను జాబితా నుంచి తొలగించి ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రజాగ్రహాన్ని చూడాల్సి వస్తుంది.



