చంద్రారెడ్డి జీవితం
ఆదర్శవంతం..: జాన్‌వెస్లీ
నిరాడంబరుడు.. నిస్వార్థపరుడు, ప్రజల మనిషి : ఎస్.వీరయ్య
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, తదితరుల నివాళి
వైద్య కళాశాలకు చంద్రారెడ్డి భౌతికకాయం అప్పగింత
నవతెలంగాణ-నర్సంపేట
సీపీఐ(ఎం) సీనియర్ నేత పుచ్చకాయల చంద్రారెడ్డి(93) అనార్యోగంతో సోమవారం మృతి చెందారు. హనుమకొండలోని అతని కుమారుడి ఇంటిలో కొద్ది రోజులుగా అస్వస్తతతో బాధపడుతూ సోమవారం ఉదయం మరణించారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజలు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం హనుమకొండ రాంనగర్‌లోని సుందరయ్య భవన్‌లో ఉంచగా.. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర నాయకత్వం, వివిధ వామపక్ష పార్టీల నేతలు, కార్య కర్తలు తరలివచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని నర్సంపేట నియో జకవర్గంలోని దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామం లోని చంద్రారెడ్డి స్వగృహానికి ఆయన భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, సీనియర్ నేత సారంపెల్లి మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అబ్బాస్, నాగయ్య, పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్‌బాబు, వరంగల్ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, సీనియర్ నాయకులు సారంపెల్లి వాసుదేవరెడ్డి, కల్లెపు వెంకటయ్య, హనుమకొండ జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి తదితరులు ఆయనకు నివాళి అర్పించారు. ఆయనకు కుమారుడు భాస్కర్‌రెడ్డి, జనార్ధన్ రెడ్డి, కూతురు అరుణ ఉన్నారు.
ప్రజల మనిషి పుచ్చకాయల చంద్రారెడ్డి
ఈ సందర్భంగా నిర్వహించిన సంతాపసభలో జాన్‌వెస్లీ, వీరయ్య తదితరులు మాట్లాడారు. పీసీఆర్ మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా జీవితాంతం ఎర్రజెండాను భుజాన మోసిన నిజమైన కమ్యూనిస్టు అని కొనియాడారు. ఆయన అంకితభావం, నిబద్ధత నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. విద్యార్థి దశలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకుని, చిన్నతనం నుంచే కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. 1978 నుంచి 1996 వరకు సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగారని తెలిపారు. రైతులు, కూలీలు, కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి అనేక పోరాటాలను చేపట్టారని, వారి హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. బాధితుల పక్షాన నిలబడి సమానత్వం, సమాజ నిర్మాణమే తన జీవిత లక్ష్యంగా పయనించారని తెలిపారు. సమాజంలో కుల వివక్ష అంతరించిపోవాలని మానవత్వమే గొప్ప విలువ అని విశ్వసించిన ఆయన తన కుమారుడు భాస్కర్‌కు కులాంతర వివాహం చేసి సామాజిక సంస్కరణకు ఆచరణాత్మక సందేశం ఇచ్చారని తెలిపారు. తన కూతురు వివాహాన్ని ఎలాంటి ఆడంబరాలు లేకుండా నిర్వహించి ఆదర్శంగా నిలిచారని అన్నారు. తాను విశ్వసించిన సిద్ధాంతాలను ముందుగా తన కుటుంబ జీవితంలోనే అమలు చేసి చూపించారని కొనియాడారు. తుది శ్వాస వరకు ప్రజల కోసం పరితపించిన యోధుడని అన్నారు. జీవితమంతా ప్రజలకు సేవ చేసిన ఆయన మరణాంతరం కూడా సమాజానికి ఉపయోగపడాలని తన భౌతిక దేహాన్ని నర్సంపేటలోని వైద్య కళాశాలకు అప్పగించాలని కుటుంబ సభ్యులకు, పార్టీ నాయత్వానికి సూచించడం ఆయన ఆలోచన నిజమైన ప్రజానాయకుడి గొప్పతనాన్ని చాటుతుందన్నారు. వరంగల్ జిల్లా ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని, కానీ ఆయన ఆశయాలు, సేవలు, త్యాగాలు, పోరాట స్ఫూర్తి ఎన్నటికీ మరుగున పడవని తెలిపారు. ప్రతి సామాజిక న్యాయం పోరాటంలో ప్రతి శ్రమ గుండెలో ఎర్ర జెండాలో పుచ్చకాయల చంద్రారెడ్డి స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని నర్సంపేట మెడికల్ కాలేజీకి అప్పగించారు.
అంతిమ యాత్రకు తరలొచ్చిన జనం..
నాచినపెల్లి గ్రామంలో పుచ్చకాయల చంద్రారెడ్డి అంతిమ యాత్ర ఘనంగా సాగింది. సీపీఐ(ఎం) రాష్ట్ర, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వంతో పాటు వామపక్షపార్టీల నాయకులు, మండలాల కార్యకర్తలు, సాధారణ జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆయనకు నివాళి అర్పించి “ జోహార్ పీసీఆర్.. జోహార్.. జోహార్..’’ అంటూ నినదిస్తూ ఆయన జీవిత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పీసీఆర్‌కు నివాళులర్పించిన వారిలో.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు, జనగామ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత పాపారావు, సీపీఐ నాయకులు యాదగిరి, వెంకట్రాజ్యం, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. చుక్కయ్య, రాగుల రమేష్, బొట్ల చక్రపాణి, వరంగల్, హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి పీసీఆర్‌కు వీడ్కోలు పలికారు.
సీపీఐ(ఎం) సీనియర్ నేత పుచ్చకాయల చంద్రారెడ్డి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



