కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యం
అధ్యయనానికి ‘ఎస్‌బీఐ క్యాప్స్’ కన్సల్టెంట్‌గా ఎంపిక
ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన
ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 నిధులపై కీలక నిర్ణయం
ఎల్అండ్‌టీ బకాయిలు, ఐఆర్‌ఎఫ్‌సీ రుణ విడుదలపై సందిగ్ధత
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేంద్రం అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూనే, ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండ్రోజులుగా ఢిల్లీలో కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు ఫలప్రదమవడంతో, మెట్రో ఫేజ్-1 స్వాధీనం (టేకోవర్), ఫేజ్-2 విస్తరణపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఖరారైంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఎస్‌బీఐ క్యాప్స్’ను కన్సల్టెంట్‌గా ఎంపిక చేసింది.
ఇప్పుడు ఎస్‌బీఐ క్యాప్స్ వంతు!
మెట్రో ఆస్తుల విలువ, అప్పులు, నిర్వహణ వ్యయం, ఆదాయ వనరులపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ‘ఐడీబీఐ’ సంస్థతో లోతైన అధ్యయనం చేయించి నివేదిక సిద్ధం చేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వం పారదర్శకత కోసం తన వంతుగా ఎస్‌బీఐ క్యాప్స్‌ను రంగంలోకి దించింది. ఈ సంస్థ ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించనుంది. ఇందులో భాగంగా మెట్రో ఫేజ్-1 ఆస్తుల విలువ మదింపు (వాల్యూయేషన్), ఫేజ్-2 విస్తరణకు అవసరమైన రుణ సేకరణ, నిర్మాణ వ్యయం వంటి అంశాలపై ఎస్‌బీఐ క్యాప్స్ సమగ్ర నివేదిక ఇవ్వనుంది. ప్రస్తుతం ప్రయివేటు భాగస్వామ్యంతో నడుస్తున్న ఫేజ్-1ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా ఆస్తులు, అప్పుల విలువను ఈ సంస్థ లెక్కగట్టనుంది. సుమారు 122.9 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన ఫేజ్-2 విస్తరణకు అయ్యే రూ.38,595 కోట్లు, రుణ సంస్థల ఎంపికపై ఎస్‌బీఐ క్యాప్స్ మార్గదర్శనం చేయనుంది. ఈ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయడంపై తుది నిర్ణయం తీసుకోనుంది.
ఎల్అండ్ టీకి చెల్లింపుల పరిస్థితి ఏంటి?
మెట్రో ఫేజ్-1ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా ఎల్అండ్ టీ సంస్థకు ఈక్విటీ కొనుగోలుకు రూ. 1,461.47 కోట్లు, ప్రాజెక్టు అప్పుల రీఫైనాన్సింగ్‌కు రూ.13,538.53 కోట్లు కలిపి మొత్తం రూ.15,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. జూన్ 1వ తేదీలోగా ఈ నిధులు చెల్లిస్తామని ప్రభుత్వం భావించినప్పటికీ, సాంకేతిక కారణాలతో అది వాయిదా పడుతూ వస్తోంది. కనీసం జులై 1 నాటికైనా ఈ నిధులపై స్పష్టత వస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఎస్‌బీఐ క్యాప్స్ నివేదిక ఇచ్చే వరకు నిధుల విడుదల నిలిచిపోయే అవకాశం ఉంది.
ఐఆర్‌ఎఫ్‌సీ ఖాతాలో రూ.13,600 కోట్లు!
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) నుంచి రావాల్సిన రూ.13,600 కోట్ల రుణం ప్రస్తుతం ఆ సంస్థ ఖాతాలోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడంతోపాటు ఎస్క్రో ఖాతాలో తన వాటాను జమ చేసినప్పటికీ, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో నిధులు విడుదల కాలేదు. ఇప్పుడు ఎస్‌బీఐ క్యాప్స్ ఇచ్చే అధ్యయన నివేదిక ఆధారంగానే ఈ నిధుల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
సమన్వయానికి ప్రత్యేక కమిటీ
ప్రాజెక్టు వేగవంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏయూడీ) ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా ఉండి ఎస్‌బీఐ క్యాప్స్ అధ్యయనానికి సహకరిస్తారు.
నివేదిక సమర్పణపై స్పష్టత కరువు!
ఎస్‌బీఐ క్యాప్స్ తన నివేదికను ఎప్పుడు సమర్పిస్తుందనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. ప్రభుత్వం ఆశించినట్టుగా మెట్రో విస్తరణ పనులు త్వరగా మొదలవ్వాలంటే, ఈ కన్సల్టెంట్ నివేదిక సత్వరమే రావడం అత్యవసరం. నివేదిక వచ్చిన తర్వాతే ఎల్అండ్ టీకి చెల్లింపులు, ఫేజ్-2 పనుల ప్రారంభంపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం నగరంలో ఫేజ్-1 కింద మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుతున్న విషయం తెలిసిందే.
‘మెట్రో’పై వ్యూహాత్మక అడుగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



