Wednesday, June 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగల్ఫ్‌కు పయనమైన రుబియో

గల్ఫ్‌కు పయనమైన రుబియో

- Advertisement -

ఎంఓయూ పై వివరణ…
ఇరాన్ పునర్నిర్మాణ ప్యాకేజీపై సంప్రదింపులు

వాషింగ్టన్ : మధ్యప్రాచ్యంలో మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వాషింగ్టన్ నుంచి బయలుదేరారు. పర్యటనలో భాగంగా ఆయన యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్‌రైన్ నేతలను కలుసుకొని వివిధ అంశాలపై చర్చిస్తారు. ఇరాన్‌తో ట్రంప్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం గల్ఫ్ దేశాలకు ఎలాంటి నష్టం కలిగించదని వారికి భరోసా ఇస్తారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగియడాన్ని అనేక గల్ఫ్ దేశాలు స్వాగతిస్తున్నాయి. అయితే చర్చల సందర్భంగా ఇరాన్ పొందిన హామీల పైనే అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం ఉద్దేశించిన 300 బిలియన్ డాలర్ల ప్యాకేజీపై అవి దృష్టి సారించాయి. ఈ నిధి టెహ్రాన్ పునర్నిర్మాణానికి దోహదపడడంతో పాటు దాని సైనిక సామర్ధ్యాలను, ప్రభావాన్ని కూడా పెంచుతుందని గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పైగా ఎంఓయూలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం ప్రస్తావన లేకపోవడాన్ని అవి వేలెత్తి చూపుతున్నాయి.

అమెరికా సైనిక స్థావరాలకు ఆతిథ్యం ఇస్తున్న గల్ఫ్ దేశాలలో ఈ ఆందోళన మరింత ఎక్కువగా కన్పిస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్‌రైన్, ఖతార్ దేశాలలో అమెరికా సైనిక, వైమానిక స్థావరాలు ఉన్నాయి. యుద్ధ సమయంలో వీటి పైన, పౌర మౌలిక సదుపాయాల పైన ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు జరిపింది. టెహ్రాన్‌కు వాషింగ్టన్ ఏమి ఇవ్వబోతోంది, అందుకు ప్రతిగా అమెరికాకు ఇరాన్ ఇచ్చేదేమిటి అని గల్ఫ్ దేశాలు ఆరా తీస్తున్నాయి. ఇరాన్ పునర్నిర్మాణానికి సాయపడే విషయంపై గల్ఫ్ దేశాలు పెదవి విప్పడం లేదు. విదేశాలలో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను అమెరికా విడుదల చేయాలని ఎంఓయూలో ప్రతిపాదించారు. అయితే విడుదల చేసిన నిధులు, ఆస్తులను ఇరాన్ ఎలా ఉపయోగించుకుంటుందనే విషయాన్ని అమెరికా, ఖతార్ పరిశీలిస్తాయి. కాగా హార్ముజ్ జలసంధిపై కూడా గల్ఫ్ దేశాల నేతలతో రుబియో చర్చిస్తారు. బహ్‌రైన్‌లో సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, కువైట్, బహ్‌రైన్, యూఏఈతో కూడిన గల్ఫ్ సహకార మండలి నేతలను కూడా రుబియో కలుస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -