Monday, August 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇకపై దాడులు ఉండవు

ఇకపై దాడులు ఉండవు

- Advertisement -

ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిందన్న ట్రంప్
మధ్యప్రాచ్య దేశాల అభ్యర్థన మేరకేనంటూ వ్యాఖ్య.. తోసిపుచ్చిన టెహ్రాన్‌ సైనికాధికారులు
దుస్సాహసానికి పాల్పడవద్దని యూఎస్‌కు హెచ్చరిక
గల్ఫ్‌ నేతల ద్వారా ఒత్తిడికి ప్రయత్నిస్తున్నారన్న విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ
దుస్సాహసానికి పాల్పడవద్దని యూఎస్‌కు హెచ్చరిక

వాషింగ్టన్ : ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిందని, ఆ దేశంపై దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజా ఒప్పందంలో భాగంగా హార్ముజ్ జలసంధిని తక్షణమే, పూర్తిగా తెరవడం జరుగుతుందని, ఇరాన్ నుంచి ఇక అణు ముప్పు ఉండబోదని తెలిపారు. ‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని రీతిలో ఇరాన్‌పై పూర్తి సైనిక సామర్ధ్యంతో దాడులు చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. అయితే ఒప్పందానికి సంబం ధించిన ప్రాథమిక అంశాలపై అంగీకారం కుదిరినందున దాడులను నిలిపివేయాలని, కొంత సమయం వేచి ఉండాలని ఇరాన్, ఇతర మధ్య ప్రాచ్య దేశాలు మమ్మల్ని కోరాయి. ఈ అభ్యర్థన మేరకు ప్రపంచ భవిష్యత్తు కోసం, అలాగే సుసంపన్నమైన ఇరాన్ మనుగడ కోసం త్వరగా తుది ఒప్పందాన్ని కుదుర్చుకునే షరతుపై దాడిని నిలిపివేయడానికి అంగీకరించాను. ఒప్పందంలో భాగంగా హార్ముజ్ జలసంధిని వెంటనే, పూర్తిగా తెరుస్తారు. ఇరాన్ వైపు నుంచి ఎలాంటి అణు ముప్పు ఉండదు’ అని ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు. ఇరాన్, పశ్చిమాసియా భాగస్వాముల అభ్యర్థన మేరకే ఇరాన్‌పై దాడులు చేయాలన్న ఆలోచనకు స్వస్తి చెబుతున్నామని తెలిపారు. తన నిర్ణయాన్ని ఇజ్రాయిల్ కూడా ఆమోదించిందని చెప్పారు. ‘ఇక అందరూ చేయాల్సిన పనిలో నిమగ్నమ వ్వండి. దానిని పూర్తి చేయండి’ అని సూచించారు.

దుస్సాహసానికి పాల్పడవద్దు : అరాగ్చీ
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ శనివారం టర్కీ, పాకిస్తాన్, సౌదీ నేతలతో వేర్వేరుగా ఫోన్ సంభాషణలు జరిపారు. ఎలాంటి సాహసోపేత చర్యలకు పాల్పడవద్దని, ఇరాన్ లక్ష్యాలపై దాడులు జరిపితే నిర్ణయాత్మకంగా ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికాను ఆయన హెచ్చరించారు. ఎలాంటి దురాక్రమణనైనా ఇరాన్ గట్టిగా ప్రతిఘటిస్తుందని పాక్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్, టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్‌లతో అన్నారు. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌తో మాట్లాడిన అరాగ్చీ… అమెరికా – ఇజ్రాయిల్ దాడులు చేసినా లేదా వాటి ప్రాంతీయ భాగస్వాములు ఆ దాడులలో భాగస్వాములైనా తగిన విధంగా స్పందిస్తామని చెప్పారు. కాగా ట్రంప్‌తో టెలిఫోన్‌లో మాట్లాడిన సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా ప్రణాళికలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై అనుసరించే వైఖరిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -