ఐదుగురు మృతి… 41 మంది గల్లంతు
జకార్తా : ఇండోనేషియా సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఫెర్రీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 41 మంది గల్లంతయ్యారు. మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు ప్రయాణికులు సముద్రంలోకి దూకడంతో వారు గల్లంతైనట్టు సెర్చ్ అండ్ రెస్క్యూ అధికారులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన వివరాలకు సంబంధించి..తూర్పు జావాలోని దేశంలోనే రెండవ అతిపెద్ద నగరమైన సురబయ నుంచి దక్షిణ సులవేసిలోని మకాస్సర్‌కు నౌక ప్రయాణిస్తుండగా మదుర ద్వీపం సమీపంలో మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులను రక్షించినట్టు ప్రాంతీయ సురబయా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ వెల్లడించింది. ఫెర్రీలో మంటలంటుకునే స్వభావం కలిగిన పేలుడు పదార్థాలున్నందున, సమీపంలో సిద్ధంగా ఉన్న మరో నాలుగు నౌకలు ప్రమాద భయంతో ఫెర్రీ దగ్గరకు చేరుకోలేకపోయాయని ఆ సంస్థ వివరించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఘటనా స్థలం నుంచి నౌకల ద్వారా ప్రయాణికులను తరలిస్తున్నామని ఇండోనేషియా రవాణా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ముహమ్మద్ మష్‌హుద్ తెలిపారు. ‘‘ప్రయాణికులు, సిబ్బంది భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత. తరలింపు ప్రక్రియ వేగంగా, సురక్షితంగా, సమర్థవంతంగా సాగేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం” అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ద్వీపసమూహమైన ఇండోనేషియాలో, సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్ర ప్రమాదాలు తరచుగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గత నెలలోనే, పెద్ద ద్వీపమైన సులవేసికి దక్షిణంగా ఉన్న చిన్న ఉష్ణమండల ద్వీపం సెలయార్ సమీపంలో ప్రయాణిస్తున్న 70 మందికి పైగా ప్రయాణికులతో కూడిన మరో ఫెర్రీ మునిగిపోయింది. ఆ ఘటనలో కనీసం నలుగురు మృతి చెందారు. 14 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు.
ఇండోనేషియా ఫెర్రీలో అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



