Wednesday, June 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆరుద్రలో సన్నాలకు సమస్య

ఆరుద్రలో సన్నాలకు సమస్య

- Advertisement -

సప్త సన్నాళ్లకే బోనస్‌..ఆరుగాలం కష్టపడే రైతులకు కష్టాలు
ప్రభుత్వం సూచించని వాటికి
బోనస్‌, కొనుగోళ్లు బంద్‌!
ప్రభుత్వం ముందుగా ప్రకటిస్తే
వాటినే వేసేవాళ్లమంటున్న రైతులు
రోహిణి మృగశిర ఆరుద్ర
దాటుతుంటే ప్రభుత్వ ప్రకటన

నవతెలంగాణ- 
మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
రోహిణి కార్తి పోయింది.. మృగశిర దాటింది.. వరి విత్తడానికి ఆరుద్ర చివరి కార్తి. ఇప్పటికే సగం మంది రైతులు సన్నాలనుకొని వరి నారుమల్లు వేసుకోవడానికి సిద్ధమయ్యారు. గతేడాది మాదిరిగానే అన్ని రకాల సన్నాలకు బోనస్‌ వస్తుందని రైతులు భావించారు.. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 33 రకాల సన్న వడ్లను పండిస్తున్నారు. మొన్నటి వరకు పండించిన ప్రతి సన్న గింజకూ రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ఇచ్చేది. అయితే, ఇకపై అన్నింటికీ బోనస్‌ ఉండదని, ఏడు రకాల సన్నాలకే బోనస్‌ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటికే వివిధ రకాల సన్నాలు కొని నారు మళ్లు పోసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుద్ర చివరలో ప్రభుత్వం తాము చెప్పిన ఏడు రకాలే పండించాలని ప్రకటించడంపై విమర్శలు వస్తున్నాయి.రెండేండ్లుగా సన్న వడ్లు క్వింటాల్‌కు ధరపై రూ.500 అదనపు బోనస్‌ ప్రభుత్వం ఇస్తోంది. ఈ సారి నిర్దిష్టమైన ఏడు రకాల సన్నవడ్లకు మాత్రమే బోనస్‌ వర్తిస్తుందని ప్రభుత్వం చేప్తున్నది. ఇతర సన్నాలను పండిస్తే బోనస్‌ లభించదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. వ్యవసాయ శాఖ ఈ కింది 7 రకాల వడ్లను మాత్రమే బోనస్‌ కోసం గుర్తించింది.

బీపీటీ 5204 (సాంబమసూరి), ఆర్‌ఎన్‌ఆర్‌ 15,048 (తెలంగాణ సోన), హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్‌, కెఎన్‌ఎం-1638 (కూనారం సన్నాలు), వీజీఎల్‌-44, కెఎన్‌ఎం 7715.. ఈ ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను సబ్సిడీపై ప్రభుత్వం రైతు వేదికల ద్వారా అందిస్తుందని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని రైతులంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆరు నెల ముందుగానే వంగడాల గురించి వివరించాల్సింది. మృగశిర రోహిణికార్తీ దాటి ఆరుద్ర సగభాగంలో ఉండగా ఫలానా విత్తనాలే వేసుకోవాలని నిబంధనలు పెట్టడంలో మతలబేంటని రైతులు ప్రశ్నిస్తున్నా రు. ఇప్పటికే సగానికి పైగా రైతులు వివిధ రకాల వడ్లను కొనుగోలు చేశారు. అందువల్ల తెలంగాణలో సాగు చేసే 33 రకాల వరి వంగడాలకు బోనస్‌ ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఖరీఫ్‌ సీజన్లో 11 లక్షల పైగా వరి పంటను సాగు చేస్తారు. నాగర్‌ కర్నూల్‌లోనే ఆరు లక్షల ఎకరాలు సాగుతుండగా.. గద్వాలలో లక్షన్నర, వనపర్తిలో రెండు లక్షలు, నారాయణపేటలో 50,000, మహబూబ్‌నగర్లో లక్ష ఎకరాలు సాగవుతుంది.

కొనుగోలు మద్దతు సంగతేంటి?
ఇంత భారీ మొత్తంలో సాగయే వరి పంటకు ప్రభుత్వం నుంచి సహకారం లేకపోతే నష్టం కోట్లల్లో ఉంటుంది. ఇప్పటివరకు బోనస్‌ మాత్రమే లేదని చెబుతున్నారు. రాబోయే కాలంలో బోనస్‌తోపాటు మద్దతు ధర కొనుగోలు సైతం లేకపోతే రైతులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతారు.

సంప్రదాయ వరి వంగడాలనే వాడుతున్నాం
రైతు పర్వతాలు, గన్యాకుల, నాగర్‌కర్నూల్‌ జిల్లా నేను మొదటి నుంచి సంప్రదాయ విత్తనాలనే కొనుగోలు చేసి నాటుతున్నా. బోనస్‌ సైతం వచ్చేది. ఇప్పుడు కొత్తగా ఏడు రకాల వరి వంగడాలనే విత్తుకోవాలని చెప్పడం సరికాదు. గిట్టుబాటు ధర కొనుగోలులో సైతం ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. ముందే చెప్తే అటువంటి విత్తనాలను కొనుగోలు చేసే వాళ్లం కాదు.

మిగతా వడ్లకు అనుమతులిస్తే ఏమవుతుంది
ప్రభాకర్‌ రెడ్డి, గౌరీదేవిపల్లి, వనపర్తి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సన్న వడ్లకే కాకుండా ఇతర వడ్లకు బోనస్‌ ఇస్తే ఏమవుతుంది. రైతుల పరిస్థితిని గమనించి ప్రతి సన్నాలకూ బోనస్‌ వర్తింపజేయాలి.

ప్రతి సన్నగింజనూ కొని బోనస్‌ ఇవ్వాలి
రైతు సంఘం నాగర్‌ కర్నూల్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల సన్నవడ్లను ప్రకటించే సమయానికి అదును దాటిపోయింది. ఈ సమయంలో ప్రభుత్వం తాము ప్రకటించిన సన్నబడ్లనే వేసుకోవాలని చెప్పడం సరికాదు. ఇప్పటికే రైతులు సగం మందికిపైగా ఇతర సన్నాలను కొనుగోలు చేసి నారు మళ్లు వేసుకున్నారు. అందువల్ల అన్ని సన్నాలనూ కొనుగోలు చేసి బోనస్‌ ఇవ్వాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -