Wednesday, June 24, 2026
E-PAPER
Homeజాతీయంమెట్రో విస్తరణపై ముందడుగు

మెట్రో విస్తరణపై ముందడుగు

- Advertisement -

కేంద్ర మంత్రులు మ‌నోహ‌ర్ ఖ‌ట్ట‌ర్‌,
అశ్వినీ వైష్ణ‌వ్‌, కిష‌న్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు సఫలం

ఫేజ్‌–I వాల్యూయేష‌న్‌.. ఫేజ్–II విస్తర‌ణ‌కు క‌న్సల్టెంట్‌గా ఎస్‌బీఐసీఏపీఎస్
క‌న్సల్టెంట్ రిపోర్ట్ ఆధారంగా భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌
స‌మ‌న్వయ స‌భ్యులుగా కేంద్ర ప్రభుత్వ అధికారి, రాష్ట్ర ఎంఏయూడీ స్పెష‌ల్ సెక్రెటరీ

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ అంశంలో కీలక ముందడుగు పడింది. హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌–I స్వాధీనం, ఫేజ్‌–II విస్తర‌ణ‌పై ఉన్న ఆటంకాలు తొల‌గ‌నున్నాయి. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డితో రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జరిపిన రెండ్రోజుల చ‌ర్చలు ఫ‌ల‌ప్రద‌మైనట్టు సీఎంఓ ఒక ప్రకటనలో పేర్కొంది. మంగళవారం నాడిక్క‌డ‌ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణ మీనన్ మార్గ్ లోని ఖట్టర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌–I వాల్యూయేష‌న్‌, ఫేజ్‌–I స్వాధీనానికి అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ‌, ఇతర అంశాలపై కీలకంగా చర్చించారు. అలాగే మెట్రో ఫేజ్ –2 పై చర్చలు జరిపారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు, ఆలోచనలను సీఎం రేవంత్‌‌రెడ్డి కేంద్ర మంత్రుల ముందుం చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో కేంద్ర సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా ఫేజ్ 1 కు నిధుల సేకరణ, ఫేజ్ –2 విస్తరణ విషయంలో అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

సీఎం, కేంద్ర మంత్రుల మధ్య ఏకాభిప్రాయం
వరుసగా జరిగిన ఈ సమావేశాల్లో సీఎం, కేంద్ర మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ప్రధానంగా హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌–I వాల్యూయేష‌న్‌, ఫేజ్‌–I స్వాధీనానికి అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ‌, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్‌–II విస్తర‌ణ‌, నిర్మాణ‌ వ్యయం, అందుకు అవ‌స‌ర‌మైన రుణ సేక‌ర‌ణ అంశాల‌ను అధ్యయ‌నం చేసేందుకు క‌న్సల్టెంట్ ను నియ‌మించాల‌ని నిర్ణయించారు. క‌న్సల్టెంట్‌గా ఎస్బీఐసీఏపీఎస్ ని ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్‌–I వాల్యూయేష‌న్‌… ఫేజ్‌-II విస్తర‌ణ‌.. ఇత‌ర అంశాల‌పై ఎస్బీఐసీఏపీఎస్ స‌మ‌గ్రంగా అధ్యయ‌నం చేయ‌నుంది. ఈ క‌న్సల్టెంట్‌ సంస్థ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ చేప‌ట్టేందుకు అంగీకారం తెలిపారు. క‌న్సల్టెంట్ అధ్యయ‌నం స‌మ‌యంలో స‌మ‌న్వయానికి ప్రతినిధు లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్టణాభివృద్ధి (ఎంఏ &యూడీ) శాఖ స్పెషల్ సెక్రెటరీ ఉండాల‌ని స‌మావేశంలో నిర్ణయించారు. ఈ అధికారులు ఇద్దరు స‌మ‌న్వయం చేసు కుంటూ ఈ ప్రక్రియ వేగంగా సాగేందుకు కృషి చేస్తారని సీఎంఓ తెలిపింది.

కాగా హైదరాబాద్ డెవలప్‌‌మెంట్‌‌లో ప్రధాన భూమిక పోషించనున్న హైదరాబాద్ మెట్రో విస్తరణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో రెండ్రోజులు సమావేశమయ్యారు. తొలుత సోమ‌వారం రాత్రి ఢిల్లీలోని రైల్వే భవన లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర బొగ్గు, గ‌నుల శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితో సుదీర్ఘంగా చ‌ర్చించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీలో మెట్రో ఫేజ్ –1 కు ఇండియన్ రైల్వేఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) లోన్ పై చర్చించారు. అలాగే మెట్రో సెకండ్ ఫేజ్ అనుమ తుల వ్యవహారంలో అడ్డంకులపై చర్చిం చారు. అయితే ఈ భేటీలో మెట్రో విస్తరణ, నిధుల సమ కూర్పుపై సానుకూలత వచ్చినట్లు భేటీ అనంతరం సీఎం వెల్లడించారు. ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లే అంశంపై… నోడల్ ఆఫీసర్‌‌గా ఉన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో చర్చించాలని ఈ మీటింగ్ లో నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కేంద్ర మంత్రులు ఫోన్ లో మాట్లాడారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ, అనుమతులు, నిధుల సేకరణ, ఇతర అంశాలపై చర్చించేందుకు కేంద్ర మంత్రి ఖట్టర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -