ఛేదనలో టీమ్ ఇండియా చతికిల
76 పరుగులతో దక్షిణాఫ్రికా గెలుపు
దక్షిణాఫ్రికా 187/7 భారత్ 111/10
అజేయ రికార్డుతో సూపర్8కు చేరుకున్న టీమ్ ఇండియా.. అసలు సమరంలో చతికిల పడింది. బంతితో లభించిన మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోని సూర్యసేన.. ఛేదనలో పూర్తిగా చేతులెత్తేసింది. డెవిడ్ మిల్లర్ (63), బ్రెవిస్ (45), స్టబ్స్ (44 నాటౌట్) మెరుపులతో దక్షిణాఫ్రికా 187/7 పరుగులు చేసింది. ఛేదనలో బ్యాటర్లు సమిష్టిగా విఫలమవగా భారత్ 111 పరుగులకే కుప్పకూలింది. 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా అదిరే విజయం సాధించింది.
నవతెలంగాణ-అహ్మదాబాద్
డిఫెండింగ్ చాంపియన్ చతికిల పడింది. సూపర్8 పోరులో దక్షిణాఫ్రికాకు కనీస పోటీ ఇవ్వలేదు. 188 పరుగుల ఛేదనలో భారత బ్యాటర్లు సమిష్టిగా విఫలమయ్యారు. శివం దూబె (42, 37 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) మినహా అందరూ నిరాశపరిచారు. ఇషాన్ కిషన్ (0), తిలక్ వర్మ (1), అభిషేక్ శర్మ (15) పవర్‌ప్లేలోనే నిష్క్రమించగా.. మిడిల్ ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (18), వాషింగ్టన్ సుందర్ (11), హార్దిక్ పాండ్య (8), రింకు సింగ్ (0)లను కట్టడి చేసిన దక్షిణాఫ్రికా 76 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది.
18.5 ఓవర్లలో భారత్ 111 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. డెవిడ్ మిల్లర్ (63, 35 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), డెవాల్డ్ బ్రెవిస్ (45, 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్, 24 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరవటంతో 187 పరుగులు చేసింది. డెవిడ్ మిల్లర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. 76 పరుగుల తేడాతో ఓడిన భారత్ నెట్‌రన్‌రేట్‌ను బుణాత్మకం చేసుకుంది. జింబాబ్వే, వెస్టిండీస్‌పై నెగ్గినా.. భారత్ నేరుగా సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది!.
పేలవంగా పడిపోయారు
భారత్ లక్ష్యం 188 పరుగులు. గతంలో ఈ నల్లమట్టి పిచ్‌పై సఫారీలను చిత్తు చేశారు. కానీ ఎడమ చేతి బ్యాటర్లకు ఆఫ్ స్పిన్‌తో సవాల్ విసిరిన దక్షిణాఫ్రికా తొలి ఓవర్లోనే ఆతిథ్య జట్టుకు షాక్ ఇచ్చింది. ఎడెన్ మార్‌క్రామ్‌పై ఎదురుదాడి చేయబోయి ఇషాన్ కిషన్ (0), అనవసర షాట్‌తో తిలక్ వర్మ (1) వికెట్ కోల్పోయారు. చక్కని బౌండరీతో పరుగుల ఖాతా తెరిచిన అభిషేక్ శర్మ.. రబాడ ఓవర్లో ఓ సిక్సర్‌తో ఊపందుకున్నాడు. కానీ, నియంత్రణ లేకపోవటం, డాట్స్ బాల్స్ ఒత్తిడికి అభిషేక్ తలొగ్గాడు. యాన్సెన్ ఓవర్లో గాల్లోకి క్యాచ్ ఇవ్వగా.. బాచ్ అద్భుత రీతిలో అందుకున్నాడు. దీంతో 26/3తో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది.
ఓ ఎండ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (18) నిలిచినా..దూకుడుగా ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరగటంతో ఒత్తిడిలో అనవసర షాట్లు ఆడారు. హార్దిక్ పాండ్య (18), రింకు సింగ్ (0), అర్ష్‌దీప్ సింగ్ (1) నిరాశపరిచారు. మిడిల్ ఓవర్లలో (7-16) ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ 70 పరుగులే చేసింది. ఇక్కడే మ్యాచ్‌పై దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. డెత్ ఓవర్లలోపే భారత్ ఆశలు ఆవిరి కాగా.. ఓటమి అంతరం కుదించేందుకు శివం దూబె (42) పోరాడాడు. భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. సఫారీ బౌలర్లలో కేశవ్ మహరాజ్ (3/24), మార్కో యాన్సెన్ (4/22), కార్బిన్ బాచ్ (2/12) రాణించారు.
ఎదురునిలిచిన మిల్లర్
టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కొత్త బంతితో అర్ష్‌దీప్ సింగ్, జశ్‌ప్రీత్ బుమ్రా ద్వయం సఫారీ టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. క్వింటన్ డికాక్ (6) వికెట్లను బుమ్రా గిరాటేయగా.. ఎడెన్ మార్‌క్రామ్ (4) అర్ష్‌దీప్ ట్రాప్‌లో పడ్డాడు. రియాన్ రికెల్టన్ (7) బుమ్రా స్లో బాల్‌కు బోల్తా పడ్డాడు. పవర్‌ప్లే తొలి 4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 20 పరుగులే చేసింది. ఇక దక్షిణాఫ్రికా కోలుకోవటం అంత సులువు కాదనే అనిపించింది. ఈ సమయంలో డెవిడ్ మిల్లర్ (63), డెవాల్డ్ బ్రెవిస్ (45) మ్యాచ్‌ను మలుపుతిప్పే భాగస్వామ్యం నమోదు చేశారు. మిల్లర్ పవర్‌ప్లేలోనే ఎదురుదాడి మొదలెట్టాడు. బ్రెవిస్ సైతం మిల్లర్ జతగా రెచ్చిపోయాడు. 6 ఓవర్లలో 41/3తో నిలిచిన సఫారీలు.. ఆ తర్వాత గేర్ మార్చారు.
పవర్‌ప్లేలో వెనుకంజ వేసినా.. మిడిల్ ఓవర్లలో దక్షిణాఫ్రికా దంచికొట్టింది. 7-16 ఓవర్లలో ఏకంగా 111 పరుగులు పిండుకుంది. ఇందులో మిల్లర్, బ్రెవిస్ జోడీ నాల్గో వికెట్‌కు 51 బంతుల్లోనే 97 పరుగులు జోడించింది. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 26 బంతుల్లో మిల్లర్ అర్థ సెంచరీ సాధించాడు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ సహా శివం దూబె, హార్దిక్ పాండ్యలపై మిల్లర్ విరుచుకుపడ్డాడు. దీంతో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట పడలేదు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో మెరిసిన బ్రెవిస్.. అర్థ సెంచరీ ముంగిట వికెట్ కోల్పోగా.. మిల్లర్‌ను వరుణ్ సాగనంపాడు. ఈ ఇద్దరి నిష్క్రమణతో డెత్ ఓవర్లలో సఫారీ దూకుడుకు కళ్లెం పడింది.
బుమ్రా ఆఖర్లో రెండు ఓవర్లతో సఫారీలను కట్టడి చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్, 24 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. 18 బంతుల్లో 24 పరుగులతో నిలిచిన స్టబ్స్.. హార్దిక్ వేసిన ఆఖరు ఓవర్లో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. ఆఖరు 4 ఓవర్లలో సఫారీలు 35 పరుగులు చేయగా..అందులో 20 పరుగులు చివరి ఆరు బంతుల్లో వచ్చినవే. మిల్లర్, బ్రెవిస్, స్టబ్స్ మెరుపులతో దక్షిణాఫ్రికా 187 పరుగులు చేసింది. బారత బౌలర్లలో జశ్‌ప్రీత్ బుమ్రా (3/15), అర్ష్‌దీప్ సింగ్ (2/28) రాణించారు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్య, శివం దూబె ధారాళంగా పరుగులు ఇచ్చారు.



