ఒప్పందంపై ఇరాన్
టెహ్రాన్ : మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు కుదిరిన ఒప్పందం ‘అమెరికా ఓటమి ప్రకటనే’ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల బృందం నేత మహమ్మద్ బాఘర్ ఘలీబఫ్ వ్యాఖ్యానించారు. ‘అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం ఒత్తిడి, బలవంతం కారణంగా కుదిరింది కాదు. అది ధైర్యవంతులైన ఇరాన్ ప్రజల ప్రతిఘటన ఫలితమే’ అని అజర్‌బైజాన్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన చెప్పారు. అందుకే ఎంఓయూ అమెరికా ఓటమి ప్రకటనగా మారిందని అన్నారు. మధ్యప్రాచ్య భద్రతా నిర్మాణాన్ని ప్రాంతీయ దేశాలు మాత్రమే నిర్ధారిస్తాయని అన్నారు. ‘ఈ ప్రాంతం నుంచి విదేశీ సైనిక దళాల ఉపసంహరణను వ్యూహాత్మక లక్ష్యంగా మేము భావిస్తాము. భవిష్యత్ లో ఈ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకోకూడదని, కేవలం సంప్రదింపులు మాత్రమే జరగాలని కోరుకుంటున్నాము. పశ్చిమాసియాలో విదేశీ సైనిక స్థావరాలు అస్థిరతకు కారణమవుతాయి’ అని వివరించారు. ఆక్రమిత దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ దాడులు ఆగాలన్నదే ఇరాన్ వైఖరి అని స్పష్టం చేశారు. ‘అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో మా స్నేహితులు, వ్యూహాత్మక భాగస్వాములను వదిలేయం.
లెబనాన్‌లో కాల్పుల విరమణ, యుద్ధానికి ముగింపు మాకు చాలా ముఖ్యం’ అని చెప్పారు. ఇదిలావుండగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హమాస్ సీనియర్ అధికారి బసెం నయీమ్ కు ఫోన్ చేసి ఇటీవల అమెరికాతో జరిపిన చర్చలు, ఇజ్రాయిల్ ఆక్రమిత గాజాలో పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా పాలస్తీనా ప్రజలకు అరాగ్చీ తమ మద్దతును పునరుద్ఘాటించారు. గాజాలో ఇజ్రాయిల్ ఆక్రమణలు, కాల్పుల విరమణ ఉల్లంఘనలను అమెరికా అధికారులు, మధ్యవర్తుల దృష్టికి తెచ్చామని తెలిపారు. కాగా ఇరాన్ చమురు అమ్మకాలకు సంబంధించి వసూలయ్యే సొమ్మును డాలర్లు సహా ఏ విదేశీ కరెన్సీలో అయినా అంగీకరిస్తామని సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ హెమ్మతి చెప్పారు. అమెరికా, ఇరాన్ మధ్య సాంకేతిక చర్చలు వచ్చే వారం ప్రారంభంలో మొదలవుతాయని పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధి తహిర్ అండ్రాబీ తెలిపారు. బహుశా వచ్చే సోమ, మంగళ, బుధ వారాలలో చర్చలు మొదలయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. అయితే సంప్రదింపులు ఎక్కడ జరిగేదీ ఆయన తెలియజేయలేదు.
అది అమెరికా ఓటమి ప్రకటనే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



