ప్రధాన పంటల ఉత్పత్తిపై ప్రత్యక్ష ప్రభావం
భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు భారీ సవాలు
300 బిలియన్ డాలర్ల విలువైన సరఫరా సిస్టమ్‌కు అంతరాయం!
దేశంలోని రైతులకు తప్పని ఇబ్బందులు
ధరల పెరుగుదల, ఆహార ద్రవ్యోల్బణ భయాలు
ఇటు వర్షాలు ఆలస్యం..
అటు ఎల్ నినో ఎఫెక్ట్
న్యూఢిల్లీ : భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వర్షాలు ఈ ఏడాది ఆలస్యమవుతుండటంతో దేశవ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. ఎల్ నినో ప్రభావం ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. ఫలితంగా 300 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.28 లక్షల కోట్లు) విలువైన భారత వ్యవసాయ సరఫరా వ్యవస్థపై గణనీయమైన ఒత్తిడిని తీసుకువచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే కీలక సమయంలో ఈ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో వర్షాలు సమయానికి రాకపోవడంతో రైతులు విత్తనాలు వేయడం ఆలస్యం చేస్తున్నారు. ఇది బియ్యం, పత్తి, సోయాబీన్, పప్పుదినుసులు వంటి ప్రధాన పంటల ఉత్పత్తిపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫలితంగా దేశంలో ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్షాకాలమే భారత వ్యవసాయానికి జీవన రేఖ
భారతదేశంలో వ్యవసాయం ఇప్పటికీ ప్రధానంగా వర్షాధారితమే. జూన్‌లో ప్రారంభమయ్యే వర్షాకాలం రైతుల జీవన రేఖగా పనిచేస్తుంది. ఈ వర్షాల ఆధారంగానే ఖరీఫ్ పంటల సాగు నిర్ణయించబడుతుంది. కానీ ఈసారి ముంబయి వరకు వర్షాలు ఆలస్యంగా చేరడం, మధ్య భారతం, దక్కన్ ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతోంది. రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, యూపీ వంటి రాష్ట్రాలు ఈ ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాంతాలు భారత సోయాబీన్‌లో 90శాతం, పత్తిలో 80 శాతం, పప్పుధాన్యాల్లో 70 శాతం ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల వర్షాల లోపం దేశ ఆహార సరఫరా వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఎల్ నినో ప్రభావం మరింత ప్రమాదకరం
మహాసముద్రంలో ఏర్పడే ఎల్ నినో వాతావరణ పరిస్థితులు సాధారణంగా భారత వర్షాకాలాన్ని బలహీన పరుస్తాయి. ఈసారి అభివృద్ధి చెందుతున్న “సూపర్ ఎల్ నినో” పరిస్థితి రాబోయే నెలల్లో వర్షపాతం మరింత తగ్గే ప్రమాదాన్ని సూచిస్తోందని నిపుణులు చెప్తున్నారు. వాతావరణ శాస్త్రవేత్తలు పూర్తిగా కారణాలు స్పష్టంగా చెప్పలేకపోయినా.. ఈ ఏడాది వర్షపాతం గత 11 ఏండ్లలో అత్యంత బలహీనంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ అంచనాలు ఇటు రైతుల్లో, అటు దేశ ప్రజల్లో తీవ్ర ఆందోళనలకు కారణమవుతున్నాయి.
పంటలపై ప్రత్యక్ష ప్రభావం.. ధరలపై పరోక్ష దెబ్బ
దేశంలో వర్షాలు ఆలస్యమవడంతో రైతులు విత్తనాలు వేయలేకపోతున్నారు. వేసిన పంటలు కూడా తగిన స్థాయిలో నీరు అందక ఎండిపోయే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. దీని ప్రభావం బియ్యం, పత్తి, సోయాబీన్, చెరకు, పప్పుధా న్యాలు, వంట నూనెల పంటలపై ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ఈ పంటల ఉత్పత్తి తగ్గితే మార్కెట్‌లో ధరలు పెరిగి సాధారణ వినియోగదారులపై భారం పడుతుంది. మధ్య్రపాచ్యంలో నెలకొన్న పరిస్థితులతో ఇప్పటికే దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థికంగా భారాన్ని మోపుతోంది. దీంతో తాజా పరిస్థితులు దేశానికి కొత్త సవాలుగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు.
ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల భయం
పంటల ఉత్పత్తి తగ్గితే వంట నూనెలు, చక్కెర, పప్పులు, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇప్పటికే అసాధారణ వాతావరణ పరిస్థితులను ద్రవ్యోల్బణానికి ప్రధాన ప్రమాదంగా పేర్కొంది. ఇది మధ్యతరగతి కుటుంబాల ఖర్చులను పెంచి ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని తీసుకురావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రభుత్వం ఆహార నిల్వలను ఉపయోగించి ధరలను నియంత్రిం చడానికి ప్రయత్నించింది. 2023లో బియ్యం ఎగుమతులను నిలిపివేయడం ద్వారా దేశీయ సరఫరాను స్థిరపరిచారు. ఇలాంటి చర్యలు మళ్లీ తీసుకునే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఇది అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు.
నాసిక్ ఒక ఉదాహరణ
మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం ఉల్లిగడ్డల ఉత్పత్తికి ప్రసిద్ధి. ఇక్కడ వర్షపాతం తీవ్రంగా తగ్గితే దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. గతంలో కూడా ఉల్లి ధరల పెరుగుదల ప్రభుత్వాలపై రాజకీయ ఒత్తిడిని తీసుకువచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇటు రైతులు, అటు సాధారణ ప్రజలు నిరసనలతో తీవ్ర ఆగ్రహాన్నీ వ్యక్తం చేశారు. ఈసారి నాసిక్‌లో వర్షపాతం దీర్ఘకాల సగటుతో పోలిస్తే కేవలం 16 శాతం మాత్రమే నమోదవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. దీంతో ఉల్లి ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటే పరిస్థితులు ఉండొచ్చనే హెచ్చరికలు వినబడుతున్నాయి. అదే జరిగితే.. దాని ప్రభావం సాధారణ ప్రజలతో పాటు చిరువ్యాపారులు, హోటళ్లు, హాస్టళ్లపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు వివరిస్తున్నారు.



