నవతెలంగాణ-హైదరాబాద్: భవిష్యత్ తరాలకు శాంతిని బలోపేతం చేసే అంతర్జాతీయ దశాబ్దంగా 2027-2036 కాలాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ మేరకు గురువారం యుఎన్ జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అజర్బైజాన్, బహ్రెయిన్, గబన్, కజకస్తాన్, కిర్గిస్తాన్, మారిటానియా, పోర్చుగల్, సింగపూర్, తజకిస్తాన్, తుర్కెమినిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించగా, 153 దేశాలు సానుకూలంగా స్పందిస్తూ ఓటు వేశాయి. ఒక దేశం వ్యతిరేకంగా ఓటు వేసింది. శాంతిని పెంపొందించడం, చర్చలను, రాజీ ప్రక్రియను ప్రోత్సాహించడం, పిల్లలు, యువత, వృద్ధులతో సహా తరాల మధ్య చర్చలు, భాగస్వామ్యానికి మద్దతునివ్వడం (భవిష్యత్ తరాల అవసరాలు, ప్రయోజనాలను పరిరక్షించేందుకు గానూ విధాన రూపకల్పనలో, నిర్ణయాక క్రమంలో వీరందరినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నది ఉద్దేశ్యం) వంటి వాటిని పెంపొందించడం ఈ అంతర్జాతీయ దశాబ్దం లక్ష్యంగా వుంటుందని ఆ తీర్మానం పేర్కొంది.
ఈ అంతర్జాతీయ దశాబ్దాన్ని పాటించాల్సిందిగా ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను, యుఎన్ సంస్థలను, ఇతర సంబంధిత అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలను, పౌర సమాజాన్ని, ఎన్జిఓలను, ప్రముఖులను, ఇతర సంబంధిత పక్షాలను ఆ తీర్మానం ఆహ్వానించింది. స్వచ్ఛంద విరాళాలు సేకరించి ఆ మొత్తంతో ఈ తీర్మానం అమలు చేయడానికి అవసరమైన కార్యకలాపాల నిర్వహణా వ్యయాన్ని భరించాలని పేర్కొంది.



