Saturday, June 27, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్​జీవితం చెప్పే సంకల్ప గాథ

​జీవితం చెప్పే సంకల్ప గాథ

- Advertisement -

కొంతమంది వ్యక్తులు విజయాలను సాధించి చరిత్రలో నిలుస్తారు. మరికొందరు తమ జీవితాన్నే ఒక సందేశంగా మార్చి మానవాళి జ్ఞాపకాలలో శాశ్వతంగా నిలిచిపోతారు. హెలెన్ కెల్లర్‌‌ది కూడా అలాంటి అపూర్వ వ్యక్తిత్వమే. నిరాశతో నిండిన పరిస్థితులను ఎదుర్కొంటూనే ఆశను, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆమె జీవితం ఒక అసాధారణ ప్రేరణ. శారీరక పరిమితులు ఎంత తీవ్రమైనవైనా, మనసు లక్ష్యాన్ని కోల్పోనంత వరకు మనిషి సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన మహోన్నత గాథ. అందుకే ఆమె జీవితం ఒక వ్యక్తి విజయకథ మాత్రమే కాదు.. ప్రతి తరాన్ని ఆలోచింపజేసే సందేశం. ఈ రోజు ఆమె జయంతి సందర్భంగా ఆమె విజయగాథ నేటి మానవిలో…

​1880 జూన్ 27న అమెరికాలోని అలబామా రాష్ట్రంలో హెలెన్ కెల్లర్ జన్మించింది. సాధారణ శిశువుల మాదిరిగానే ఆమె తొలి నెలలు గడిచాయి. అయితే పంతొమ్మిది నెలల వయసులో వచ్చిన తీవ్రమైన జ్వరం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. చూపు, వినికిడి శక్తులు రెండూ కోల్పోయింది. ఆ చిన్నారి పరిస్థితి కుటుంబానికి ఒక పెద్ద సవాలుగా మారింది. భావాలను వ్యక్తపరచడానికి సరైన మార్గం లేకపోవడంతో ఆమె తరచూ అసహనం, కోపం, ఆవేదనకు గురయ్యేది. అయితే ప్రతి చీకటిలోనూ ఒక వెలుగు దాగి ఉంటుంది. హెలెన్ జీవితంలో ఆ వెలుగుగా నిలిచింది ఆమె గురువు అన్నీ సలివన్. 1887లో హెలెన్ ఇంటికి వచ్చిన అన్నీ సలివన్ ఓ ఉపాధ్యాయురాలు మాత్రమే కాదు, ఓ మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగలిగిన మార్గదర్శి. ఆమె హెలెన్కు అక్షరాలను స్పర్శ ద్వారా నేర్పడం ప్రారంభించింది. మొదట్లో ఆ అక్షరాల వెనుక అర్థం ఏమిటో హెలెన్‌కు తెలియదు. ఒక రోజు నీటి పంపు దగ్గర నిలబెట్టి, ఒక చేతిపై నీరు పారుస్తూ మరో చేతిపై “W-A-T-E-R” అని స్పెల్లింగ్ చేసినప్పుడు హెలెన్ జీవితంలో ఒక అద్భుత క్షణం ఆవిష్కృతమైంది. ప్రతి వస్తువుకూ ఒక పేరు ఉంటుందని, ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుందని ఆమె గ్రహించింది. ఆ క్షణమే జ్ఞాన ద్వారాలు ఆమెకు తెరుచుకున్నాయి.

అసాధారణ ప్రయాణంగా
హెలెన్ కెల్లర్ విద్యాభ్యాసం ఒక అసాధారణ ప్రయాణంగా మారింది. బ్రెయిలీ లిపి, స్పర్శ ఆధారిత పద్ధతులు, ప్రత్యేక శిక్షణ ద్వారా ఆమె జ్ఞానాన్ని సొంతం చేసుకుంది. ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ ఉన్నత విద్యను అభ్యసించి విశ్వవిద్యాలయ పట్టా పొందిన తొలి అంధ-బధిర మహిళగా చరిత్ర సృష్టించింది. హెలెన్ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు పరిశీలిస్తే ఆమె వ్యక్తిత్వం ఎంత విశాలమైందో అర్థమవుతుంది. చిన్నతనంలో కోపంతో, నిరాశతో జీవించిన ఆ బాలిక క్రమంగా ప్రపంచాన్ని అర్థం చేసుకున్న మేధావిగా ఎదిగింది. చూపులేకపోయినా అనేక దేశాలను సందర్శించింది. వేలాది మంది ముందు ప్రసంగించింది. వినికిడి లేకపోయినా మానవ బాధలను ఆలకించింది. యుద్ధాల వల్ల నష్టపోయినవారి బాధలను, వికలాంగుల సమస్యలను, మహిళల హక్కుల కోసం పోరాడటమే తన జీవిత ధ్యేయంగా మార్చుకుంది.

అక్షరాలకు అతీతమైన వెలుగు
హెలెన్ కెల్లర్ రచయిత్రిగానూ విశేష ఖ్యాతి పొందింది. ఆమె రచించిన “ది స్టోరీ ఆఫ్ మై లైఫ్” ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చింది. తన అనుభవాలను, పోరాటాలను, విజయాలను ఆమె అద్భుతంగా ఆవిష్కరించింది. ప్రపంచ సాహిత్యానికి హెలెన్ కెల్లర్ అందించిన అత్యంత గొప్ప ఆదర్శం ఆశను కోల్పోకపోవడం. ఆమె ప్రభావం వికలాంగుల సాహిత్యానికి మాత్రమే పరిమితం కాలేదు. మానవ హక్కులు, సమానత్వం, విద్య, వ్యక్తి స్వేచ్ఛ వంటి అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా జరిగిన చర్చలకు ఆమె రచనలు నైతిక బలాన్ని అందించాయి. సాహిత్యం సమాజాన్ని మార్చగలదనే నమ్మకానికి ఆమె జీవితం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. అపార ఖ్యాతి పొందిన తర్వాత కూడా ఆమె తన విజయాలను వ్యక్తిగత ప్రతిభకు మాత్రమే ఆపాదించలేదు. గురువుల పాత్రను, విద్య ప్రాముఖ్యతను, సమాజ సహకారాన్ని నిరంతరం గుర్తు చేసింది. అందుకే ఈ ప్రపంచం ఆమెను అసాధ్యాన్ని సవాలు చేసి, నిరాశను జయించిన సంకల్పంగా గుర్తుంచుకుంటుంది. ఆమె జీవితం ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా రచయితకు ఒక ప్రశ్న వేస్తుంది ‘మీరు ఏమి రాశారు? అని కాదు, మీ రచనల వెనుక ఎంత జీవితం ఉంది? అని. ఆ ప్రశ్నకు సమాధానం వెతికేంత వరకు హెలెన్ కెల్లర్ ప్రపంచ సాహిత్యంలో శాశ్వత స్ఫూర్తిగానే నిలుస్తుంది.

సాహసంతో ముందుకు సాగాలి
“Life is either a daring adventure or nothing at all.” ఆమె చెప్పిన ఈ మాటలో ఆమె జీవిత తత్వం మొత్తం నిక్షిప్తమై ఉంది. జీవితం అనేది భయాలతో గడపాల్సిన ప్రయాణం కాదని, సాహసంతో ముందుకు సాగాల్సిన యాత్ర అని ఆమె విశ్వసించింది. సవాళ్లు వచ్చినప్పుడు వెనక్కి తగ్గడం కాదు, వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లడమే నిజమైన జీవనమని ఈ మాట మనకు గుర్తుచేస్తుంది. “The only thing worse than being blind is having sight but no vision.” అనే మరో వాఖ్యం శారీరక చూపు కంటే జీవిత దృష్టి గొప్పదని వివరిస్తుంది. కళ్లతో ప్రపంచాన్ని చూడటం ఒక వరమైతే, లక్ష్యంతో జీవితాన్ని చూడటం మరింత గొప్ప వరం. అనేక అవకాశాలు కలిగి ఉన్నప్పటికీ దిశ లేని జీవితం కన్నా, పరిమితులు ఉన్నప్పటికీ స్పష్టమైన లక్ష్యం ఉన్న జీవితం విలువైనదని ఆమె భావించింది.

మానవత్వపు గొంతుకగా
హెలెన్ కెల్లర్ జీవితాన్ని పరిశీలిస్తే మరో విషయం స్పష్టమవుతుంది. మనిషిని వెనక్కి లాగేది శారీరక పరిమితులు కావు, తనపై తాను పెట్టుకునే పరిమితులే. ప్రపంచం అసాధ్యం అని చెప్పిన చోట ఆమె అవకాశం చూసింది. చీకటి మాత్రమే కనిపించే పరిస్థితుల్లో ఆశను వెలిగించింది. నిశ్శబ్దం మాత్రమే ఉన్న ప్రపంచంలో మానవత్వపు గొంతుకగా మారింది. హెలెన్ కెల్లర్ మరణించి దశాబ్దాలు గడిచినా, ఆమె పేరు నేటికీ ఆశకు పర్యాయపదంగా నిలిచింది. ఒక వ్యక్తి తన పరిస్థితులకు బానిస కాకుండా, తన సంకల్పానికి లీడర్‌‌గా మారితే ఏమి సాధించగలరో ఆమె జీవితం నిరూపించింది. అందుకే ఆమె జీవితాన్ని స్మరించుకోవడమంటే కేవలం ఒక మహనీయురాలిని గుర్తుచేసుకోవడం కాదు, మానవ సంకల్పం ఎంత అపారమైందో మరోసారి తెలుసుకోవడం. ప్రపంచం విధించిన పరిమితులను తన ఆత్మవిశ్వాసంతో అధిగమించిన ఆమె జీవితం, నేటికీ కోట్లాది మందికి ఆశను అందిస్తోంది.

​- చిటికెన కిరణ్ కుమార్,
94908 41284

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -