Wednesday, February 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిసముచిత పిలుపు

సముచిత పిలుపు

- Advertisement -

ప్రపంచ దేశాలన్నింటినీ దోచుకుంటూ, పెత్తనం సాగిస్తున్న అమెరికాకు వ్యతిరేకంగా టారిఫ్‌ బాధిత దేశాలన్నీ ఐక్యంగా పోరాడాలన్న బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సిల్వా పిలుపు అత్యంత సముచితం. ఐదు రోజుల భారత్‌ పర్యటనలో వాణిజ్యం రెట్టింపు చేసుకోవాలని బ్రెజిల్‌, భారత్‌ నిర్ణయించడం శుభ పరిణామం. ఎఐ సదస్సుకు హాజరైన ఆయనతో ఖనిజాలు, ఉక్కు, మైనింగ్‌, డిజిటల్‌ సహకారం, వాణిజ్యం, ప్రాదేశిక సార్వభౌమాధికారం, రేర్‌ ఎర్త్స్‌, శిలాజ ఇంధనాలు తదితర అంశాలకు సంబంధించి మనదేశం పలు ఒప్పందాలు చేసుకుంది. ఈ పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు మనదేశంతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలు అనుసరించాల్సిన పాత్రకు సంబంధించి ఒక సందేశాన్ని పంపాయి. బలవంతుడైన యజమానితో కార్మికులంతా ఐక్యమై చర్చలు జరిపితే విజయం సాధించడం సులభం. అగ్రరాజ్యం అమెరికా పట్ల కూడా అదే వైఖరి అనుసరిం చాలని కార్మిక నేతగా, బ్రెజిల్‌ అధ్యక్షుడిగా ఆయన చేసిన సూచన భారత్‌ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటికీ ఉపయోగకరం. గ్రేట్‌ ఫ్రెండ్‌, గుడ్‌ ఫ్రెండ్‌, శాంతి దూత… ట్రంప్‌ నాయకత్వంలో శాంతి, సంపద, స్థిరత్వం సాధ్యమవుతుందంటూ పొగడ్తలు కురిపించే, ట్వీట్లు చేసే ప్రధాని మోడీ ఇకనైనా లొంగుబాటు ధోరణికి స్వస్తి పలకడం భారత్‌ ప్రయోజనాలకు అత్యవసరం.
అమెరికా అత్యధికంగా యాభై శాతం సుంకాలను బ్రెజిల్‌తోపాటు మనదేశంపై విధించింది. దీనిపై ఇరు దేశాలు స్పందించిన తీరు భిన్నంగా ఉంది. అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున వేచి చూసే ధోరణిని భారత్‌ మినహా బ్రిక్స్‌ దేశాలన్నీ అనుసరించాయి. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఇఇపిఎ) కింద గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సుంకాలు విధిస్తున్న ట్రంప్‌ చర్యలు చెల్లబోవని అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పు ఇవ్వడం ప్రపంచానికి ఊరటనిచ్చింది. ఈ తీర్పును వమ్ము చేయాలనే ఉద్దేశంతో ట్రంప్‌ అన్ని దేశాలపై సెక్షన్‌ 122 కింద 15 శాతం అదనపు సుంకాలు విధించారు. ఈ తీర్పు వచ్చే వరకూ వేచివుండకుండా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం మన దేశ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. అమెరికా 18 శాతం సుంకాలు విధిస్తే మనదేశంలో సుంకాలేవీ లేకుండానే అమెరికా సరుకులు విక్రయించేలా గేట్లు బార్లా తెరిచేందుకు మోడీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం అవమానకరం.
అమెరికన్‌ ఉత్పత్తులపై 30 నుంచి 35 శాతం విధిస్తున్న సుంకాలను వెనక్కి తీసుకుంది. మూడు నుంచి ఐదు శాతం సుంకం పరిధిలోని భారత ఉత్పత్తులకు పద్దెనిమిది శాతం సుంకం విధించేందుకు అమెరికాతో ఒప్పందం చేసుకుని, ఇదే అతి పెద్ద విజయంగా కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. జీరో శాతం సుంకాల వల్ల వ్యవసాయరంగం, డెయిరీపై ఆధారపడిన మనదేశ రైతులు రోడ్డున పడతారు. ఓ రెండు వారాలు ఆగివుంటే అవమానకరంగా అమెరికా షరతులను అంగీకరించే పని లేకుండానే పదిహేను శాతం సుంకాలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు అవకాశం ఉండేది. యుఎస్‌ఎ సుప్రీంకోర్టు తీర్పును పరిశీలిస్తున్నామని మనదేశంతోపాటు ఒప్పందాలు చేసుకున్న అనేక దేశాలు ప్రకటించాయి.
‘ఆటలాడొద్దు’అంటూ ట్రంప్‌ తాజాగా ప్రపంచ దేశాలనుద్దేశించి అవమానకరంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 27 దేశాల యూరోపియన్‌ యూనియన్‌ ఐక్యంగా ట్రంప్‌ ఏకపక్ష టారిఫ్‌లను ఎదుర్కొన్న తీరు కూడా మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మార్పు తేలేకపోవడం సిగ్గుచేటు. స్వాతంత్య్రానంతరం స్వతంత్రంగా అలీన విధానాన్ని తీసుకుని వందకు పైగా దేశాలకు భారత్‌ నాయకత్వం వహించింది. ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోకుండా అమెరికాకు సాగిలపడటం వల్ల ఎటువంటి మినహాయింపులు పొందలేకపోతున్నది. అన్నదాతలకు, పశు పాలకులకు ఎటువంటి నష్టం కలగనివ్వబోమని పార్లమెంట్‌లో గంభీర ఉపన్యాసం ఇచ్చిన మోడీ ఆ మాటను నిలబెట్టుకోవడం అత్యవసరం. అమెరికా ముందు సాగిలపడి చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని, కొత్తగా ఒప్పందం చేసుకోవాలి. అందుకు చర్యలు తీసుకునేలా కేంద్రం మెడలు వంచేందుకు ప్రజలంతా సమాయత్తం కావాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -