Sunday, June 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంస్థానిక సమస్యల గుర్తింపు

స్థానిక సమస్యల గుర్తింపు

- Advertisement -

క్షేత్రస్థాయిలో సీపీఐ(ఎం) నేతల పర్యటన
విద్యా, వైద్య, నిరుద్యోగం 
తదితర సమస్యలపై ఫోకస్
సత్ఫలితాలిస్తున్న సర్వేలు.. పర్యటనలు
ప్రభుత్వ స్కూళ్లు , 
కాలేజీలపై సీఎం పట్టింపేది?

నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చూస్తే రోగులకు తగ్గట్టు వైద్యులుండరు. స్పెషలిస్టులను భర్తీ చేసే ప్రక్రియను పట్టించుకునే నాథుడే లేరు. మరోపక్క నీళ్లు లేక కంపు కొట్టే బాత్ రూమ్‌లు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే సరైన తాగునీరు, బాత్‌రూంలు లేని పరిస్థితి. ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించని దుస్థితి. విద్యార్థులకు తగినట్టు ఉపాధ్యాయులు లేకపోవడం, చదువుకు తగ్గట్టు ఉద్యోగాలు దొరకక, ఉపాధి మార్గాలు కరువై నిరుద్యోగులు ఎదుర్కొంటున్న కష్టాలు.. మున్సిపల్‌ ‌కార్మికులు పడుతున్న ఇబ్బందులు, ఉపాధి హామీ చట్టంలో పెట్టిన నిబంధనలతో వ్యవసాయ కూలీల అరణ్యవేదన…ఇలా విద్యా, వైద్యం, నిరుద్యోగం తదితర అంశాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునేందుకు, వాటిపై అధ్యయనం చేసేందుకు సీపీఐ(ఎం) చేస్తున్న పర్యటనలకు స్పందన లభిస్తోంది. ఆయా వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సమస్యల గోడు వినిపిస్తున్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మొదలు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, కిందిస్థాయి కార్యకర్త వరకు ప్రజా సమస్యలపై అధ్యయనం చేస్తూ వాటి పరిష్కారం కోసం నడుం బిగించారు. వినతులు అందజేస్తూ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు.

అవసరమైతే అక్కడికక్కడే ఆందోళనలు చేపడుతున్నారు. ప్రధాన పార్టీలుగా చెప్పుకుంటున్న నేతలు ఒకరినొకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడానికి సమయాన్ని కేటాయిస్తుంటే, సీపీఐ(ఎం) నేతలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారి నుంచే తెలుసుకుని పరిష్కారం కొరకు అధికారులకు వినతిపత్రాలను అందజేస్తున్నారు. కొన్నింటిని అప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి రాజకీయ సర్వే ప్రకారం రాష్ట్రంలో 1.12 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. జనాభా 3.55 కోట్లుగా నమోదైంది. రూరల్ ప్రాంతాల్లో 65.50 లక్షల కుటుంబాలకు గాను 2.05 కోట్ల మంది, అర్బన్ ప్రాంతాల్లో 46.86 లక్షల కుటుంబాలకు గాను 1.49 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. అందులో సగానికి పైగా రెక్కాడితే గానీ డొక్కాడని పేద, మధ్యతరగతి కుటుంబాలు. వారి ఆదాయాల్లో విద్యా, వైద్యానికే అత్యధికంగా కేటాయించే పరిస్థితి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రయివేటు బాట పడుతూ తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారు.

ప్రజలు, విద్యార్థుల​ సమస్యలు ఏకరువు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్షేత్రస్థాయిలో నాయకులు పర్యటిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులతో పాటు ఏండ్లుగా సాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను, మూసివేసిన సారంగపూర్ చక్కర ఫ్యాక్టరీని పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. నగరంలోని శంకర్‌భవన్ పాఠశాలలో విద్యార్థులు ఎంత మంది ఉన్నారో, అదే సంఖ్యలో అక్కడు కోతులు ఉన్నాయి. దీంతో విద్యార్థులు భయం భయంగానే తమ చదువులు సాగిస్తున్నారు. బోధన్ జిల్లా ఆస్పత్రిలో స్పెషలిస్టు వైద్యులు లేకపోవడంతో అత్యవసర పరిస్థితిలో ఎవరైనా రోగులు వస్తే నిజామాబాద్‌ ‌కు, అటు నుంచి హైదరాబాద్‌‌కు రిఫర్ చేసే పరిస్థితి నెలకొన్నట్టు తమ దృష్టికి వచ్చిందని సీపీఐ(ఎం) నిజామాబాద్‌ ‌జిల్లా నాయకులు తెలిపారు. నిజామాబాద్ జీజీహెచ్‌లో నీటి సదుపాయం లేక బాత్‌రూమ్‌లు కంపుకొడుతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

​హైదరాబాద్‌లోనూ సమస్యలు..
మారుమూల ప్రాంతాల్లో సమస్యలు ఉండటం సహజమని అధికారులు చెబుతుంటారు. కానీ రాజధాని హైదరాబాద్‌లోని విద్యాసంస్థల్లోనూ తాగునీటి సమస్యలు, సరైన బాత్‌రూమ్‌లు లేని పరిస్థితి నెలకొంది. స్కూల్స్‌లోనే కాదు జూనియర్ కాలేజీల్లోనూ ఇదే దుస్థితి. మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ఏడాదికి ఒక్కో కాలేజీకి, స్కూల్స్ కు నిధులు అందజేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆ నిధులు ఎటుపోతున్నాయో ఇప్పటివరకు వాటిపై సమీక్ష చేసిన దాఖలాలూ లేవు. యంగ్ ఇండియా స్కూల్స్ గురించి చెబుతున్న ముఖ్యమంత్రి హైదరాబాద్, తదితర పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో సమస్యలపై ఎందుకు సమీక్షలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా సచివాలయం, అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలను అటు విద్యాశాఖ మంత్రి, ఇటు అధికారులు సందర్శించడం లేదని విద్యార్థిసంఘాలు మండిపడు తున్నాయి. విద్య ప్రాధాన్యత గురించి చెపుతున్న ముఖ్యమంత్రి.. సమస్యలను గుర్తించి పరిష్కరించాలని విద్యార్థిసంఘాల నేతలు కోరుతున్నారు. సంబంధింత అధికారులు, స్కూల్స్, కాలేజీల ఇన్చార్జీలు కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని, వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

​క్షేత్రస్థాయిలో సీపీఐ(ఎం) శ్రేణుల పర్యటన
స్కూళ్లు, ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి ఎప్పటికప్ప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరింపజేసేందుకు సీపీఐ(ఎం) చొరవ తీసుకుంది. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రంగారెడ్డి జిల్లా యాచారంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి పరిశీలించారు. రోగులతో మాట్లాడి.. సమస్యల పరిష్కారం కోసం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా వనపర్తి జిల్లాలోని అమరచింత మండలం పామిరెడ్డిపల్లి గ్రామ శివారులోని కేజీబీవీని సందర్శించి సమస్యలపై ఆరా తీశారు. అంతకు ముందు స్కూళ్ల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖసైతం రాశారు. హైదరాబాద్‌ ముషీరాబాద్‌లోని ప్రభుత్వ స్కూళ్లను సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలపై అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాన్ని పంపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -