మరి కొందరికి పూర్తిగా తొలగింపు
బుల్లెట్ ప్రూఫ్ కార్ లు కూడా వెనక్కి రప్పించిన అధికారులు
నవతెలంగాణ -ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో శత్రువుతో ప్రాణాలకు ముప్పు ఉందనే కారణంగా గతంలో ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీ వ్యవస్థను ప్రస్తుత సర్కారు సమీక్షించి తొలగించింది. గత 40 ఏండ్లుగా మావోయిస్ట్ కార్యకలాపాల కారణంగా అనేక మంది పోలీస్ అధికారులకు వివిధ సెక్యూరిటీ కేటగిరీల కింద రక్షణ వ్యవస్థను కల్పించిన విషయం తెలిసిందే . కాగా గత రెండు ఏండ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా చేపట్టిన మావోయిస్ట్ కార్యకలాపాల అణచివేత ఆపరేషన్లతో వందలాది మంది మాయిస్టులు మరణించడం, అనేక మంది లొంగిపోవడం, అరెస్ట్ కావడం జరిగింది. దీంతో రాష్ట్రంలో పరిస్థితులను సమీక్షించిన స్టేట్ సెక్యూరిటీ కమిటీ మావోయిస్టులతో ముప్పున్న పోలీస్ అధికారులకు కల్పించిన సెక్యూరిటీ వ్యవస్థ పై సమీక్షను నిర్వహించింది. ఈ మేరకు మాజీ ఐపీఎస్ అధికారులు మొదలుకొని ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న అధికారులకు ఏ మేరకు ముప్పు పొంచి ఉన్నది, ఏ మేరకు తగ్గింది అనే అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో తేలిన అంశాలను పరిగణనలోకి తీసుకుని దాదాపు 50 మంది ఐపీఎస్ అధికారుల సెక్యూరిటీని పూర్తిగా తొలగించడం, కొందరికి తగ్గించడం వంటి చర్యలను తీసుకున్నారు. ఇందులో దాదాపుగా 50 మంది అధికారుల నుంచి వారికున్న బుల్లెట్ ప్రూఫ్ కార్లను వెనక్కి రప్పించారని తెలిసింది. మరోవైపు వారి ఇండ్ల వద్ద 24 గంటల పాటు భద్రత కోసం నియమించిన సాయుధ గార్డ్ ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక అధికారుల వెంట వారి రక్షణ కోసం 24 గంటల పాటు ఉండే సాయుధ గన్ మెన్ల సంఖ్యను కొందరికి తగించడం , మరి కొందరికి పూర్తిగా తొలగించడం జరిగింది. 4+4 ఉన్న గన్ మెన్లను 2+2 కు తగ్గించడం, 2+2 గన్ మెన్లు ఉన్న వారికి 1+1 కు తగ్గించడం,1+1 ఉన్న వారికి పూర్తిగా తగిస్తూ స్టేట్ సెక్యూరిటీ కమిటీ నిర్ణయం తీసుకొని అమలు చేసినట్టు సమాచారం. ఈ విధంగా సెక్యూరిటీని తొలగించడం, తగ్గించడం జరిగిన అధికారుల్లో రాష్ట్ర మాజీ డీజీపీలు ఎం.వి.భాస్కర రావు, స్వరణ్ జిత్ సేన్, ఏ కె ఖాన్, అనురాగ్ శర్మ , మహేందర్ రెడ్డి , జితేందర్ లు ఉన్నారని తెలిసింది. అలాగే ప్రస్తుతం విధుల్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ లు దేవేందర్ సింగ్ చౌహాన్, స్టీఫెన్ రవీంద్ర తో సహా పలువురు అధికారులు ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కు సైతం స్టేట్ సెక్యూరిటీ కమిటీ నివేదిక మేరకు ఆయనకు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ కార్ ను , గన్ మెన్లను తొలగించారు.
50 మంది పోలీస్ అధికారుల సెక్యూరిటీ తగ్గింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



