Monday, June 29, 2026
E-PAPER
Homeఖమ్మంకాకర్లపల్లి 'పేదల‌' ఇండ్ల స్థలాల 'పోరు'

కాకర్లపల్లి ‘పేదల‌’ ఇండ్ల స్థలాల ‘పోరు’

- Advertisement -

– ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి
– పోలీసుల దౌర్జన్యం, అక్రమ అరెస్టులు
– సీపీఐ(ఎం) నాయకుల అక్రమ అరెస్టులను ఖండించిన పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు 
నవతెలంగాణ – సత్తుపల్లి 

సత్తుపల్లి మండలం కాకర్లపల్లి పేదల ఇండ్ల స్థలాల సాధన కోసం సీపీఐ(ఎం) సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి క్యాంప్ కార్యాలయ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పేదల సొంతింటి కలను అణచివేయాలని చూస్తున్న పాలకుల తీరుపై సీపీఐ(ఎం) శ్రేణులు, సుమారు 250 మంది మహిళలు, బాధితులతో కలిసి ఎమ్మెల్యే కార్యాలయ ముట్టడి కార్యక్రమానికి రణభేరి మోగించారు.  ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ పోలీసులు ఉదయం 5 గంటల నుంచే సీపీఐ(ఎం) నాయకులను ముందస్తు అరెస్టులకు తెరలేపడం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానానికి నిదర్శనం. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి జ్యోతి, పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, డివిజన్ కమిటీ సభ్యులు రావుల రాజబాబులను తెల్లవారుజామునే బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

​అయినప్పటికీ ప్రభుత్వ నిర్బంధాలను బద్దలు కొడుతూ ఉదయం 11 గంటలకు వందలాది మంది మహిళలు, సీపీఐ(ఎం) జిల్లా నాయకత్వం కదంతొక్కి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించారు. న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న మహిళలను, నాయకులను పోలీసులు అత్యంత బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో ఠాణాకు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి, జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాస్, డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు, చిట్టిమొదల కృష్ణయ్య, కాకర్లపల్లి గ్రామశాఖ కార్యదర్శి బండి వేలాద్రి, ఆంగోతు చిట్టెమ్మ ఉన్నారు.

​శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నాయకులు, మహిళలు సహా పది మందిపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చే వరకు, ఖాకీల లాఠీలకు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ఇండ్ల స్థలాల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కాకర్లపల్లి పేదలకు స్థలాలు  కేటాయించాలని, లేదంటే రాబోయే రోజుల్లో పేదల ఇండ్ల సాధన ఉద్యమం తీవ్రంగా ఉంటుందని సీపీఐ(ఎం) నాయకులు హెచ్చరించారు. 

పోలీసుల అక్రమ అరెస్టులను ఖండించిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు : ఇండ్ల స్థలాల కోసం కాకర్లపల్లి పేదలు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శాంతియుతంగా ఎమ్మెల్యే కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అణచి వేయడానికి జులుం ప్రదర్శించి  పేదలకు మద్దతుగా నిలిచిన సీపీఐ(ఎం) నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. పేదలు తమ గోడును వినిపించేందుకు కూడా ఈ ప్రజా ప్రభుత్వంలో అవకాశం లేదా అని నాగేశ్వరరావు  ప్రశ్నించారు. కాకర్లపల్లి పేదలకు తక్షణమే ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పేదల ఇండ్ల స్థలాల సాధనకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని నున్నా హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -