Monday, June 29, 2026
E-PAPER
Homeఖమ్మంజూన్‌లో మొహం చాటేసిన వరుణుడు

జూన్‌లో మొహం చాటేసిన వరుణుడు

- Advertisement -

– నియోజకవర్గం లో మిశ్రమ వర్షపాతం
– అశ్వారావుపేట, దమ్మపేటల్లో లోటు
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఈ ఏడాది జూన్ నెలలో అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా వర్షపాతం మిశ్రమంగా నమోదైంది.కొన్ని మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురవగా, మరికొన్ని మండలాల్లో గణనీయమైన వర్షాభావం నెలకొంది.వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు పెంటేల రవికుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, రైతులు ప్రస్తుత వర్షపాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

మండలాల వారీగా జూన్ నెల వర్షపాతం

అన్నపురెడ్డిపల్లి: సాధారణం 145.2 మి.మీ., నమోదు 125.9 మి.మీ. – 13 శాతం లోటు

అశ్వారావుపేట: సాధారణం 140.5 మి.మీ., నమోదు 76.2 మి.మీ. – 45 శాతం లోటు

చంద్రుగొండ: సాధారణం 128.4 మి.మీ., నమోదు 351.6 మి.మీ. – 173 శాతం అధికం

దమ్మపేట: సాధారణం 160.9 మి.మీ., నమోదు 96.4 మి.మీ. – 40 శాతం లోటు

ములకలపల్లి: సాధారణం 173.3 మి.మీ., నమోదు 192.2 మి.మీ. – 11 శాతం అధికం

ఈ గణాంకాల ప్రకారం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో వర్షాభావ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండు మండలాల్లో సాగు విస్తీర్ణంలో అధిక భాగం బోరు నీటి ఆధారంగా సాగుతున్న ఆయిల్ పామ్ తోటలే కావడంతో, తక్షణ ప్రభావం కొంత మేర తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

వర్షాధార పంటలైన పత్తి, మినుము సాగుకు జూలై 15 వరకు అనుకూల సమయం ఉందని వ్యవసాయ శాఖ సూచించింది. మరోవైపు వరి సాగు కోసం రైతులు ఇప్పటికే నారుమళ్లను సిద్ధం చేస్తున్నారు. సాగునీటి వసతి ఉన్న రైతులు వరి సాగుపై దృష్టి సారిస్తున్నప్పటికీ, ప్రభుత్వం కేవలం ఏడు సన్నరకాల వరి సాగుకే అనుమతి ఇవ్వడంతో ఈ సీజన్‌లో పలువురు రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నట్లు అధికారులు తెలిపారు.

గత ఏడాది డివిజన్‌లో పత్తి 33,358 ఎకరాలు, వరి 40,205 ఎకరాల్లో సాగు జరిగింది. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం మీద ఈ జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇదే నెల గత ఏడాది జిల్లాలో 20 శాతం వర్షపాత లోటు నమోదైన విషయం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -