విద్యుత్‌ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలి

విద్యుత్‌ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలి– బాధ్యులైన కేసీఆర్‌, జగదీశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
– ప్రజలకు అందుబాటులో ఉంటా :మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ విద్యుత్‌ సంస్థలో రూ.85 వేల కోట్ల బకాయిలకు బాధ్యులైన కేసీఆర్‌, జగదీశ్‌రెడ్డి, విద్యుత్‌ అధికారులపై తక్షణమే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగదీశ్‌రెడ్డి పదేండ్లుగా బాధ్యతలు చేపట్టిన విద్యుత్‌ శాఖలో రూ.85 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే వివిధ శాఖల్లో ఫైల్స్‌ మాయం కావడం దురదృష్టకరమన్నారు. వాటిపై విచారణ చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాల, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో జరిగిన అవినీతిపైనా సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. మెడికల్‌ కళాశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన జగదీశ్‌రెడ్డి మేనమామ అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తూ నిరుద్యోగుల నుంచి రూ.63.60లక్షలు వసూళ్లు చేసి ఉద్యోగం, డబ్బులు తిరిగి ఇవ్వకుండా అవినీతికి పాల్పడ్డాడని తెలిపారు. కూరగాయల మార్కెట్‌ వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను తీర్చిదిద్దుతామన్నారు. జిల్లా కేంద్రంలో రియాల్టర్లు అక్రమంగా భూములు ఆక్రమించారని, అలాగే బీఆర్‌ఎస్‌ నాయకులకు కేటాయించిన ప్రభుత్వ భూములపైనా విచారణ జరిపి అర్హులైన పేదలకు వాటిని అందించేలా కృషి చేస్తామని తెలిపారు. దళిత, బీసీ, మైనార్టీ బంధుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరారు. పట్టణంలో పాత జాతీయ రహదారి విస్తరణలో నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తానన్నారు. తాను ఎన్నికలకు ముందు సూర్యాపేట ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చానని, వాటిని నెరవేర్చడానికి ముఖ్యమంత్రితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా జూనియర్‌ కళాశాల, భానుపురి యూనివర్సిటీ ఏర్పాటు.. తదితర విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందేలా చూస్తానని స్పష్టం చేశారు. సూర్యాపేట ఎన్నికల్లో నైతిక విజయం తనదేనని, నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా తానే ఐదేండ్ల పాటు ఉంటానని, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతానని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర పీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్‌రావు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర వైస్‌ చైర్మెన్‌ చింతమళ్ళ రమేశ్‌, రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి, పోతుభాస్కర్‌, పట్టణ అధ్యక్షులు అంజద్‌ అలీ, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ కక్కిరేణి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు బాలుగౌడ్‌, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love