చేజింగ్ సెల్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలి
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆదాయం పెంపు, నిధుల సమీకరణపై నిర్లక్ష్యం వీడాల్సిందేనని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. బుధవారం హైదరాబాద్‌లో ఆదాయ సమీకరణపై సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా లక్ష్యాలు సాధించాలంటే ఆదాయ సమీకరణపై దృష్టి సారించాలని అన్నారు. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ నిధుల సమీకరణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని ఆదేశించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్‌తోపాటు ఇతర శాఖలకు సంబంధించి లీకేజీలు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఆదాయ సమీకరణకు సంబంధించి చేజింగ్ సెల్ ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనుకుంటున్న స్థాయిలో పని చేయాలంటే శాఖల వారీగా సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని చెప్పారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని లబ్దిదారుల జాబితాను నేరుగా నగదు బదిలీ (డీబీటీ)కి అనుసంధానం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర పనులు పూర్తి చేసేందుకు అనుగుణంగా బడ్జెట్‌ను తయారు చేసుకోవాలని అన్నారు. భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని వివరించారు. ఊహాజనిత బడ్జెట్ కాకుండా వాస్తవికత ఆధారంగానే బడ్జెట్‌ను రూపొందించుకోవాలని చెప్పారు. వివిధ శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.



