జేబులు నింపిన అధ్యక్షుడి విధానాలు
నష్టాలు మూటకట్టుకున్న మదుపుదారులు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది తన కుటుంబ క్రిప్టో వెంచర్ల ద్వారా 1.4 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం పొందారు. ట్రంప్ మంగళవారం ప్రభుత్వ ఎథిక్స్ కార్యాలయానికి గత సంవత్సరపు ఆదాయ పత్రాలను సమర్పించారు. ట్రంప్ అవలంబించిన విధానాల కారణంగా డిజిటల్ ఆస్తులు ప్రయోజనం పొందాయని, వాటి నుంచే ఆయన తన ఆదాయంలో అధిక భాగాన్ని పొందారని ఆ పత్రాలను బట్టి తెలుస్తోంది. ట్రంప్, ఆయన కుమా రులు కలిసి స్థాపించిన క్రిప్టో వెంచర్ ‘వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్’ ద్వారా అధ్యక్షుడి కంపెనీలు దాదాపు 800 మిలియన్ డాలర్లు అందుకున్నాయి. ఈ ఆదాయాన్ని ట్రంప్ తన కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. ఇందులో క్రిప్టో టోకెన్ల అమ్మకాల ద్వారా 520 మిలియన్ డాలర్లు, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ వెంచర్ వ్యాపారంలోని వాటాల అమ్మకం ద్వారా 250 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం సమకూరింది.
ట్రంప్ చర్యలే కారణం
ట్రంప్ అదృష్టాన్ని క్రిప్టో ఎలా మార్చేసిందో గణాంకాలు రుజువు చేస్తున్నాయి. ఉదాహరణకు ఏడాది క్రితం ట్రంప్ ఓ ప్రకటన చేశారు. వరల్డ్ లిబర్టీ టోకెన్ అమ్మకాల ద్వారా 57.35 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని అందులో తెలిపారు. అయితే ఈ ఏడాది దాఖలు చేసిన నివేదికలో ఈ మొత్తం తొమ్మిది రెట్లు పెరగడం గమనార్హం. గత సంవత్సరం ట్రంప్ అధ్యక్షభవనంలో ప్రవేశించిన తర్వాత ఆయన కుటుంబం క్రిప్టో సంబంధిత ప్రాజెక్టుల నుంచి కనీసం 2.3 బిలియన్ డాలర్లు ఆర్జించిందని రాయిటర్స్ వార్తా సంస్థ ఇటీవల అంచనా వేసింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ చేపట్టిన చర్యలు ఆయన కుటుంబ ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి దోహదపడ్డాయి. స్టేబుల్ కాయిన్ల కోసం ఫెడరల్ నిబంధనలను అమలు చేయడం మొదలు అమెరికా న్యాయ శాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ద్వారా ఈ రంగంపై పర్యవేక్షణను కుదించడం వరకూ… పరిశ్రమకు ప్రయోజనం కలిగించే విధానాలు, కార్యక్రమాలను ట్రంప్ అమలు చేయడం ప్రారంభించారు. గత సంవత్సరం వివిధ మీడియా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా ట్రంప్ కుటుంబానికి 80 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చింది. అలాగే కంపెనీ విదేశీ ప్రాపర్టీ డెవలపర్లకు తన పేరుతో లైసెన్సింగ్ ఇవ్వడం ద్వారా ట్రంప్‌కు 52 మిలియన్ డాలర్ల ఆదాయం లభించింది.
ఇందులో మధ్యప్రాచ్య భాగస్వాములతో కుదిరిన ఒప్పందాల ద్వారానే అధిక ఆదాయం వచ్చింది.
గోల్ఫ్ కోర్సులు, రిసార్టుల ద్వారా కూడా…
ట్రంప్ వ్యాపార ప్రయోజనాలను ప్రస్తుతం ఆయన సంతానమే పర్యవేక్షి స్తున్నారని శ్వేతసౌధం గతంలో చెప్పినప్పటికీ అంతిమంగా ఆదాయం పొందే ట్రస్ట్‌లోని ఆస్తులకు అధ్యక్షుడే లబ్దిదారు. క్రిప్టో వెంచర్ ద్వారానే ట్రంప్ అధిక ఆదాయాన్ని పొందు తున్న ప్పటికీ సంప్రదాయ వ్యాపారాలైన గోల్ఫ్ కోర్సులు, రిసార్టులు కూడా ఆయనకు మిలియన్ల కొద్దీ ఆదాయాన్ని అందిస్తున్నాయి. గోల్ఫ్, రిసార్టుల ద్వారా వచ్చే ఆదాయం గత సంవత్సరం పదిహేను శాతం పెరిగి 500 మిలియన్ డాలర్లు దాటిందని ట్రంప్ నివేదించారు.
మదుపుదారులకు నష్టాలే
ట్రంప్ క్రిప్టో ప్లేబుక్ ఆయన కుటుంబానికి కాసుల వర్షం కురిపించినప్పటికీ మదుపుదారులు మాత్రం నష్టపోయారు. ట్రంప్, ఆయన కుటుంబం క్రిప్టో వెంచర్లో స్వల్పంగా పెట్టుబడి పెట్టి కనీసం 2.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందింది. అదే సమయంలో ఆ వెంచర్లో పెట్టుబడులు పెట్టిన వారు భారీగా నష్టపోయారు. క్రిప్టో కాయిన్ అనేది పూర్తిగా ఊహాజనితమైన టోకెన్. దీని విలువ తరచుగా సోషల్ మీడియా ప్రచారంపై ఆధారపడి ఉంటుంది. ధర పెరిగే వరకూ ఎదురు చూసిన మదుపుదారులు ఒక్కసారిగా అది తగ్గిపోవడంతో ఆర్థికంగా కుదేలయ్యారు. ఈ లోగానే ట్రంప్ కుటుంబం ఈ ప్రాజెక్టులో సొంత డబ్బును ఏ మాత్రం పెట్టుబడి పెట్టకుండానే టోకెన్ల విక్రయం ద్వారా వందల మిలియన్ డాలర్లను జేబులో వేసుకుంది. డాలర్ ట్రంప్ మీమ్ కాయిన్ అనేది ట్రంప్ కుటుంబానికి చెందిన నాలుగు క్రిప్టో ప్రాజెక్టులలో ఒకటి. ఇది ఆ కుటుంబానికి ఆర్థిక జాక్‌పాట్‌గా మారితే మదుపుదారులకు చేదు అనుభవాలను మిగిల్చింది. ట్రంప్ కుటుంబ సభ్యులు ఈ వెంచర్‌పై భారీగా ప్రచారం చేశారు. దీంతో మదుపుదారులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టగా ఆ కుటుంబం బాగా డబ్బు సంపాదించింది. అయితే వివిధ కారణాలతో ట్రంప్ సంబంధ క్రిప్టో ఆస్తుల ధరలు పడిపోవడంతో కొనుగోలుదారులు నష్టపోయారు.



