ప్రతి ఇంటికి పట్టా.. ప్రతి కుటుంబానికి
ఇల్లు నినాదంతో పోరుబాట
పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు మంజూరు
చేసేవరకూ ఉద్యమం : వామపక్ష నేతలు
హనుమకొండలో పలువురి అరెస్టు
నవతెలంగాణ-విలేకరులు
ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదల గుడిసెల కూల్చివేతలను తక్షణమే నిలిపివేసి, అర్హులైన వారందరికీ భూ పట్టాలు, పక్కా ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం), సీపీఐ, ఎంసీపీఐ(యూ), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. పేదల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ గృహ హక్కును పరిరక్షించాలని, నిర్వాసితులైన కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుడిసెవాసులు కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున చేసిన నినాదాలతో కలెక్టర్ కార్యాలయాలు మార్మోగాయి. ధర్నా అనంతరం ఆయా జిల్లా కలెక్టర్లకు వామపక్షాల నేతలు వినతిపత్రాలు అందజేశారు. హనుమకొండ జిల్లా కార్యాలయం వద్ద పోలీసులు, ఆందోళనకారులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు.
కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో స్థలాలు క్రమబద్ధీకరించి హక్కు కల్పించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఇండ్లు లేని వేలాది మంది పేదలు భారీ సంఖ్యలో తరలివచ్చి నాలుగు గంటల పాటు ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎం. సాయిబాబు మాట్లాడారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి ఇంటికి పట్టా.. ప్రతి కుటుంబానికి ఇల్లు అనే నినాదంతో ప్రారంభించిన పోరుబాట, లక్ష్యం నెరవేరేవరకూ ఆగబోదని, పేదలకు గూడు కల్పించేవరకు పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేస్తామని స్పష్టం చేశారు. కొత్తగూడెం పట్టణ పరిధిలో జీవో నెంబర్ 76ను తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేసి, అర్హులైన నిరుపేదలందరికీ పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా పాల్వంచ పరిధిలోని జీవో నెంబర్లు 444, 999, 817, 727, 410 పరిధిలో దశాబ్దాలుగా నమ్ముకుని ఉన్న స్థలాలను తక్షణమే రెగ్యులరైజ్ చేసి అర్హులకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు.
హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా, అరెస్టులు
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట వామపక్షాలు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. ఉదయం 9 గంటలకే కలెక్టరేట్‌కు చేరుకున్న వామపక్షాల నాయకులు, కార్యకర్తలు.. అధికారులను, సిబ్బందిని కలెక్టరేట్‌లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పేదల ఇండ్ల స్థలాల సాధన కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్ చేశారు. ధర్నా నిర్వహిస్తున్న వామపక్షాల నాయకులను సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. నాయకుల అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించగా వామపక్ష పార్టీల కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హనుమకొండ ఏకశిలా పార్కు నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైటాయించి ధర్నా నిర్వహించారు. కలెక్టర్ బయటికి రావాలని, పేదలకు పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. హైదరాబాద్ లక్డికాపూల్‌లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.



