Thursday, July 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌పన్నులు చెల్లించడం దేశాభివృద్ధిలో భాగం

‌పన్నులు చెల్లించడం దేశాభివృద్ధిలో భాగం

- Advertisement -

పౌరులకు చట్టాలపై అవగాహన ఉండాలి :
జీఎస్టీ 9వ వార్షికోత్సవంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 
జస్టిస్‌ అపరేశ్‌ ‌కుమార్‌ ‌సింగ్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో
వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పరోక్ష‍ పన్నుల వ్యవస్థను పూర్తిగా మార్చివేసిందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌ కుమార్ సింగ్ అన్నారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమాఖ్య స్ఫూర్తితో పన్ను పరిపాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా, పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని వివరించారు. భారతదేశంలో అత్యంత కీలకమైన పరోక్ష పన్ను సంస్కరణల్లో ఒకటైన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి 9 ఏండ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్య్రకమానికి ముఖ్యఅతిధిగా హాజరైన జస్టిస్‌ అపరేశ్‌ ‌కుమార్‌ ‌సింగ్‌ ‌మాట్లాడుతూ సాంకేతికత ఆధారిత నిబంధనలతో పన్ను పరిపాలనను ఆధునీకరించినా, డిజిటల్ నోటీసులు, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ), అప్పీళ్ల కాలపరిమితి వంటి అంశాల్లో కొన్ని సవాళ్లు ఉన్నాయని చెప్పారు. పౌరులందరికీ తప్పనిసరిగా చట్టాలు, న్యాయసూత్రాలపై అవగాహన ఉండాలని అన్నారు. నిరంతర అధ్యయనం, పరిశీలన విషయంలో పన్ను చెల్లింపుదారులు, ఆర్థిక నిపుణులు, పన్ను అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జీఎస్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేలా వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాలపరిమితి ముగిసిన అప్పీళ్ల కోసం అమ్నెస్టీ అవకాశం, జీఎస్టీఎన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ వివాద పరిష్కార వ్యవస్థ, పన్ను అక్షరాస్యత కార్యక్రమాల నిర్వహణ వంటి చర్యలు న్యాయ వివాదాలను తగ్గిస్తాయని తెలిపారు. తద్వారా స్వచ్ఛంద పన్ను చెల్లింపులు పెరుగుతాయని సూచించారు.

స్వయంసమృద్ధ భారతదేశ నిర్మాణానికి నిజాయితీతో కూడిన పన్ను చెల్లింపులు అవసరమని స్పష్టం చేశారు. కార్యక్రమానికి అధ్యక్ష‍త వహించిన హైదరాబాద్ జోన్ సెంట్రల్ టాక్స్ అండ్‌ కస్టమ్స్ చీఫ్ కమిషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ పన్ను సంస్కరణల్లో భాగంగా డిజిటల్ గవర్నెన్స్‌ను ప్రోత్సహిస్తూ, సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరుస్తున్నామని వివరించారు. 2017లో ప్రారంభమైనప్పటి నుంచి నెలవారీ జీఎస్టీ వసూళ్లు రెండింతలు పెరిగాయనీ, పన్ను చెల్లింపుదారుల సంఖ్య 60 లక్షల నుంచి 1.65 కోట్లకు పెరిగిందని తెలిపారు. పన్ను రీఫండ్‌ల వేగవంతమైన ప్రాసెసింగ్, సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల మధ్య మెరుగైన సమన్వయం కోసం అనేక కార్యక్రమాలను అమల్లోకి తెచ్చామన్నారు. పన్ను వివాద పరిష్కారానికి జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ అందుబాటులోకి వచ్చిందనీ, దీనివల్ల వ్యవస్థల మధ్య పరస్పర సహకారం పెరుగుతుందన్నారు. కార్య్రకమానికి గౌరవ అతిధిగా హాజరైన ప్రముఖ సినీ నటుడు, పద్మశ్రీ డాక్టర్ కే బ్రహ్మానందం మాట్లాడుతూ దేశ నిర్మాణంలో నిజాయితీగా పన్ను చెల్లించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. కార్యక్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) సీనియర్ అధికారులు, సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ విభాగాల అధికారులు, పన్ను రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధులు, చట్ట నిపుణులు, ఇతర వాటాదారులు పాల్గొన్నారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు ఉద్యోగులకు చీఫ్‌ ‌జస్టిస్‌ అపరేశ్‌ ‌కుమార్‌ ‌సింగ్‌, బ్రహ్మానందం అవార్డులు అందచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -