Sunday, March 1, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిత్రిశూల వ్యూహానికి చావుదెబ్బ

త్రిశూల వ్యూహానికి చావుదెబ్బ

- Advertisement -

ఢిల్లీ లిక్కర్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో సహా 23 మంది నిందితులపై ఆరోపణలు కొట్టివేస్తూ రాస్‌అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు దేశాన్ని కుదిపేసింది. మరీ ముఖ్యంగా త్రిశూల వ్యూహంతో ప్రతిపక్షాలపై ఈడి,సిబిఐ,ఐటిలను ఉసిగొల్పుతున్న మోడీ సర్కారుకు ఇది షాక్‌ తగిలింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మరో విధంగా సెగ తగిలింది. ఎందుకంటే రెండు రాష్ట్రాలలో అప్పుడూ ఇప్పుడూ పాలక పార్టీలలో, కూటములలో వున్న రాజకీయ నేతల గతం, భవితవ్యం ఈ కేసుతో ఎంతగానో ముడిపడి నడిచాయి. అప్పుడూ ఇప్పుడూ అవినీతి కేసులు ఎదుర్కొంటున్న నేతలపైనా ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంచనాలు కూడా వున్నాయి. సిబిఐ ఎలాగూ ఢిల్లీ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేస్తానని ప్రకటించింది. 2009 నాటి 2జి కేసు ఇంకా ఒక కొలిక్కిరాని పరిస్థితిలో లిక్కర్‌ స్కామ్‌ ఇప్పటికిప్పుడు ఏదో తేలిపోతుందన్న నమ్మకం ఎవరికీ లేదు. అంటే ఏళ్ల తరబడి సాగే జాబితాలో మరో కేసు చేరుతుందన్నమాట. తీర్పు వచ్చాక అరవీంద్‌ కేజ్రీవాల్‌ తన నిర్దోషిత్వం నిరూపితమైందని కన్నీటి పర్యంతమవడం చూశాం,ఈ తప్పుడు కేసు మోపి శాసనసభ ఎన్నికల్లో తమను దుష్ప్రచారాలతో ఓడించిన బీజేపీ ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు సిద్ధమా అని ఆయన సవాలు చేశారు. బిఆర్‌ఎస్‌ మాజీ నేత, కేసీఆర్‌ కుమార్తె కవిత కూడా న్యాయం జరిగిందని చెప్పడం ఒకటైతే మాతృసంస్థతో కుటుంబంతో ఆమె రాజకీయ వివాదం రకరకాల రూపాల్లో వ్యక్తమవుతున్న స్థితి. 2023 చివర జరిగిన ఎన్నికల్లో తమపై వ్యరేతిక ప్రచారానికి బీజేపీ ఈ కేసు కారణమైందని కేజ్రీవాల్‌లాగే కేటీఆర్‌ కూడా అనడాన్ని కవిత తప్పు పట్టడం ఆశ్చర్యమే.ఎందుకంటే బీఆర్‌ఎస్‌ కీలకనేతల తప్పిదాలు చాలా వున్నప్పటికీ లిక్కర్‌ స్కామ్‌ ప్రభావమే లేదనడం బీజేపీ వాదనకు దగ్గరగా వుంటుంది. ఇక ఏపీ పాలకకూటమి నేతలు ఇంతవరకూ దీనిపై నోరు విప్పిన దాఖలాలు లేవు. వివిధ మీడియాలు కూడా వాటివాటి తీరును బట్టి స్పందించడం ఊహించిందే.

రాష్ట్రాధినేతలతో చెలగాటం
దేశ చరిత్రలో తొలిసారిగా ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేయడంతో నరేంద్రమోడీ ప్రభుత్వ నిరంకుశత్వం పరాకాష్టాకు చేరింది. జయలలిత,లాలూ యాదవ్‌, శిబుసొరేన్‌, మధుకోడా తదితరులు రకరకాల సందర్భాల్లో వివిధ కేసులలో జైలుకు వెళ్లిన మాట నిజమే.కానీ, వారు పదవులకు రాజీనామా చేసి లేదా కోల్పోయి వెళ్లారు. ఇక్కడ అధికార హోదాలోనే వెళ్లడం ఇదే తొలిసారి. లిక్కర్‌ స్కాం అనే దర్యాప్తులో వరుసగా అనేకమందిని అరెస్టు చేయడం ఒక ఎత్తయితే ఎన్నికల ప్రకటన జరిగాక రాజ్యాంగ పదవిలో వున్న అది కూడా దేశ రాజధాని ప్రాంతాన్ని పాలిస్తున్న కీలకనేతను వెంటబడి నిర్బంధించడం రాజ్యాంగ విలువలకే ప్రమాదమైంది. దానికి ముందు జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ను కూడా అలాగే అరెస్టు చేశారు. ఇదే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ శిసోడియా అప్పటికే జైలులోనే వున్నారు. సిబిఐ, ఈడిలను ఫెడరల్‌ ఏజెన్సీలు (కేంద్ర సంస్థలు) అని సంబోధిస్తుంటారు. వీటికి ఆదాయపుపన్ను శాఖ ఐటిని జోడించి ప్రత్య ర్థులపై ప్రయోగించడమే త్రిశూల వ్యూహంగా పేరొందింది. హిందూత్వ త్రిశూల రాజకీయా లకు తోడైంది. లిక్కర్‌ వ్యవహారంలో ఏం జరిగిందనేదానికీ కేజ్రీవాల్‌ అరెస్టుకూ ఏ సంబంధం లేదు. ఆప్‌ అధినేతగా, ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ దీనికి బాధ్యత వహించవలసి వుంటుందని సుప్రీం కోర్టులో ఈడి అధికారులు వాదించారు. ఆప్‌ పార్టీని ఒక కంపెనీగా అభివర్ణించారు. మనీలాండరింగ్‌ యాక్ట్‌ సెక్షన్‌ 4లో కంపెనీది బాధ్యత అన్నారు గనక ఆప్‌ నాయకుడుగా కేజ్రీవాల్‌ శిక్షార్హుడనేది వారి ఏకైక వాదన. అప్రూవర్లుగా మార్చుకున్న వారు ఇచ్చిన సాక్ష్యాలంటూ కొన్ని చూపించారు.అప్పట్లో వైసీపీ ఎంపీగా వుండి తర్వాత టీడీపీలో చేరిన లిక్కర్‌ వ్యాపారాధినేత మాగుంట శ్రీనివాసరెడ్డి తాను కేజ్రీవాల్‌ను కలుసుకుని, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్కేనాను కలుసుకోవడం కోసం లేఖ రాయించుకున్నానని చెప్పినదాన్నే సాక్ష్యంగా చూపారు.వాస్తవానికి ఒక ఎంపీగాఆయన పదేపదే కలవాలని అడిగిన మీదట ఒక ట్రస్టు ఏర్పాటుపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను కలవడానికి లేఖ ఇచ్చి పంపాననీ, దానికి దీనికీ ఏ సంబంధం లేదని కేజ్రీవాల్‌ చెబుతూనే వచ్చారు. ఇప్పుడు జడ్జి జితేంద్రసింగ్‌ దాన్నే తప్పుపట్టారు. విధాన నిర్ణయాల్లో తప్పొప్పులు, వాటివల్ల లబ్దిదారులు ఎవరనేది ఒకటైతే, ఆ సాకుతో ఏ నిర్దిష్ట ఆధారాలు లేకుండా చెప్పుడు కథనాలతో క్విడ్‌ ప్రో కో పేరిట ఎలా రాజ్యాంగ పదవిలో వున్నవారిని అరెస్టు చేస్తారని ఆయన గడ్డిపెట్టారు. పైగా ఈ చెప్పేవారు కూడా నిందితులో జరిగిన దాంట్లో భాగస్వాములో అయినప్పుడు అసలే ఆ మాటలకు విలువెంతని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో చేసుకునే రాజకీయ ఆరోపణలను న్యాయపరమైన ఆధారాలుగా చూపిస్తే కోర్టులు ఎలా సంతృప్తి చెందుతాయని వ్యాఖ్యానించారు.కవితకు సంబం ధించి కూడా అరబిందో కంపెనీ శరత్‌చంద్రారెడ్డితో లావా దేవీలు, ఇచ్చి పుచ్చుకోవడాలు బ్యాంకు ఖాతాలలో అధికారి కంగా జరిగినప్పుడు దర్యాప్తు చేసి తేల్చిందేమిటని కూడా అడిగారు. అన్నిటినీ మించి సౌత్‌గ్రూప్‌(దక్షిణాది బృందం) ఇచ్చిన పత్రం మేరకే లిక్కర్‌ విధానం తయారైందని ఎలా ఎక్కడ నిరూపించలేదని కూడా ఆక్షేపించారు. ఇలాంటి అనేక కారణాల వల్ల కేసు నిలిచేది కాదని దర్యాప్తు సంస్థలు రాజకీయ సాధనాలు కాకూడదని జడ్జి అన్న మాట చాలాకాలంగా ప్రతిపక్షాలు, న్యాయకోవిదులు హెచ్చరి స్తున్నదే. ఇందుకు గాను దర్యాప్తు అధికారులపై శాఖపరమైన చర్య తీసుకోవాలని కూడా జడ్జి ఆదేశించారు.

ఆప్‌పై అదే కక్ష
మామూలుగా ఒక ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్‌ చేయాలంటే గవర్నర్‌ అనుమతి తప్పనిసరి. ఢిల్లీకి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వుంటారు. అయితే ఆయనే స్వయంగా కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై కేసు పెట్టాలని ఆదేశించడంతో అనుమతి ప్రశ్న లేకుండా పోయింది. ఆ తర్వాత కాలంలో చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు, విచారణలు జరిగినా నిర్దిష్టంగా నిరూపితమైంది లేదు. కేజ్రీవాల్‌ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆధారాలేమీ లేవు, అసలు ఈ స్కామ్‌ అనబడేదాని ద్వారా వచ్చిందని చెబుతున్న మొత్తం రూ.వందకోట్లు, ఇతరత్రా కలిపి ఇది రెండు వందల కోట్లు చూపిస్తున్నారు. వందలో నలభై కోట్లు గోవాలో ఎన్నికల కోసం పంపించారని ఆరోపణ. తన కంచుకోట వంటి ఢిల్లీలో చోటు లేకుండా చేయడమే గాక నెమ్మదిగా గుజరాత్‌లోనూ, గోవాలోనూ కూడా సవాలు చేశారనేది ఆప్‌పై బీజేపీ ప్రత్యేక కక్ష. దేశమంతా తాము పాలిస్తుంటే ఆ పాలన జరిగేచోటును మరెవరో పాలించడం మోడీ బృందం ఎన్నడూ భరించలేకపోయింది. మధ్యతరగతి మద్దతుతో పట్టణ ప్రధానమైన సంస్కరణలతో కొంత సమాంతర పాలన అందించిన ఆప్‌ దేశ రాజకీయ పటంలో ఒక స్థానం సంపాదించుకుంది. నిజానికి ప్రాంతీయ పార్టీగా మొదలై జాతీయపార్టీగా ఎదిగిన ప్రత్యేకత దానిదే.చాలా ప్రాంతీయ పార్టీలలో వలె ఒక నాయకుడి కుటుంబమే చక్రం తిప్పే సంస్కృతి ఆప్‌లో లేకపోవడం ఒక విశేషం. కేజ్రీవాల్‌ పాత్రనే ప్రధానంగా వున్నా పంజాబ్‌లో గెలిచిన తర్వాత అదీ కొంత మారింది. ఢిల్లీ ఓటర్లు కూడా శాసనసభకు ఆప్‌నూ లోక్‌సభకు బీజేపీని గెలిపిస్తూ మిశ్రమ చిత్రం సృష్టించారు. ఈ ద్వంద్వత్వం చాలాకాలం ఆప్‌పైనా ప్రభావం చూపింది. కేజ్రీవాల్‌ ఆంజనేయ దండకంతో సహా కొన్ని ప్రయో గాలు చేశారు. కానీ, బీజేపీకి లోబడిపోతే భవిష్యత్తు వుండదనే వాస్తవం ఆయన గ్రహించగలిగారు.అందుకే తమపై దాడిని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు వివరించడానికి ఆయన దేశమంతా పర్యటించారు. ‘ఇండియా’ వేదికతో సహా పలు ప్రతిపక్ష సమావేశాలకు హాజరైనారు. కేంద్ర నిరంకుశత్వంపై పోరాటంలో పాలు పంచుకున్నారు.ఇవన్నీ సహజంగానే మోడీకి మింగుడు పడలేదు.పైగా కేజ్రీవాల్‌ రాజకీయాలకు తన భక్తిని జోడించి గుళ్లు కూడా తిరగడం మరింత ఆందోళన కలిగించింది. మౌలికంగా అవినీతిపై పోరాటం నినాదంతో పుట్టి పెరిగిన ఆప్‌ నేతపైనే ఆరోపణలు తెచ్చి అడ్డుతొలగించుకోవడానికి ఇది పూర్వరంగం. దురదృష్టవశాత్తూ ఈ సమయంలో కాంగ్రెస్‌ కూడా మోడీ క్రీడకు వంతపాడటంతో ఢిల్లీ మళ్లీ బీజేపీ వశమైంది. ఇప్పుడు కేసు కొట్టివేసిన తర్వాత కూడా కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్‌ ఖేరా బీజేపీకి సానుకూలంగా వుండటం వల్లనే కేజ్రీవాల్‌ను వదలివేశారని ఆరోపిస్తున్నారు! కేరళలో వామపక్ష ప్రభుత్వంపైనే అలాంటి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌కు ఇదేమంత పెద్ద విషయం? బీజేపీ మతరాజకీయాలపై ఏకోన్ముఖ పోరాటం కన్నా స్వప్రయోజనాలకే ఆ పార్టీ పెద్దపీట వేయడం జరుగుతూ వస్తున్నది. మోడీ కేరళలోనూ ఇలాగే చేయబోయి భంగపడ్డారని గుర్తుపెట్టుకోవాలి.

ద్వంద్వనీతికి శృంగభంగం
2024లో కేజ్రీవాల్‌ అరెస్టుకు ముందురోజే న్యూస్‌18 సమ్మిట్‌లో మాట్లాడుతూ మోడీ కేంద్రసంస్థలు చర్యలు తీసుకోలేదని అంతకుముందు అనేవారనీ, తన హయాంలో చర్యతీసుకుంటే గోలచేస్తున్నారని అపహాస్యం చేశారు. ఆయన కాలంలో అవినీతి పేరిట అరెస్టు చేసిన వారిలో 95శాతం ప్రతిపక్షానికి చెందినవారే. అదే తమతో కలిస్తే ‘వాషింగ్‌ పౌడర్‌ నిర్మా’ అని చలోక్తి కూడా పుట్టింది. ఎన్నికల బాండ్లద్వారా బీజేపీకి వేల కోట్ల రూపాయలకు పైన వచ్చినట్టు అధికారికంగా వెల్లడైంది. సరిగ్గా ఏ సంస్థలపైన ఈడి, సిబిఐ ఐటి దాడులు జరిగాయో వాటినుంచే వందల వేల కోట్లు ముట్టాయని లెక్కలతో సహా తేలింది. ప్రధానికి సన్నిహితుడైన గౌతమ్‌ అదానీ నిర్వాకాలపై అంతర్జాతీయ నివేదిక వస్తే విచారణ చేయకుండా మరింత వెసులుబాటు కల్పించారు. అమిత్‌ షా తనయుడైన జైషాపై అరోపణలు వస్తే ప్రచురించిన మీడియాపై చర్య తీసుకున్నారు.ఇప్పుడు అమెరికాలోనే అదానీ కంపెనీపై ఆరోపణల పరంపర వస్తే అడ్డుచక్రం వేశారే గానీ చర్య తీసుకోలేదు. ఎప్‌స్టిన్‌ ఉదంతంలో బయటపడిన వారిపై చర్య కాదు కదా చర్చ కూడా లేదు. ఎన్నికల సంఘం కూడా వారి కనుసన్నల్లో పనిచేసే పద్ధతి తీసుకొచ్చి సర్‌, ఓట్ల తారుమారు ఆరోపణలతో రాజ్యం నడిపిస్తున్నారనే విమర్శలు ఖాతరు చేయడం లేదు. సుప్రీంకోర్టు మాజీలకు పదవులిచ్చి, మరి కొందరిని అదరగొట్టి న్యాయాన్ని తమకు అనుకూలంగా మల్చుకున్నారు. అసలు న్యాయ వ్యవస్థపైనే అవినీతి ముద్రతో పాఠం చెప్పాలనుకుని దెబ్బతిన్నారు. ఈ మొత్తం నిరంకుశత్వ పోకడ, ప్రజాస్వామ్యంపై దాడి ప్రత్యక్ష ప్రసారంలా జరిగిందే. ఇప్పటికైనా దానికి జడ్జి జితేంద్ర సింగ్‌ ధైర్యంగా అడ్డుకట్ట వేశారు.తర్వాత ఏం జరుగుతుందనేది మరోకథ. ఆంధ్రా, తెలంగాణలతో సహా వివిధచోట్ల నడుస్తున్న రాజకీయ అవినీతి కేసులు ఏవి ఎలా ముగుస్తాయనేది చూడవలసిందే. ఇక ఢిల్లీ హైకోర్టులో సిబిఐ వాదనలు తీర్పులు ఎలా ఉంటాయనేది తెరపై చూడవలసిందే.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -