Saturday, July 4, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తన తప్పు తెలుసుకున్నాడు

తన తప్పు తెలుసుకున్నాడు

- Advertisement -

జీవిత భాగస్వామికి తెలియకుండా, వేరే వ్యక్తితో సంబంధాలు కొనసాగించడం ఇటీవల కాలంలో ఓ సాధారణ విషయంగా మారిపోయింది. దాంపత్య జీవితంలో అసంతృప్తి, ఆర్థిక సమస్యలు, భాగస్వామి నుండి తగిన గుర్తింపు, గౌరవం పొందలేక పోవడం, ఒకరికి ఒకరు సమయం కేటాయించుకో లేకపోవడం, ఫోన్లకు బానిసలవ్వడం ఇలా అనేక కారణాలు ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ఇలాంటపుడు ఒకరినొకరు అర్థం చేసుకొని అసలు కారణాలు తెలుసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలి. అలా కాకుండా కొంత మంది ఎదురుదాడులు చేస్తుంటారు. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌ (ఐలమ్మ ట్రస్ట్‌)‌లో…

దీప్తికి దాదాపుగా 30 ఏండ్లు ఉంటాయి. భర్త వంశీకి 35 ఏండ్లు. ఇద్దరిదీ ప్రేమ వివాహం. పెండ్లి జరిగి ఏడేండ్లు అవుతుంది. ఇద్దరూ ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నారు. పెండ్లి తర్వాత వంశీ ఓ కొత్త సంస్థలో చేరాడు. వీరికి ఇద్దరు పిల్లలు. పాపకు ఆరేండ్లు, బాబుకు నాలుగేండ్లు. పాప స్కూల్‌‌కి వెళుతుంది. బాబును ఈ ఏడాది చేర్చాలను కుంటున్నారు. కానీ గత రెండేండ్ల నుండి వంశీలో చాలా మార్పు వచ్చింది. దీప్తికి దూరంగా ఉంటున్నాడు. సరిగ్గా మాట్లాడడం లేదు. ఇంటి బాధ్యతలు కూడా పట్టించుకోవడం లేదు. కొత్తగా మందు అలవాటు చేసుకున్నాడు. కొత్త స్నేహితులు పెరిగిపోయారు. పాత స్నేహితులను అస్సలు కలవడం లేదు. వాళ్లు ఫోన్‌ ‌చేసినా మాట్లాడడం లేదు. వాళ్లు ఇంటికి వచ్చినా ‘నాకు వేరే పని ఉంది’ అని తప్పించుకుంటున్నాడు. ‘ఏదో జరుగుతుంది, లేదంటే వంశీ ఇలా ఎందుకు ఉంటాడు’ అని దీప్తికి అనుమానం వచ్చింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా అతను ఇలా ఎందుకు మారిపోయాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తే… వంశీ ఉద్యోగం చేస్తున్న చోట ఓ ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది.

కానీ కచ్చితమైన ఆధారాలు ఉంటేనే అతన్ని అడగటానికి అవకాశం ఉంటుందని ఆరు నెలలు నిఘా పెట్టి వంశీ స్నేహితులు విషయం తెలుసుకున్నారు. ఆమె వంశీ కంటే పెద్దది. భర్త పిల్లలు ఉన్నారు. అయితే ఆమె భర్త ఉద్యోగరీత్యా ఎక్కువగా వేరే రాష్ర్టాలకు తిరుగుతుంటాడు. ఆసమయంలో వంశీ వాళ్ల ఇంటికి వెళ్లి వస్తుంటాడు. అతని జీతం నుండి ఎక్కువ మొత్తం ఆమెకు ఇస్తున్నాడు. ఆమె కొత్త ఇల్లు తీసుకుంటే వంశీ డబ్బులు ఇచ్చాడు. దీప్తి నగలు అమ్మి మరీ ఆమెకు డబ్బులు ఇచ్చాడు. వ్యాపారం కోసమని ఆమెను నమ్మించాడు. తర్వాత అందులో నష్టం వచ్చిందని చెప్పాడు. ఇలా వంశీ దీప్తికి దూరమవుతూ ఆమెకు దగ్గరవుతున్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఐద్వా లీగల్‌‌సెల్‌‌కు వచ్చి ‘బాబు పుట్టక ముందు నుండే వంశీ నాతో ప్రేమగా ఉండడం లేదు. అయితే నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోతే వ్యాపారంలో నష్టం వచ్చినందుకు అనుకున్నాను. దాని నుండి బయటపడటానికి కొంత టైం పడుతుందని నేనే సర్దుకు పోయాను. అతను వేరే ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని అత్తయ్య వాళ్లకు చెబితే వాళ్లు నన్నే తిడుతున్నారు.

అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరే ఎలాగైనా నా కాపురాన్ని నిలబెట్టండి’ అంటూ బాధపడింది. మేము వంశీని పిలిచి మాట్లాడితే అతను ముందు ఒప్పుకోలేదు. గట్టిగా అడిగే సరికి ‘అవును నాకు ఆమెతో సంబంధం ఉంది. భర్త ఆమెను ఒంటరిగా వదిలేసి ఎక్కువగా బయట తిరుగుతుంటాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు. వాళ్లను చూసుకోవడం, ఇంటి పనులు, ఉద్యోగం ఇవన్నీ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతుంది. దాంతో నాకే తెలియకుండా సాయం చేయాలని ఆమెకు దగ్గరయ్యాను. దీప్తి బంగారం అమ్మి వ్యాపారం చేస్తున్నానని చెప్పి ఆమెకు డబ్బులు ఇచ్చాను. ఆ డబ్బు ఆమె పిల్లల చదువుల కోసం, ఇల్లు కొనుక్కోవడం కోసం వాడుకుంది. కానీ నేను దీప్తి దగ్గర కంటే ఆమె దగ్గరే చాలా సంతోషంగా ఉంటున్నాను. అయినా దీప్తి కూడా ఈ మధ్య ఎవరితోనో ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతుంది. ఇందులో తప్పేముందని నేను వదిలేశాను. పైగా కోర్టు కూడా నచ్చిన వాళ్లతో సంబంధం పెట్టుకోవడం తప్పులేదని చెప్పింది. అలంటప్పుడు నేను చేసిన దాంట్లో తప్పేముంది’ అన్నాడు.

దానికి మేము ‘వేరే వాళ్లతో సంబంధం పెట్టుకోవడం తప్పు కాదు అంటావు, మరి పిల్లల బాధ్యత ఎవరు చూసుకోవాలి. నువ్వు వేరే వాళ్ల పిల్లల్ని చూసుకుంటావు, మరి నీ పిల్లల సంగతేంటి. ఈ విషయం గురించి కోర్టు ఏం చెప్పిందో నువ్వు తెలుసుకోలేదా? అనవసరంగా ఏదేదో మాట్లాడి తప్పించుకోవాలని చూడకు. పైగా దీప్తిపై నిందలు వేయాలని చూస్తున్నావు. నువ్వు సంబంధం పెట్టుకున్న ఆమెకు మరో ఇద్దరితో కూడా సంబంధం ఉంది. ఇవేవీ పట్టించుకోకుండా గుడ్డిగా ఆమెతో ఉంటున్నావు. ప్రేమించిన దీప్తిని మోసం చేస్తున్నావు. నీ పిల్లల్ని వదిలి పెట్టి ఎక్కడో ఉంటున్నావు. డబ్బు మొత్తం నాశనం చేస్తున్నావు. నిన్ను నమ్మి దీప్తి తన నగలు ఇచ్చింది. కానీ నువ్వ ఆమెను మోసం చేశావు. అయినా ఆమె నిన్ను మార్చుకోవాలని మా దగ్గరకు వచ్చింది. ఇంతగా ప్రేమించే భార్యను దూరం చేసుకుంటే రేపు నీ జీవితం ఏమవుతుందో ఆలోచించుకో. నీ అవసరం తీరన తర్వాత, తన భర్త వచ్చిన తర్వాత ఆమె నిన్ను వదిలేస్తుంది.

ఆప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీకు ఆమే కావాలనుకుంటే దీప్తికి విడాకులు ఇచ్చి ఆప్పుడు ఆమెతోనే ఉండు. నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. నీ భార్య కూడా తన జీవితం తాను చూసుకుంటుంది’ అన్నాము. దాంతో అతను ‘నన్ను క్ష‍మించండి, నిజానికి నేను దీప్తిని మోసం చేయాలని ఇలా చేయలేదు. నాకే తెలియకుండా జరిగిపోయింది. నా తప్పు నాకు తెలిసింది. ఇంకోసారి దీప్తిని బాధపెట్టను. నమ్ము నమ్మండి’ అన్నాడు. దానికి మేము ‘మనల్ని ప్రేమించే వారితో ఉంటే మన జీవితం సంతోషంగా ఉంటుంది. అంతే కానీ తాత్కాలిక ఆనందాల కోసం జీవితాలను పాడు చేసుకుంటే భవిష్యత్‌ ‌లేకుండా పోతుంది. మీ తప్పు మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇకపై ఇద్దరూ సంతోషంగా ఉండండి’ అని చెప్పి పంపించాము.

ఆమె వంశీ కంటే పెద్దది. భర్త పిల్లలు ఉన్నారు. అయితే ఆమె భర్త ఉద్యోగరీత్యా ఎక్కువగా వేరే రాష్ర్టాలకు తిరుగుతుంటాడు. ఆసమయంలో వంశీ వాళ్ల ఇంటికి వెళ్లి వస్తుంటాడు. అతని జీతం నుండి ఎక్కువ మొత్తం ఆమెకు ఇస్తున్నాడు. ఆమె కొత్త ఇల్లు తీసుకుంటే వంశీ డబ్బులు ఇచ్చాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -