Saturday, July 4, 2026
E-PAPER
Homeజాతీయంనీటిపై తేలుతున్న పరీక్షా పత్రాలు

నీటిపై తేలుతున్న పరీక్షా పత్రాలు

- Advertisement -

బీజేపీ పాలిత రాష్ట్రం బీహార్‌‌లో వైరల్
నిర్లక్ష్యం కాదు..వర్షం వల్లేనని అధికారుల బుకాయింపు
విద్యార్థుల జీవితాలతో చెలగాటం : తల్లిదండ్రుల ఆగ్రహం

పాట్నా : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరీక్ష నిర్వహణ తీరు ప్రహసనంగా మారుతోంది. వివిధ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన వార్తలు వస్తున్న తరుణంలోనే తాజాగా ఓ ఘటన చోటుచేసుకోవడంతో.. విద్యాశాఖ నిర్లక్ష్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తాజాగా బీహార్‌లోని బక్సర్ జిల్లాలో పరీక్షా పత్రాల కట్టలు నీటిపై తేలుతున్నట్టుగా ఉన్న ఒక వీడియో వైరల్ అయింది. నీరు నిలిచిన ప్రదేశంలో పరీక్షా పత్రాల కట్టలు ఉండటం, వాటిని అక్కడి నుంచి తొలగించడానికి ప్రజలు ప్రయత్నించడం ఆ వీడియోలో కనిపించింది. బక్సర్‌లో 9, 10 , 12వ తరగతుల ప్రశ్నపత్రాలు నీటిలో తేలుతున్నాయనే క్యాప్షన్‌‌తో పలు సోషల్ మీడియా పోస్ట్‌లు కనిపించాయి.వీడియోలో కనిపించినవి పాఠశాలలకు పంపిణీ చేస్తున్న ప్రశ్నపత్రాలు , సమాధాన పత్రాల కట్టలేనని జిల్లా విద్యాశాఖ అంగీకరించింది.

అయితే పరీక్షా సామగ్రి పూర్తిగా సురక్షితంగా ఉందనీ, పరీక్షలు షెడ్యూల్ ప్రకారం సజావుగా జరిగాయని కూడా ఆ శాఖ చెప్తోంది. జులై 2026 త్రైమాసిక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు జూన్ 27 నాటికే జిల్లాకు చేరుకున్నాయని వివరించింది. ‘‘జూన్ 28న బక్సర్‌లోని ఎం.పీ. ఉన్నత పాఠశాలను పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షకు కేంద్రంగా నిర్ణయించినందున, ముందుజాగ్రత్త చర్యగా పరీక్ష సామగ్రిని బక్సర్‌లోని రాజకియా బునియాది విద్యాలయ భవనానికి తరలించి భద్రపరిచారు’’ అని ఓ అధికారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు జూన్ 30 నుంచే ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలను సేకరించడం ప్రారంభించాయని ఆయన తెలిపారు.పంపిణీ ప్రక్రియలో భాగంగా, వివిధ పాఠశాలలకు ఉద్దేశించిన ప్యాకెట్లను వేరు చేసి రవాణా కోసం వాహనాల్లోకి ఎక్కిస్తున్నప్పుడు అనుకోకుండా భారీ వర్షం ప్రారంభమైందని వివరించారు. పంపిణీ సమయంలో అకస్మాత్తుగా వర్షం కురిసినప్పటికీ.. ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలతో సహా అన్ని ప్యాకెట్లను ఆయా పాఠశాలలకు సురక్షితంగా రవాణా చేశామని అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -