ఎమ్మార్పీ కంటే అధిక ధరలు..
తనిఖీలు చేపట్టని అధికారులపై ప్రజల ఆగ్రహం..
నవతెలంగాణ-కుభీర్
మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మార్పీ ధర కంటే ఒక్కో మద్యం సీసాపై రూ.30 నుంచి రూ.40 వరకు అదనంగా వసూలు చేస్తున్నా.. నిమ్మకునీరెత్తనట్టు ఎక్సైజ్ శాఖ వ్యవహరిస్తోందని వాపోతున్నారు.
మండలంలోని అనేక గ్రామాల్లో ఉదయం నుంచి అర్థరాత్రి వరకు బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గ్రామాల్లోనే సులభంగా మద్యం లభిస్తుండటంతో యువతతో పాటు కూలీలు కూడా మద్యానికి అలవాటు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, దీంతో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారని వాపోతున్నారు. మద్యపానంతో కుటుంబాల్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయనీ మహిళలు చెబుతున్నారు.
మామూళ్ల మత్తులోనే అక్రమ విక్రయాలను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్తానికులు మండిపడుతున్నారు. అయినా అధికారులు స్పందించడం లేదని, గ్రామాల్లో బెల్ట్ షాపుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో మహిళలు, పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యంతో యువత భవిష్యత్తు దెబ్బతింటోందని, పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, అధికారులు మొద్దునిద్ర వీడి అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నిరంతర తనిఖీల ద్వారా అక్రమ విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.



