Monday, July 6, 2026
E-PAPER
Homeజాతీయంఅప్పుతో ఆరంభం ఈఎంఐలతో పోరాటం

అప్పుతో ఆరంభం ఈఎంఐలతో పోరాటం

- Advertisement -

ఆర్థిక బానిసత్వంలో మహిళా సాధికారత
మైక్రోఫైనాన్స్ ఉచ్చులో పేద మహిళలు
ఒక అప్పు తీర్చేందుకు మరో అప్పు
కుటుంబాలపై పెరుగుతున్న రుణ భారం
ఉపాధి, ఆదాయ భద్రత కల్పించటంలో మోడీ సర్కారు విఫలం
కార్పొరేట్లకే ఆర్థిక ప్రయోజనాలు
ప్రభుత్వ వైఫల్యంతో లాభపడుతున్న ప్రయివేటు రుణ సంస్థలు

‘మహిళల సాధికారత’, ‘ఆర్థిక చేయూత’, ‘స్వయం ఉపాధి’ అంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారాల వెనుక మరో కఠిన వాస్తవం దాగిఉంది. దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గడం, ఆరోగ్యం, విద్య, నిత్యావసర ఖర్చులు పెరగడంతో పేద కుటుంబాలు మైక్రో ఫైనాన్స్‌ ‌సంస్థలు అందించే చిన్న రుణాలపై ఆధారపడుతున్నాయి. అయితే ఆ రుణాలే ఇప్పుడు వారి మెడకు ఉరితాడులా మారుతున్నాయి. మైక్రోఫైనాన్స్ సంస్థలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ, కుటుంబాలను ఆర్థికంగా చిదిమేస్తున్నాయి. అయినా వాటిపై సమర్థవంతమైన నియంత్రణ తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుంది. ఫలితంగా ఒక అప్పు తీర్చేందుకు మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నెలవారీ ఈఎంఐలు వారి జీవితాన్ని శాసిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని పట్టణ పేద మహిళలు ఎదుర్కొంటున్న ఈ మౌన ఆర్థిక సంక్షోభం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది.

న్యూఢిల్లీ : భారత్‌‌లో మహిళా సాధికారత పేరుతో మైక్రోఫైనాన్స్ సంస్థలు అందిస్తున్న చిన్న రుణాలు పేద కుటుంబాలకు పెద్ద ఉచ్చుగా మారుతున్నాయి. ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల చదువులకు, అనారోగ్య ఖర్చులకు, కడుపు నింపుకోవడానికి తీసుకున్న ఈ రుణాలు చివరకు కుటుంబాలను అంతులేని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో ఉండే పేద మహిళల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈఎంఐలతోనే వారి జీవితం గడిచిపోతోంది. దీంతో వారు మానసికంగా మరింత కుంగిపోతున్నారు.

అప్పు తీసుకొని ఇల్లు కట్టి..
హర్యానాలోని ఫరీదాబాద్‌‌లో ఒక మురికివాడలో నివసించే 45 ఏండ్ల షబ్రీన్ (పేరు మార్చాం) జీవితం దేశంలోని పేద మహిళల పరిస్థితికి అద్దం పడుతోంది. ఒకప్పుడు నర్సుగా పనిచేసిన ఆమె ఇప్పుడు పిల్లలతో కలిసి చిన్నచిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. వరదలు వస్తే ఇల్లు దెబ్బతింటుంది. మరమ్మతులకు డబ్బు లేదు. దీంతో మొదట స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు తీసుకుని చిన్న స్థలం కొనుగోలు చేసింది. తర్వాత ఇల్లు నిర్మించేందుకు మరో అప్పు తీసుకుంది. 2019లో జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి రూ.30 వేల రుణం తీసుకుంది. 2021లో మరో రూ.60 వేల రుణం తీసుకుంది. మొత్తం రూ.90 వేల రుణానికి చివరకు రూ.1.30 లక్షలకు పైగా చెల్లించింది. అలాగే 2023లో శాటిన్ క్రెడిట్‌కేర్ అనే మైక్రోఫైనాన్స్ సంస్థ నుంచి మరో రూ.లక్ష రుణం తీసుకుంది. ఇప్పటికీ ఆమె నెలకు రూ.3,400 ఈఎంఐ చెల్లిస్తోంది. దీనికి తోడు షబ్రీన్ భర్త చేసిన అప్పుల భారం కూడా ఆమెపైనే పడింది. ఆమె భర్తకు రోడ్డు ప్రమాదంలో గాయపడినా, అప్పుల వాయిదాలు కట్టలేక తప్పలేదని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పుకొచ్చింది. అమె పెద్ద కొడుకు నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు సంపాదిస్తాడు. ఆ సంపాదనలోనూ నెలకు రూ.5వేలు తీసుకున్న పలు రుణాల ఈఎంఐలకు వెళ్తున్నాయి. అంటే కుటుంబ ఆదాయంలో దాదాపు సగం అప్పుల చెల్లింపులకే ఖర్చవుతోంది.

ఆ తర్వాతే వారికి ఆహారం, మందులు, విద్య వంటి అవసరాలు. ఒక్కోసారి ఈఎంఐలు చెల్లించలేకపోతే స్థానిక వడ్డీ వ్యాపారుల నుంచి 10 శాతం వడ్డీకి తీసుకొని ఈఎంఐలు చెల్లించాల్సి వస్తున్నదని కష్టాల్ని ఏకరువు పెట్టింది. ఇది కేవలం షబ్రీన్‌ ‌కుటుంబ పరిస్థితి మాత్రమే కాదు. దేశంలో ఇలాంటి ఆర్థిక కష్టాలు పడుతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మైక్రోఫైనాన్స్‌‌ల ఉచ్చులో మహిళలు పడుతున్న కష్టాలు, అవమానాలు సామాన్యంగా లేవు. పురుషుల నిర్ణయాలు..మహిళల పేరుతో రుణాలుమైక్రోఫైనాన్స్ రంగంలో దాదాపు 99 శాతం రుణగ్రహీతలు మహిళలే. కానీ ఆ డబ్బు ఎలా ఖర్చు చేయాలనే నిర్ణయం ఎక్కువగా కుటుంబంలోని పురుషుల చేతిలోనే ఉంటోంది. వాస్తవానికి రుణం మహిళ పేరుమీద ఉంటుంది. ఈఎంఐ కట్టే బాధ్యత కూడా ఆమెదే. కాబట్టి మైక్రోఫైనాన్స్‌ ‌వారు ఇంటికొచ్చి ఒత్తిడి తెచ్చేది కూడా ఆమెపైనే. ఇలా మహిళలను ఓ విధంగా రుణగ్రహీతలుగా ఉపయోగించుకుంటున్న పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. మైక్రో ఫైనాన్స్‌ సిబ్బంది తరచూ ఇంటికొచ్చి నిలబడటం, ఇరుగుపొరుగువారికి విషయం తెలిసిపోవడం, సమాజంలో అవమానం ఎదురుకావడం వంటి పరిస్థితులు మహిళలపై మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. దీనినే ఆర్థిక నిపుణులు ‘ఎకానమీ ఆఫ్ షేమ్’గా అభివర్ణిస్తున్నారు.

అంటే డబ్బు కంటే సిగ్గు, సామాజిక ఒత్తిడినే వసూలు సాధనంగా ఉపయోగించే వ్యవస్థ అన్నమాట.ఈఎంఐ ఆలస్యమైతే భారీ జరిమానాలుఫరీదాబాద్‌‌కు చెందిన పూజ (36) (పేరు మార్చాం) తన కుమార్తె చదువుల కోసం బజాజ్ ఫైనాన్స్ ద్వారా మొబైల్ ఫోన్ కొనుగోలు చేసింది. ఆమెకు జీతం రెండు రోజులు ఆలస్యంగా రావడంతో ఈఎంఐ సమయానికి చెల్లించలేకపోయింది. ఫలితం… రూ.600 జరిమానా. చాలీచాలని జీతంతో పనిచేసే ఆమెకు ఇది పెద్ద ఆర్థిక భారమే. అప్పులు, ఈఎంఐలతో పాటు భారీ జరిమానాలు కూడా మహిళలకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తున్నాయి. ​ఒక్క క్లిక్‌‌తో లోన్‌.. మరింత అప్పుల్లోకి నెడుతున్న యాప్‌లుఒకప్పుడు అప్పు పుట్టాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ప్రస్తుత డిజిటల్‌ ‌యుగంలో అప్పు పుట్టడం చాలా సులభతరమైంది. మొబైల్‌ ‌ఫోన్‌‌లో ఒక్క క్లిక్‌‌తో ఖాతాల్లోకి డబ్బులు వచ్చి చేరుతున్నాయి. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ప్రమీలా (పేరు మార్చాం) ముత్తూట్ ఫైనాన్స్ నుంచి దాదాపు రూ.లక్ష రుణం తీసుకుంది. ఆమె మొబైల్ యాప్‌లో ఎప్పుడూ కనిపించే ‘టాప్-అప్’ బటన్ మరో రుణం తీసుకోవాలని ఆకర్షించే, ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలా సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తున్న వారిని మరింత రుణం తీసుకునేలా డిజిటల్ విధానాల ద్వారా ప్రోత్సహించడం ఆర్థిక దోపిడీకి కొత్త రూపమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డెట్‌ ‌ట్రాప్‌లో ప్రజలు
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ఆర్థిక నిపుణురాలు ప్రొఫెసర్ దీపా సిన్హా చెప్తున్నట్టు… ఇప్పుడు ఎక్కువ రుణాలు ఆదాయం పెంచేందుకు కాకుండా వైద్యం, పెళ్లిళ్లు, జీవనాధారం కోసం తీసుకుంటున్నారు. దీంతో ఒక అప్పు తీర్చేందుకు మరో అప్పు చేస్తున్నారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ ఆర్ రామకుమార్ మాట్లాడుతూ దేశంలోని ప్రస్తుత పరిస్థితి 2010లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మైక్రోఫైనాన్స్ సంక్షోభాన్ని గుర్తు చేస్తోందని హెచ్చరించారు. మొత్తానికి ప్రభుత్వాల వైఫల్యం పేదలకు అప్పులను, ప్రయివే టు ఫైనాన్స్‌ ‌సంస్థలకు లాభాలను తెచ్చిపెడుతోందనడంలో సందేహం లేదు. ఈ విషయంలో పేద ప్రజల పక్ష‍ాలన నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలమైన ఆర్థిక విధానాలకు రూపకల్పనలు చేస్తూ, కార్పొరేట్ల ఆదాయాలను మాత్రం రెట్టింపు చేస్తుండటం గమనార్హం!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -