Wednesday, March 4, 2026
E-PAPER
Homeమానవిఇఫ్తార్ స్పెష‌ల్స్‌

ఇఫ్తార్ స్పెష‌ల్స్‌

- Advertisement -

ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్‌ మాసం నడుస్తోంది. ఈ సందర్భంగా రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం బంధుమిత్రులతో కలిసి ఇఫ్తార్‌ విందును ఆరగిస్తుంటారు ముస్లిం సోదరులు. ఈ క్రమంలోనే అందరూ హాలీమ్‌, బిర్యానీల నుంచి కబాబ్‌ల వరకు రకరకాల రెసిపీలు టేస్ట్‌ చేస్తుంటారు. వంటకం ఏదైనా రోజంతా శక్తిని అందించేవిగా ఉండాలి. అయితే ఈసారి ఇఫ్తార్‌ విందులో రెగ్యులర్‌గా చేసుకునే వంటకాలు కాకుండా వెరైటీగా ట్రై చేయాలనుకుంటున్నారా? అలాంటి వారికోసమే ఈ స్పెషల్‌ వంటకాలు.

చికెన్‌ జహాపనా
కావాల్సిన పదార్థాలు: కిలో – చికెన్‌, అర కప్పు – టమాటా ప్యూరీ, ఆరు – ఉల్లిగడ్డలు, కప్పు – పెరుగు, నాలుగు టేబుల్‌ స్పూన్లు – అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఐదారు – పచ్చిమిర్చి, స్పూన్‌ – షాజీరా, రెండించుల ముక్క – దాల్చినచెక్క, ఏడెనిమిది – లవంగాలు, ఆరేడు – యాలకులు, రెండు – బిర్యానీ ఆకులు, స్పూన్‌ – పసుపు, రెండు స్పూన్లు – కారం(రుచికి తగినంత), రెండు స్పూన్లు – ధనియాల పొడి, స్పూన్‌ – జీలకర్ర పొడి, చెంచా – గరంమసాలా, రుచికి తగినంత – ఉప్పు, నాలుగు టేబుల్‌ స్పూన్లు – నెయ్యి, ఆరు టేబుల్‌ స్పూన్లు – నూనె, కొత్తిమీర తరుగు – కొద్దిగా, పుదీనా – కొద్దిగా, రెండు టేబుల్‌ స్పూన్లు – నిమ్మరసం.
తయారీ విధానం: ముందుగా చికెన్‌ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని రెడీగా ఉంచుకోవాలి. టమాటా ప్యూరీని సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. స్టవ్‌ మీద కడాయిలో నూనె వేసి వేడి చేసి బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, షాజీరా వేసి వేయించాలి. మంచి వాసన వస్తున్నప్పుడు ఉల్లి తరుగు వేసి గోల్డెన్‌ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో పుదీనా తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, పచ్చిమిర్చి ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అందులోనే టమాటా ప్యూరీ వేసి కలిపి సన్నని మంటపై నూనె పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. తర్వాత పెరుగు, తగినన్ని నీళ్లు, కారం, పసుపు, ధనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా, టేస్ట్‌కు సరిపడా ఉప్పు, చికెన్‌ ముక్కలను వేసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ముక్కలు చక్కగా ఉడికి, గ్రేవీ చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చివరగా అందులో కొత్తిమీర తరుగు, నిమ్మరసం యాడ్‌ చేసుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకుంటే చాలు. సరికొత్త రుచితో నోరూరించే ”చికెన్‌ జహాపనా” కర్రీ రెడీ అవుతుంది.

సూప్‌
కావాల్సిన పదార్థాలు: బియ్యం – కప్పు, పెసరపప్పు – కప్పు, నెయ్యి – తగినంత, దాల్చినె చెక్క – చిన్న ముక్క, లవంగాలు – రెండు, బిర్యానీ ఆకు – ఒకటి, జీలకర్ర – టీస్పూను, పచ్చిమిర్చి – రెండు, ఉల్లిగడ్డ – ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – టీస్పూను, పుదీనా – కొద్దిగా, టమాటా – ఒకటి, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – కొద్దిగా.
తయారీ విధానం: బియ్యం, పెసరపప్పు రెండూ విడివిడిగా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారనిచ్చి వీలైనంత మెత్తగా గ్రైండ్‌ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో అర కప్పు పిండి ఓ చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన పిండిని స్టోర్‌ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. ఆ అర కప్పు పిండిలో కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనాను సన్నగా కట్‌ చేసుకోవాలి. ఓ వెడల్పాటి గిన్నెలో మూడు టేబుల్‌ స్పూన్ల నెయ్యి పోసి వేడి చేసుకోవాలి. అందులో జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు వేసి లో-ఫ్లేమ్‌లో వేయించాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు వేసి కలుపుతూ వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. తర్వాత పుదీనా తరుగు వేసి ఓ నిమిషం వేయించాలి. అనంతరం టమాటా ముక్కలు వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించాలి. అందులోనే ఐదు కప్పుల నీరు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి హైఫ్లేమ్‌లో మరిగించాలి. అందులో పెసరపిండి వేసి బాగా కలిపి మరో పది నిమిషాలు మరిగించాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి. అంతే రంజాన్‌ స్పెషల్‌ గంజి రెడీ. దీన్ని వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే సూపర్‌ టెస్టీగా ఉంటుంది. దీన్ని కొందరు ఆష్‌ అని కూడా అంటారు.

స్టఫ్డ్‌ బెల్‌ పెప్పర్‌
తయారీకి కావలసిన పదార్థాలు :
బెల్‌ పెప్పర్‌ – పెద్దది ఒకటి, వంద గ్రాములు – ఉడికించిన చిక్‌పీస్‌, పావు కప్పు – వండిన క్వినోవా, పావు కప్పు – తరిగిన టమోటాలు, పావు కప్పు – పాలకూర(సన్నగా కట్‌ చేసినది), 2 టేబుల్‌ స్పూన్లు – ఫెటా చీజ్‌, టేబుల్‌ స్పూన్‌ – సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు, రుచికి సరిపడా – ఉప్పు, మిరియాలు, జీలకర్ర – కొద్దిగా, అర టేబుల్‌ స్పూన్‌ – ఆలివ్‌ నూనె.
కీరదోస పెరుగు సలాడ్‌ కోసం: కొన్ని కట్‌ చేసిన కీరదోస ముక్కలు, అర కప్పు – గ్రీకు పెరుగు, అర టేబుల్‌ స్పూన్‌ – మెంతుల పొడి, పావు టేబుల్‌ స్పూన్‌ – లవంగం, వెల్లుల్లి ముక్కలు, కాస్త నిమ్మకాయ రసం, రుచికి సరిపడా ఉప్పు, మిరియాలు, అర టేబుల్‌ స్పూన్‌ – ఆలివ్‌ నూనె.
తయారీ విధానం: ముందుగా బెల్‌ పెప్పర్‌ను సగానికి కట్‌ చేసి అందులోని విత్తనాలు, పొరలను తొలగించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిక్‌పీస్‌, స్టఫ్డ్‌ బెల్‌ పెప్పర్‌ కోసం.. పైన చెప్పిన పదార్థాలన్నింటి ఒక గిన్నెలో వేసుకొని బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని.. కట్‌ చేసి పక్కన పెట్టుకున్న బెల్‌ పెప్పర్‌లో సగానికి ఒత్తి నింపి పోయిల్‌ కవర్‌తో కప్పి వాటిని 25- 30 నిమిషాల పాటు ఓవెన్‌లో 180సెంటీగ్రేడ్‌ వద్ద బేక్‌ చేయాలి. తర్వాత పోయిల్‌ కవర్‌ తీసేసి మరో 10-15 నిమిషాలు బేక్‌ చేసుకోవాలి. ఈలోపు కీరదోసను తీసుకొని సన్నగా కట్‌చేసుకోవాలి. చిన్న గిన్నెలో పెరుగుతో పాటు సలాడ్‌ కోసం చెప్పిన పదార్థాలను వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులో కీరదోస ముక్కలు వేసి నెమ్మదిగా కలిపి వాటిని 30 నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి. తర్వాత చిక్‌పీస్‌ బెల్‌ పెప్పర్‌ను కొత్తమీరతో గార్నిష్‌ చేసుకొని ఫ్రిజ్‌ నుంచి కీరదోస పెరుగు సలాడ్‌ తీసి దానితో కలిపి సర్వ్‌ చేసుకోవాలి.

ఓవర్‌ నైట్‌ ఓట్స్‌
తయారీకి కావాల్సిన పదార్థాలు : రోల్డ్‌ ఓట్స్‌ – అర కప్పు, పాలు – అర కప్పు, పెరుగు/గ్రీక్‌ యోగర్ట్‌ – అర కప్పు, చియా సీడ్స్‌ – టేబుల్‌ స్పూను, తేనె – టేబుల్‌ స్పూన్‌, ఎండు ద్రాక్ష – టేబుల్‌ స్పూన్‌, వాల్‌నట్స్‌ – టేబుల్‌ స్పూన్‌, దాల్చిన చెక్క పొడి – కొద్దిగా, క్యారట్‌ తురుము – అర కప్పు.
తయారీ విధానం : ఒక మేసన్‌ గ్లాస్‌ జార్‌ (గాలి చొరబడని కంటైనర్‌)లో రోల్డ్‌ ఓట్స్‌, చియా సీడ్స్‌ వేసుకోవాలి. అందులోనే పాలు, పెరుగు, తేనె, దాల్చిన చెక్క పొడి వేసి, తురిమిన క్యారట్‌ కూడా వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి. తర్వాత జార్‌ మూత పెట్టి రాత్రంతా లేదా కనీసం 4 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. అనంతరం ఫ్రిజ్‌ నుంచి ఆ జార్‌ తీసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఎండు ద్రాక్ష, బెర్రీలు, వాల్‌నట్స్‌, తాజా పండ్లతో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీ, హెల్తీ ఓవర్‌నైట్‌ ఓట్స్‌ రెడీ…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -