నవతెలంగాణ – హైదరాబాద్ : ఒడిశా తీరంలో చిక్కుకుపోయిన మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విశాఖపట్నంకు చెందిన మత్స్యకార బోటులోని సిబ్బందిని ఒడిశా మెరైన్ పోలీసులు సురక్షితంగా రక్షించారని తెలిపారు. బోటు యజమాని దానయ్యతో సహా మొత్తం 10 మంది మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేరారని, ఈ వార్త అందరిలో ఆనందాన్ని నింపిందని మంత్రి వివరించారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ, సహాయక చర్యల వివరాలను వెల్లడించారు.
తమ మత్స్యకారులు కష్టాల్లో ఉన్నారన్న సమాచారం అందిన వెంటనే ఏపీ ప్రభుత్వం తరఫున తాము వేగంగా స్పందించామని ఆయన వివరించారు. ఒడిశా మెరైన్ పోలీసులతో పాటు, అక్కడి మత్స్యశాఖ ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వ చొరవ, ఒడిశా అధికారుల సహకారంతోనే ఈ ఆపరేషన్ విజయవంతమైందని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి, తమ మత్స్యకారుల ప్రాణాలను కాపాడినందుకు ఒడిశా ప్రభుత్వానికి, మెరైన్ పోలీసులకు, మత్స్యశాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.



