మొన్నటి వరకు సమాజం ఆమెను చూసి ఈసడించుకుంది. కన్నవారే ఇంట్లోంచి గెంటివేశారు. ఆకలి తీర్చుకోవడానికి వీధుల్లో నృత్యం చేస్తుంటే వింతగా చూశారు. కానీ, అవే వీధుల నుండి దేశ అత్యున్నత భవనమైన ‘రాష్ట్రపతి భవన్’ వరకు ఆమె సాగించిన ప్రయాణం నేడు ఓ అద్భుతం. కళను నమ్ముకుంటే, అవమానాలనే పూదండలుగా ఎలా మార్చుకోవచ్చో నిరూపించిన గొప్ప కళాకారిణి జోగతి మంజమ్మ. జోగతి నృత్యం, చౌడకి పదాల వంటి కళా రూపాలను ప్రదర్శిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అంతేనా కర్ణాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలైన మొదటి లింగమార్పిడి మహిళగా చర్రిత సృష్టించిన ఆమె పరిచయం నేటి మానవిలో…
1957 ఏప్రిల్ 18న కర్ణాటకలోని బళ్లారి జిల్లా కల్లకంబ గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో ‘మంజునాథ్ శెట్టి’గా పుట్టింది మంజమ్మ. పదిహేనేండ్ల వయసు వచ్చేసరికి మంజునాథ్‌లో శారీరక, మానసిక మార్పులు మొదలయ్యాయి. తనను తాను ఒక స్త్రీగా భావించడం మొదలయింది. అయితే అప్పటి సమాజానికి, కన్న తల్లిదండ్రులకు ఇది మింగుడుపడలేదు. కొడుకు ప్రవర్తన మారాలని ఎన్నో గుడులు, గోపురాలు తిప్పారు, మంత్రగాళ్లకు చూపించారు. లాభం లేకపోయింది. తన లోలోపల రగులుతున్న భావాలను ఎవ్వరూ ఆపలేకపోయారు. తనని తానే భరించలేని పరిస్థితి మంజునాథ్‌ది. చివరికి ఒకరోజు కన్నవారే ఇంటి నుంచి బయటకు నెట్టేశారు. చదువు ఆగిపోయింది, ఆశ్రయం పోయింది. చేతిలో పైసా లేదు. ఒంటరిగా మిగిలిన ఆ చిన్న వయసులో సమాజం విసిరిన రాళ్లు, వేసిన నిందలు అన్నీ ఇన్నీ కావు.
లొంగిపోని నైజం.. ‘జోగతి’ దీక్ష
ఆకలి తట్టుకోలేక, కడుపు నింపుకోవడం కోసం మిగతా ట్రాన్స్‌జెండర్ల మాదిరిగా చీర కట్టుకొని వీధుల్లో భిక్షమెత్తుకున్నారు. ఆ సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఒక దశలో లైంగిక వేధింపులు భరించలేక విషం తాగి చనిపోవాలకున్నారు. కానీ ప్రాణాలతో బయటపడ్డారు. ఇంత జరిగినా 20 మంది తోబుట్టువులతో పాటు ఆమె కుటుంబ సభ్యులెవరూ తనను పలకరించేందుకు కనీసం ఆసుపత్రికి కూడా రాలేదు. ఇది ఆమెను మరింత కుంగదీసింది. కానీ చావు ఆమెను నిరాకరించింది. బహుశా ప్రకృతి ఆమె చేత ఒక గొప్ప కార్యాన్ని చేయించాలని అప్పుడే నిర్ణయించుకుందేమో. ఆ సమయంలోనే ఆమెకు ‘చౌడకి’ (ఒక రకమైన జానపద వాయిద్యం) వాయించే కాలవ్వ అనే జోగతి కళాకారిణి పరిచయమైంది. ఆమె నుండి చౌడకి పదాలు పాడటం, తలపై దేవుడి కలశాన్ని పెట్టుకుని ‘జోగతి నృత్యం’ చేయడం నేర్చుకున్నారు. మంజునాథ్ కాస్తా.. ‘జోగతి మంజమ్మ’గా మారి, ఎల్లమ్మ దేవి సేవకే కాదు.. ఆ జానపద కళకే అంకితమయ్యారు ఆమె. కాలవ్వ బృందంలో చేరి వెయ్యి ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె మరణించిన తర్వాత మంజమ్మనే ఆ బృందానికి నాయకత్వం వహించారు. అంతేకాదు జోగతి నృత్యానికి ప్రజాదరణ తీసుకురావడానికి కృషి చేశారు.
కళే తోడుగా…
సాధారణంగా జోగతి సంప్రదాయంలో మారిన ట్రాన్స్‌జెండర్లను దేవతకు ఇచ్చి పెండ్లి (జోగప్ప దీక్ష) చేస్తారు. అంటే వారికి భర్త అంటూ ఎవరూ ఉండరు. ఎల్లమ్మ దేవినే భర్తగా, సర్వస్వంగా భావిస్తున్నారు. ఆమె కూడా అలాగే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సంసార బంధాలు, కుటుంబ సుఖాలు లేకపోయినా.. సమాజం వెలివేసినా.. జోగతి మంజమ్మ ఏనాడూ అధైర్యపడలేదు. తన లాంటి తోటి ట్రాన్స్‌జెండర్లను చేరదీశారు. తాను పడిన బాధలు వాళ్లు పడకుండా కావల్సిన సహాయ సహకారాలు చేస్తున్నారు. ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ.. అంతరించిపోతున్న ‘జోగతి నృత్య’ కళకు ఊపిరి పోస్తున్నారు. కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలలో జానపద నృత్య కళలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ఆమె ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె సేవలను గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. మంజమ్మ సేవలకు గాను 2006లో కర్ణాటక జనపద అకాడమీ అవార్డు లభించింది. 2010లో కర్ణాటక ప్రభుత్వం ఆమెను వార్షిక కన్నడ రాజ్యోత్సవ అవార్డుతో సత్కరం చేసింది.
అవమానాలపై ‘పద్మశ్రీ’ విజయం
దశాబ్దాల పాటు ఆమె చేసిన నిశ్శబ్ద పోరాటాన్ని కాలం గుర్తించింది. కర్ణాటక ప్రభుత్వం ఆమెను గౌరవిస్తూ 2019లో ‘కర్ణాటక జానపద అకాడమీ’కి మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ అధ్యక్షురాలుగా నియమించబడింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆమెకు ‘పద్మశ్రీ’ (2021) పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌లో పురస్కారం అందుకోవడానికి మంజమ్మ వేదికపైకి నడుచుకుంటూ వచ్చినవారు ఇప్పటికీ ఎవరూ మరువలేరు. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముందుకు రాగానే ఆమె తన పమిటను సరిచేసుకుని, రాష్ట్రపతికి జానపద శైలిలో దిష్టి తీస్తున్నట్టుగా (శుభం కలగాలని) ఒక ముద్రణను ప్రదర్శించారు. ఆ క్షణంలో రాష్ట్రపతి భవనమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. నిన్నటివరకు ఏ సమాజమైతే ఆమెను తాకడానికి నిరాకరించిందో అదే సమాజం ఆమె ముందు తలవంచి గౌరవించింది.
ట్రాన్స్‌జెండర్‌లను ఆదుకోవాలి
కళాకారులకు కులం లేదు, లింగ వివక్ష లేదు.. వారికున్నదల్లా ఒకే ఒక్క గుర్తింపు.. ‘కళ’. జోగతి మంజమ్మ జీవితం కేవలం ఒక ట్రాన్స్‌జెండర్ కథ మాత్రమే కాదు. అవమానాల చీకటిని చీల్చుకుంటూ వచ్చిన ఒక ధృవతార. పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంలో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హక్కులను గుర్తించి వారికి విద్య, ఉద్యోగాలు అందించేలా కృషి చేస్తానని మంజమ్మ అన్నా రు. నిర్లక్ష్యం చేయకుండా, మూలకు విసిరి వేయకుండా తనలాంటి ట్రాన్స్‌జెండర్ పిల్లలను ఆదరించాలని, ప్రభుత్వాలు ఆదుకో వాలని ఆమె ఉద్వేగభరితంగా చెప్పారు.
భూపతి వెంకటేశ్వర్లు, 9490098343
చీకట్లను చీల్చిన అగ్నిపుత్రి జోగతి మంజమ్మ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



