ఇటీవల కాలంలో ఏ పనికైనా కంప్యూటర్ చూడక తప్పడం లేదు. అలాగే చాలా మంది ఫోన్లకు కూడా అతక్కు పోతున్నారు. అంతేకాదు విటమిన్లు, హార్మోన్ల లోపం కూడా దీనికి కారణమవుతున్నాయి. దాంతో అనేక రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కళ్లు మంటగా అనిపించడం, ఎర్రగా మారడం, మసకబారడం, మూసుకుపోవడం, దురద పెట్టడం, ఉబ్బడం, కన్నీళ్లు రాకపోవడం ఇవన్నీ కళ్లు పొడిబారుతున్నాయని తెలిపే లక్షణాలంటున్నారు నిపుణులు. ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే దీర్ఘకాలంలో మరిన్ని కంటి సమస్యలు తప్పవని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కళ్లు పొడిబారకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
కళ్లు పొడిబారడానికి చాలా కారణాలు ఉన్నాయట. A విటమిన్ లోపించడం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్, మొబైల్స్ లేదా కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు గడపడం, వివిధ రకాల అలర్జీలు, వృద్ధాప్యం, దుమ్ము, ధూళి తదితర కారణాల వల్ల కళ్లు పొడిబారతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక కంటి ఆరోగ్యంలో లాక్రిమల్ గ్రంథి ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని నుంచి ఉత్పత్తయ్యే ద్రవాలే ఎప్పటికప్పుడు కళ్లను శుభ్రపరచి కాపాడుతుంటాయని పేర్కొంటున్నారు. అయితే కళ్లు పొడిబారినప్పుడు కంటి ఉపరితలం డీహైడ్రేటెడ్‌గా మారుతుందని చెబుతున్నారు. తద్వారా చికాకు, దురద వంటివి ఇబ్బంది పెడతాయంటున్నారు. ఈ క్రమంలో చాలామంది కళ్లకు వేసుకునే మేకప్‌ను తొలగించుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారట. ఇది కూడా కళ్లు పొడిబారడానికి కారణమవుతుందని వివరిస్తున్నారు.
ఉపశమనం ఇలా
గ్యాడ్జెట్స్‌ను ఉపయోగిస్తున్నప్పుడు చాలామంది కనురెప్ప వేయకుండా కళ్లు పెద్దవి చేసి మరీ స్క్రీన్ వైపు చూస్తుంటారు. ఇలా చేయడం వల్ల కళ్లు పొడిబారి, బాగా మంట పెడతాయంటున్నారు నిపుణులు. అందుకే వీటిని సాధ్యమైనంత దూరంగా ఉంటూనే.. ఉపయోగిస్తున్నప్పుడూ తరచుగా రెప్పలు వాల్చుతూ ఉండాలని సూచిస్తున్నారు. ఎల్లప్పుడూ శరీరం హైడ్రేటెడ్‌గా, స్క్రీన్‌ను ఉపయోగించేటప్పుడు కళ్లను ఆర్పుతూ ఉండాలని, పొడి వాతావరణంలో రక్షణ కళ్లద్దాలను వినియోగించాలని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మొబైల్స్ లేదా కంప్యూటర్లు వంటివి ఉపయోగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
మంచి ఆహారం
కళ్లలోని లాక్రిమల్ గ్రంథులు సమర్ధంగా పనిచేయాలంటే ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలంటున్నారు నిపుణులు. అదే విధంగా నీటి శాతం ఎక్కువగా ఉండే కీరా, స్ట్రాబెర్రీ, పుచ్చకాయం లాంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు. పొడి కళ్ల నుంచి ఉపశమనం పొందాలంటే ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు సప్లిమెంట్లను తీసుకొమ్మని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు వాల్నట్స్, బాదం, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, అవకాడోలను తరచూ తీసుకోవాలని పేర్కొంటున్నారు. ఏసీలు, కూలర్లు, హీటర్లు, హెయిర్ డ్రయర్స్ నుంచి వచ్చే గాలులు నేరుగా కళ్లపై పడకుండా జాగ్రత్త పడాలని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే, ఏసీ వల్ల కంటి దురద, కళ్లు పొడిబారడం, ఎరుపు కూడా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
కాంటాక్ట్ లెన్స్
వైద్యులను సంప్రదించకుండా డ్రాప్స్, మందులు వంటివి ఉపయోగించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. గ్యాడ్జెట్స్ నుంచి వచ్చే నీలి కాంతి నుంచి రక్షణ పొందడానికి బ్లూ లైట్ ఫిల్టర్ గ్లాసెస్ వాడడం మంచిదట. కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌పై ఎక్కువ సమయం పనిచేసే వారు కాంటాక్ట్ లెన్సులను ఉపయోగించకపోవడం మంచిదంటున్నారు. ఎందుకంటే వాటివల్ల కళ్లు పొడిబారే ప్రమాదం ఉందని తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి 20 నిమిషాలకు, సుమారు 20 అడుగుల ముందున్న వస్తువు వైపు 20 సెకన్ల పాటు చూడాలని అంటున్నారు.
మేకప్ తొలగించండి
కళ్లకు మేకప్ వేసుకునే అలవాటు ఉన్నవారు తప్పనిసరిగా కనురెప్పలు, కనుబొమ్మలు, కళ్ల చుట్టు పక్కల చర్మాన్ని మంచి నీటితో శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, పడుకునే ముందు మేకప్‌ను తొలగించుకోవడం తప్పనిసరంటున్నారు. బయటకు వెళ్లే సమయంలో సన్‌గ్లాసెస్ ధరించడం మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల దుమ్ము, ధూళి, కాలుష్యం నుంచే కాకుండా సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి కూడా కళ్లను కాపాడుకోవచ్చని తెలియజేస్తున్నారు. పని చేయడానికి చీకటిగా ఉన్న, ఏసీ గదుల్ని కాకుండా గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.
కాస్త ఎండ తగలనివ్వండి
ఎముకలు బలంగా ఉండటం, కండరాల ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయటం వంటి రకరకాల పనుల్లో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. కానీ చాలా మంది మహిళల్లో డి విటమిన్ లోపం కనిపిస్తుంది. అయితే ఇది శరీరం క్యాల్షియాన్ని సమర్ధంగా గ్రహించుకోవటానికి తోడ్పడుతుంది. ఎముకలు గుల్లబారటం, కింద పడటం వంటి ముప్పులనూ తగ్గిస్తుంది. ఈ క్రమంలో విటమిన్ డి మోతాదులు సరిగా ఉండేలా చూసుకుంటే మొత్తంగా జీవక్రియ, రోగనిరోధక శక్తి పుంజుకుంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆరోగ్యకరమైన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి కీలకమైన ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో విటమిన్ డి పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపిస్తే విడవని నిస్సత్తువ, కండరాల బలహీనత లేదా నొప్పి, ఎముక నొప్పి, తరచూ ఇన్ఫెక్షన్లు, రోగనిరోధక శక్తి క్షీణించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో దిగులు, నిరాశ, ఆందోళన వంటివి తలెత్తొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని లోపం మరి ఎక్కువయ్యేంత వరకూ చాలామందిలో స్పష్టమైన లక్షణాలేవీ కనిపించవట. అందుకే, దీన్ని నిశ్శబ్ద సమస్యగా పేర్కొంటున్నారు. కారణాలు : మన దేశంలో ఎండ ఎక్కువే అయినా విటమిన్ డి లోపం తలెత్తడానికి రకరకాల అంశాలు దోహదం చేస్తున్నాయంటున్నారు నిపుణులు. చాలా మంది చదువులు, ఉద్యోగులు, చర్మ సంరక్షణ పేరుతో రోజులో ఎక్కువ సేపు నీడ పట్టునే ఉంటున్నారట. ఆరు బయటకు వెళ్లటం తక్కువ లేదా బయటకు వెళ్లినా చర్మం మీద ఎండ పడకుండా జాగ్రత్త తీసుకుంటారు.
వీటికి నగరాల్లో గాలి కాలుష్యమూ తోడవుతోంది. ఇది విటమిన్ డి ఉత్పత్తికి అవసరమైన అతినీలలోహిత బి కిరణాలను అడ్డుకుంటుందని పేర్కొంటున్నారు. మనలో విటమిన్ డి బైండింగ్ ప్రొటీన్ (VDBP) కూడా తక్కువని తెలియజేస్తున్నారు. కాబట్టి విటమిన్ డి విషయంలో అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య రోజూ కనీసం 15-30 నిమిషాలు చర్మానికి ఎండ తగిలేలా చూసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో శరీరమే సహజంగా విటమిన్ డిని తయారు చేసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎంతసేపు ఎండ తగలాలనేది వ్యక్తుల చర్మం తీరు, వయసు, నివసించే ప్రాంతం, జీవనశైలి వంటి వాటిమీద ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. తీసుకోవల్సిన ఆహారం: సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి కొవ్వు చేపలు విటమిన్ డి కి చాలా మంచి వనరులు. అలాగే గుడ్డు పచ్చసొన, ఎండ సోకిన పుట్టగొడుగులతో కొంత విటమిన్ డి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు విటమిన్ డి కలిపిన పాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. విటమిన్ డి లోపం లక్షణాలు సృష్టంగా కనిపించవు కాబట్టి, తరచూ రక్త పరీక్ష చేయికోవాలంటున్నారు నిపుణులు. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.



