డ్రగ్స్ గ్రూపుల మధ్య చెలరేగిన ఘర్షణ
దాడుల్లో 25 మంది మృతి
వంద మందికి పైగా గాయాలు
కొలంబో : శ్రీలంకలోని జైలులో రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం రణరంగంగా మార్చింది. దాడులు ప్రతి దాడులతో భయానక వాతావరణం నెలకొంది. జైలు పరిసరాలు యుద్ధభూమిని తలపించాయి. ఈ హింసాత్మక ఘర్షణల్లో 25 మృతి చెందారని అధికారులు సోమవారం తెలిపారు. ఈ విషాదకర సంఘటన దేశ రాజధాని కొలంబోకు పశ్చిమ కోస్తా తీర ప్రాంత పట్టణమైన నగొంబొ జైల్లో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది ?
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నగొంబొ జైలు ఖైదీలతో కిక్కిరిసిపోయి ఉంది. ఆదివారం సాయంత్రం రెండు డ్రగ్ ముఠాలకు చెందిన ఖైదీల మధ్య గొడవ ప్రారంభమైంది. దీంతో వారు భౌతిక దాడులకు దిగారని పోలీసులు తెలిపారు. జైలు సిబ్బంది క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరికి తుపాకీ గుండు గాయాలు కాగా, మరికొందరికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఘర్షణలు జరుగుతున్న తరుణంలో పక్కనే విభాగంలో ఉన్న మహిళా ఖైదీలు భయంతో జైలు పైకప్పుపైకి ఎక్కి తమను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అల్లర్లకు పాల్పడిన ఖైదీలు జైల్లోని తుపాకులను లాక్కోవడంతో తిరిగి సోమవారం కూడా ఘర్షణలు చెలరేగాయి. తొలుత జరిగిన ఘర్షణలు, తదనంతరం చోటు చేసుకున్న కార్యకలాపాల్లో వందమందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. జైల్లో మాదకద్రవ్యాల సరఫరాకు మద్దతిస్తున్న గ్రూపునకు, దాన్ని వ్యతిరేకిస్తున్న గ్రూపునకు మధ్య జరిగిన గొడవలు అంతిమంగా హింసకు దారి తీసినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. దీంతో భద్రతను గణనీయంగా బలోపేతం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసుల ప్రత్యేక బృందాలు, అల్లర్ల నియంత్రణా బృందాలను మోహరించారు. ఈ ఘర్షణల నేపథ్యంలో తదుపరి హింస చెలరేగకుండా నివారించేందుకు గానూ ముగ్గురు ఖైదీలను సోమవారం వేరే జైలుకు తరలించారు. ఈ సంఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు జైళ్ల విభాగ మీడియా ప్రతినిధి గజనాయకె తెలిపారు. ఈ పరిస్థితులకు దారితీసిన కారణాలపై సమగ్రంగా విచారణ జరిపి, నివేదిక అందించేందుకు గానూ జైళ్ల కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విడిగా పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతోందన్నారు. దీనిపై సవివరమైన నివేదిక అందించాలని న్యాయశాఖ మంత్రి ననయఖరా ఆదేశించారు.
రణరంగంగా శ్రీలంక జైలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



