Tuesday, July 7, 2026
E-PAPER
Homeజాతీయంఅయోధ్య పాసుల్లో చేతివాటం

అయోధ్య పాసుల్లో చేతివాటం

- Advertisement -


రామమందిరంలో దళారుల దందా
చాలామంది లక్షాధికారులయ్యారు
అయోధ్యకు చెందిన పూజారి కర్పాత్రి మహారాజ్ సంచలన ఆరోపణలు
చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలపై తీవ్ర విమర్శలు
ట్రస్ట్‌పై సిట్‌‌తో కాదు.. సీబీఐతోనే విచారణ జరపాలని డిమాండ్

​లక్నో : దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అయోధ్యలోని రామ మందిర విరాళాల వివాదంపై అన్ని వైపుల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో అయోధ్యకు చెందిన పూజారి కర్పాత్రి మహారాజ్ కూడా చేరారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవహారాలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రామమందిరంలో విరాళాల దుర్వినియోగం, పాస్‌ల జారీ వ్యవస్థలో అవినీతి, ట్రస్ట్‌లో కొందరి ఆధిపత్యం వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.‘ది వైర్‌‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావుపై కర్పాత్రి మహారాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఆలయ నిధుల దుర్వినియోగంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో చంపత్ రాయ్ ట్రస్ట్‌కు నాయకత్వం వహించినందున జరిగిన పరిణామాలకు ఆయన బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. సిట్‌ ఏర్పడిన 15 రోజుల తర్వాత చంపత్ రాయ్ నైతిక బాధ్యత పేరుతో రాజీనామా చేశారని గుర్తుచేసిన కర్పాత్రి మహారాజ్.. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం అప్పటి యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ వెంటనే రాజీనామా చేసిన విషయాన్ని ఉదాహరణగా వివరించారు. అలాంటి రాజకీయ, నైతిక బాధ్యతను చంపత్ రాయ్ కూడా చూపాల్సిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో ఒక్కరే కాదు..పలువురి ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. అందరి కుమ్మక్కుతోనే ఈ పరిస్థితి వచ్చిందనీ, ఇందులో ప్రతి ఒక్కరికీ వాటా ఉందని అన్నారు. ట్రస్ట్‌ను 2020లో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసినందున.. దాని వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఏర్పాటైన సంస్థపై రాష్ట్ర సిట్‌ ఎలా విచారణ చేస్తుందని ప్రశ్నించారు. 2024లో ట్రస్ట్‌కు సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరినప్పుడు.. సమాచారం గోప్యమైంది, సున్నితమైందంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించేందుకు నిరాకరించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

రామజన్మభూమి పోరాటంతో అనుబంధం ఉన్న పూజారులను క్రమంగా పక్కన పెట్టి, ట్రస్ట్‌లో కొందరు మాత్రమే ఆధిపత్యం చెలాయించే పరిస్థితి ఏర్పడిందని కర్పాత్రి మహారాజ్ ఆరోపించారు. ట్రస్ట్‌లో అహంకారం పెరిగిందని, నియంతృత్వ ధోరణి కనిపిస్తోందని విమర్శించారు. చంపత్ రాయ్‌తో పాటు ట్రస్ట్ కోశాధికారి గోవింద్ గిరిపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఆలయానికి వచ్చిన విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వినియోగిస్తున్నారు అనే విషయాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉండాల్సిందని అన్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామమందిరాన్ని సందర్శించిన సందర్భంగా తనకే ప్రవేశ పాస్ ఇవ్వలేదని కర్పాత్రి మహారాజ్ ఆరోపించారు. తన పరిచయస్తులకు పాస్‌లు కావాలంటే నెల సమయం పడుతుందనీ, కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కొందరికి దళారుల ద్వారా వెంటనే పాస్‌లు లభిస్తున్నాయని చెప్పారు. పాస్‌ల వ్యవస్థలో దళారులు ఎవరు అన్న ప్రశ్నకు పేర్లు చెప్పేందుకు నిరాకరించిన ఆయన.. వారి సంఖ్య చాలా పెరిగిందనీ, చాలామంది లక్షాధికారులయ్యారని ఆరోపించారు. పాస్‌ల జారీ వ్యవస్థలో కూడా కొందరు డబ్బు సంపాదించారని చెప్పారు. కాగా కర్పాత్రి మహారాజ్ చేసిన వ్యాఖ్యలపై సంబంధిత ట్రస్ట్ సభ్యులు, అధికారుల నుంచి మాత్రం స్పందన రావాల్సి ఉంది.

​చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలకు ఆమోదం ట్రస్ట్‌ ‌తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌
అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగ ఆరోపణల నేపథ్యంలో శ్రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. అలాగే రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్‌ను నియమించింది. చంపత్‌ రాయ్‌ రాజీనామాను ఆమోదించిన ట్రస్టు.. ఆయన స్థానంలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్‌కు బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని ట్రస్టు కోశాధికారి గోవింద్‌ గిరి మీడియాకు వెల్లడించారు.
రామమందిర ప్రాంగణంలోని అతిథి గృహంలో సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రస్ట్ సమావేశానికి చైర్మెన్‌ నృత్య గోపాల్ దాస్ సహా ‌పలువురు సభ్యులు హాజరయ్యారు. అయితే తమ రాజీనామాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా సమావేశానికి హాజరు కాలేదు. సమావేశానికి ముందు నృత్య గోపాల్ దాస్ స్పందిస్తూ.. రామలల్లా ఆలయానికి సంబంధించిన వివాదం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ పాపానికి పాల్పడిన వారెవరైనా వారికి అత్యంత కఠిన శిక్ష విధించాలని కోరారు.

మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. అరెస్టు చేసిన ఎనిమిది మంది ఇండ్లలో నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తొలగించబడిన సీసీటీవీ ఫుటేజీని కూడా పునరుద్ధరించినట్టు సమాచారం. ఆ ఫుటేజీలో ఆలయ ప్రాంగణం నుంచి నగదు బయటకు తీసుకెళ్తున్న సమయంలో కొందరు నిందితులు కరెన్సీ నోట్లను దాచిపెడుతున్న దృశ్యాలు కనిపించినట్టు అధికారులు చెప్తున్నారు. దర్యాప్తులో భాగంగా ట్రస్ట్ గత ఐదేండ్ల ఆర్థిక లావాదేవీల ఆడిట్ నివేదికలను కూడా పరిశీలించే అంశంపై సిట్‌ సమాలోచనలు చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -